RAC Ticket Rules Change: భారతీయ రైల్వేలో ప్రయాణించే వారికి RAC (Reservation Against Cancellation) విధానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వెయిటింగ్ లిస్ట్ లో ఉండకుండా రిజర్వేషన్ తో ప్రయాణించే అవకాశం కల్పించే ఈ సౌకర్యం దశాబ్దాలుగా అమల్లో ఉంది. అయితే, ఇప్పుడు ఈ విధానాన్ని రద్దు చేయాలని భారతీయ రైల్వే ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే రైలు ప్రయాణికులపై ఎలాంటి ప్రభావం పడుతుంది? అసలు RAC విధానాన్ని ఎందుకు మార్చాలనుకుంటున్నారు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
1980లలో ప్రవేశపెట్టిన RAC విధానం ప్రకారం, కన్ఫర్మ్ బెర్త్ అందుబాటులో లేకపోయినా ప్రయాణికులు రిజర్వేషన్‌తో రైలు ఎక్కవచ్చు. అయితే, వీరికి పూర్తి బెర్త్ కేటాయించరు. సాధారణంగా ఇద్దరు RAC ప్రయాణికులకు ఒక సైడ్ లోయర్ బెర్త్ ను కేటాయిస్తారు. పగటిపూట ఇద్దరూ కూర్చోవడానికి, రాత్రిపూట అందుబాటులో ఉన్న స్థలాన్ని పంచుకోవడానికి ఈ ఏర్పాటు ఉంటుంది. అయితే, ఇద్దరు ప్రయాణికుల నుంచి పూర్తి టికెట్ ఛార్జీ వసూలు చేస్తున్నప్పటికీ, వ్యక్తిగతంగా పడుకునేందుకు బెర్త్ లభించకపోవడంపై చాలాకాలంగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రయాణికులకు పూర్తి బెర్త్ ఇవ్వకుండా పూర్తి ఛార్జీ వసూలు చేయడం ఎంతవరకు కరెక్ట్? అనే ప్రశ్న ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ అంశంపై రైల్వే శాఖ సమీక్ష చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, RAC విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. కానీ, ఆ దిశగా అడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.
RAC ప్రయాణికుల నుంచి పూర్తి ఛార్జీ వసూలు చేయడంపై పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC) కూడా గతంలో ఆందోళన వ్యక్తం చేసింది. ఫిబ్రవరి 4, 2026న సమర్పించిన 36వ నివేదికలో ఈ అంశాన్ని ప్రస్తావించింది. చార్ట్ తయారైన తర్వాత కూడా RAC హోదాలోనే ఉండి, పూర్తి బెర్త్ పొందలేని ప్రయాణికులకు కొంత మొత్తాన్ని తిరిగి చెల్లించే విధానాన్ని తీసుకురావాలని రైల్వేశాఖకు సూచించింది.
ప్రస్తుత నిబంధనల ప్రకారం RAC టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది. ఇతర ప్రయాణికులు తమ టికెట్లను రద్దు చేసుకుంటే లేదా ప్రయాణంలో బెర్త్ ఖాళీ అయితే RAC ప్రయాణికులకు పూర్తి బెర్త్ కేటాయిస్తారు. ఈ ప్రక్రియను TTEలు అందుబాటులో ఉన్న బెర్త్ ల ఆధారంగా నిర్వహిస్తారు.ముఖ్యంగా రాత్రిపూట సుదూర ప్రయాణాలు చేసే వారికి ఒకే బెర్త్ ను మరొకరితో పంచుకోవడం ఇబ్బందిగా మారుతోంది. అందుకే RAC విధానంలో మార్పులు అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, రైల్వే శాఖ తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.
Read Also: ఇంజిన్ లేకుండానే పరుగులు.. బాబోయ్.. వందే భారత్‌లో ఇన్ని రహస్యాలా?