Indian Railways modern train: రైలు మారింది.. ప్రయాణం మరిచిపోలేని అనుభూతి అవుతోంది! నిజంగా ఇటీవల ఈ రైలు ప్రయాణం సాగించిన వారు అదృష్టవంతులు. ఎందుకంటే ఆ రైలు.. ఇప్పుడు పాతదికాదు. దాని నడక, శబ్దం, లోపల వాతావరణం అన్నీ కొత్తగా కనిపిస్తున్నాయి. కొన్నాళ్లుగా ఎదురు చూస్తున్న ప్రయాణికుల కల ఇప్పుడు నెరవేరినట్టే! ఓ సారి ప్రయాణించి వచ్చినవాళ్లు.. బస్సులో కన్నా మెరుగ్గా ఉంది.. అంత సౌకర్యంగా ఉందని ఆశ్చర్యపోతున్నారు. అసలు విషయం ఏమిటంటే, దేశంలోని అత్యంత పొడవైన మార్గాల్లో నడిచే గురుదేవ్ ఎక్స్‌ప్రెస్ ఇప్పుడు సరికొత్త అవతారంలోకి వచ్చింది.
దీని రికార్డ్ పెద్దదే..
దేశంలోని అత్యంత పొడవైన దూరం ప్రయాణించే 12659/12660 గురుదేవ్ ఎక్స్‌ప్రెస్ ఇప్పుడు కొత్త ఒరవడితో ప్రయాణికులను ఆకట్టుకుంటోంది. నాగర్‌కోయిల్ నుంచి షాలీమార్ వరకు నడిచే ఈ రైలు తాజాగా ఆధునిక LHB కోచ్‌లతో నడవడం ప్రారంభించింది. పాత కోచ్‌ల స్థానంలో వచ్చిన ఈ కొత్త బోగీల వల్ల ప్రయాణం మరింత వేగంగా, భద్రతగా, సౌకర్యంగా మారింది. ఐదు రాష్ట్రాల మీదుగా 3000 కిలోమీటర్లకు పైగా దూరాన్ని కవర్ చేసే ఈ రైలు ఇప్పుడు సాధారణ ప్రయాణికుడికి ప్రీమియం అనుభవాన్ని కలిగిస్తోంది. మరి రైలు ఎక్కినా ఫ్లైట్ ఫీల్ కావాలనుకుంటే, గురుదేవ్ ఎక్స్‌ప్రెస్ తప్పనిసరిగా ఎక్కాల్సిందే!
ఈ రైలు స్పెషల్ ఇదే..
తమిళనాడులోని నాగర్‌కోయిల్ నుంచి పశ్చిమ బెంగాల్‌లోని షాలీమార్ వరకు నడిచే 12659/12660 గురుదేవ్ ఎక్స్‌ప్రెస్, భారత రైల్వేకు ఎంతో ప్రత్యేకత ఉన్న రైలు. ఇది ఏకంగా ఐదు రాష్ట్రాల మీదుగా.. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ మీదుగా 3000 కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణిస్తుంది. ఇదే రైలు ఇప్పుడు ఆధునిక LHB (Linke Hofmann Busch) రేక్స్ తో నడుస్తోంది. ఇది ప్రయాణికుల కోసం భద్రత, వేగం, సౌకర్యాల పరంగా అద్భుతమైన మార్పు అని చెప్పొచ్చు.
అంతా అద్భుతమే..
LHB కోచ్‌లు అనేవి జర్మన్ కంపెనీ డిజైన్ చేసిన ఆధునిక రైలు బోగీలు. ఇవి ప్రస్తుతం ఇండియన్ రైల్వేలో అత్యంత భద్రత గల కోచ్‌లు. పాత ఐసీఎఫ్ కోచ్‌లతో పోలిస్తే ఇవి చాలామందికి ప్రయాణంలో అరుదైన అనుభూతి ఇస్తాయి. ఇవి బలంగా తయారవుతాయి, ప్రమాదం జరిగినా ఒక బోగీపై మరో బోగీ ఎక్కే ప్రమాదం తక్కువగా ఉంటుంది. ప్రయాణ సమయంలో శబ్దం తక్కువగా ఉంటుంది. వేగం ఎక్కువగా పెరుగుతుంది. అంతేకాదు లోపలి కుర్చీలు, బర్త్‌లు కూడా కంఫర్ట్‌తో ఉంటాయి. ఇదంతా కలిపి సాధారణ ప్రయాణికుడికే కాదు, కుటుంబంతో ప్రయాణించే వారికి కూడా మంచి అనుభవం కలుగుతుంది.
ఇది వారానికి రెండు సార్లు మాత్రమే నడిచే రైలు. దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఇది దక్షిణ భారత్‌లోని ఓ మూలనుండి, తూర్పు భారత్ చివరి ప్రాంతమైన కోల్ కతా సమీపంలోని షాలీమార్ వరకు నడుస్తుంది. మార్గమధ్యలో తిరునెల్వేలి, మదురై, తంజావూరు, మయిలాడుతురై, చెన్నై, విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్, కటక్, ఖరగ్‌పూర్ లాంటి పెద్ద స్టేషన్లన్నీ కలుపుకుని సాగుతుంది. ఒక కుటుంబం మొత్తంగా 3 రాష్ట్రాల్లో వివిధ బంధువుల ఇళ్లకు వెళ్లాలనుకున్నా, ఇది ఒకే రైలు సరిపోతుంది.
పాత సమస్యకు చెక్..
గురుదేవ్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులు ఇప్పటి దాకా పాత కోచ్‌లలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రయాణంలో కంపనాలు ఎక్కువగా ఉండేవి, బెడ్ షీట్‌లు ఎక్కడికక్కడ కదిలిపోతుండేవి, పిల్లల్ని పడుకోబెట్టడం కూడా కష్టమే. కానీ ఇప్పుడు ఈ మార్పుతో ప్రయాణమే ఒక సందడిగా మారింది. రాత్రివేళ బర్త్ మీద పడి అల్లరిచేసే పిల్లలు కూడా సౌకర్యంగా నిద్రపోతున్నారు. ఆన్‌టైమ్ నడక, వేగవంతమైన ప్రయాణం, కన్‌ఫర్టబుల్ సీటింగ్.. ఇవన్నీ కలిపి సాధారణ తరగతి ప్రయాణికుడికి కూడా ఇది నాకెందుకు ముందే దొరకలేదో అనిపించేలా మారింది. ప్రయాణమంతా గ్లైడ్ అవుతూ సాగుతుంది.
ఇది కేవలం ఒక రైలు మార్పు కాదు.. భారతీయ రైల్వేల్లో మారుతున్న వాతావరణానికి సంకేతం. రైలు ప్రయాణాన్ని భద్రతగా, శుభ్రంగా, వేగంగా చేయాలన్న లక్ష్యంతో భారత రైల్వేలు అనేక మార్పులు తీసుకువస్తున్నాయి. అందులో గురుదేవ్ ఎక్స్‌ప్రెస్‌కి కొత్త కోచ్‌లు ఏర్పాటు చేయడం ఒక మైలురాయిలాంటిది. ఇకపై ఈ రైల్లో టికెట్ దొరకడం కష్టం కావచ్చు. ఎందుకంటే ఇది ఇప్పుడు మరింత డిమాండ్‌లోకి వచ్చింది. అసలు ప్రయాణించాకే తెలుస్తుంది.. ఎందుకు అందరూ ఇప్పుడు దీనిపైనే ఫిదా అవుతున్నారో!