దేశ వ్యాప్తంగా రైల్వే వ్యవస్థ రోజు రోజుకు మరింత అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే సెమీ హైస్పీడ్ రైళ్లు అందుబాటులోకి రాగా, బుల్లెట్ రైలు ప్రాజెక్టు కొనసాగుతోంది. నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ముంబై- అహ్మదాబాద్ నడుమ ఈ రైలును అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2030 నాటికి దేశంలో తొలి బుల్లెట్ రైలు పరుగులు తీసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో రైల్వే మంత్రి అశ్విని వైవష్ణవ్ అదిరిపోయే విషయం చెప్పారు. 2047 నాటికి మన దేశంలో 7,000 కిలో మీటర్ల మేర హై స్పీడ్ ప్యాసింజర్ కారిడార్ లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ కారిడార్లలో రైళ్లు గంటకు 350 కి.మీ వేగంతో నడవనున్నట్లు వెల్లడించారు. CII ఇంటర్నేషనల్ రైల్వే సమావేశం 2025లో పాల్గొన్న ఆయన, ఈ విషయాన్ని వెల్లడించారు.
భారత్ లో గత దశాబ్ద కాలంగా రైల్వే ఎంతో అభివృద్ధి సాధించిందని మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రైల్వే లైన్ల నిర్మాణం నుంచి, విద్యుదీకరణ వరకు పనులు శరవేగంగా కొనసాగుతున్నట్లు వెల్లడించారు. “గత 10 ఏళ్లలో 35,000 కి.మీ కంటే ఎక్కువ రైల్వే ట్రాక్‌లు నిర్మించబడ్డాయి. 46,000 కి.మీ కంటే ఎక్కువ విద్యుదీకరణ చేయబడ్డాయి. ఏటా 7,000 రైల్వే కోచ్ లు ఉత్పత్తి అయ్యాయి. రైల్వే అభివృద్ధిలో అనేక ఇతర దేశాల కంటే ముందున్నాం” అని వివరించారు.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 156 వందే భారత్ సర్వీసులు, 30 అమృత్ భారత్ రైళ్లు నడుస్తున్నాయని మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వీటిలో నాలుగు నమో భారత్ సర్వీసులు ఉన్నాయన్నారు. మన దేశంలో తయారు చేసిన రోలింగ్ స్టాక్, విద్యుత్ పరికరాలు ఆఫ్రికా, యూరప్‌లకు ఎగుమతి చేయబడుతున్నట్లు తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో, భారతీయ రైల్వే రికార్డు స్థాయిలో 1,681 లోకోమోటివ్‌లను ఉత్పత్తి చేశాయన్నారు. ఇది యూరప్, ఉత్తర, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా దేశాలు కలిపి చేసిన ఉత్పత్తికి మించి ఉందన్నారు. ప్రతి రోజూ దేశ వ్యాప్తంగా 24,000 రైళ్లు నడుస్తుండటంతో, సాంప్రదాయ ట్రాక్ అప్ గ్రేడ్‌లు, ఆయా కారిడార్ల సామర్థ్య విస్తరణ చేపడుతున్నట్లు చెప్పారు. వేగవంతమైన రైల్వే ఆధునీకరణ కోసం మొత్తం రూ. 2,65,200 కోట్ల మూలధన వ్యయం కేటాయించినట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు.
🚆 Inaugurated the 16th International Railway Equipment Exhibition 2025
✅ Bringing together manufacturers, MSMEs & innovators to drive railway modernization and network expansion.📍Bharat Mandapam, New Delhi pic.twitter.com/54dHaWiRGM
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) October 15, 2025
భారతీయ రైల్వే ఆధునీకరణ కేవలం మౌలిక సదుపాయాల గురించి మాత్రమే కాదు, ప్రయాణీకుల అనుభవాన్ని మెరుగుపరచడం కోసం అని మంత్రి వైష్ణవ్ వివరించారు. ప్రతి ప్రయాణం సురక్షితంగా, వేగంగా, మరింత సౌకర్యవంతంగా ఉండేలా అనేక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. కవచ్ 4.0 అమలు, హై-స్పీడ్ రైళ్ల కోసం కవచ్ 5.0 అభివృద్ధి, కొత్త రైలు డిజైన్ల పరిచయం, రికార్డు పెట్టుబడులతో, భారతీయ రైల్వేలు ప్రపంచంలోని అత్యంత ఆధునిక నెట్ వర్క్ లలో ఒకదానిగా మారుతుందన్నారు. నెక్ట్స్ జెనరేషన్ అమృత్ భారత్ లోకోమోటివ్‌లు, కోచ్‌ల అభివృద్ధి జరుగుతుందన్నారు. 36 నెలల్లో ఇవి అందుబాటులోకి రానున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
రైల్వే మంత్రిత్వ శాఖతో కలిసి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) ఆధ్వర్యంలో 16వ ఇండియన్ రైల్వేస్ ఎక్విప్‌మెంట్ ఎగ్జిబిషన్ (IREE) ఢిల్లీలో నిర్వహించారు. మూడు రోజుల పాటు ఈ ప్రదర్శన (15–17 అక్టోబర్ 2025) కొనసాగనుంది. ఇందులో 15 కంటే ఎక్కువ దేశాల నుంచి 450 మందికి పైగా ప్రదర్శనకారులు పాల్గొన్నారు. రోలింగ్ స్టాక్, సిగ్నలింగ్ వ్యవస్థలు, పట్టణ మొబిలిటీ, ప్రయాణీకుల సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు, ఇంటీరియర్‌లు, గ్రీన్ మొబిలిటీ టెక్నాలజీలను ఇందులో ప్రదర్శించారు.