Indian railway humanity: బిడ్డ రైలులో.. ప్లాట్‌ఫామ్ లో తల్లి ఏడుపులు.. ఇంజిన్ ముందుకు కదులుతోంది.. గమనించినవాళ్లు ఒక్కసారిగా ఊపిరి పీల్చలేకపోయారు.. అసలేం జరిగింది? రైలు ఎక్కడ ఆగింది? ఆ తల్లి బిడ్డను చేరుకుందా? ఒక్క రైలు ప్రయాణమే కాదు.. మానవత్వానికి నిదర్శనమైన ఘటన ఇది. ఓ తల్లి బిడ్డను కలిపేందుకు ఇండియన్ రైల్వే ఏం చేసిందో తెలుసుకుంటే.. శభాష్ అనేస్తారు.
సోషల్ మీడియాలో వైరల్..
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఓ తల్లి ఆవేదన మన దేశపు రైల్వే వ్యవస్థలో మానవతకు చోటుందన్న వాస్తవాన్ని మళ్ళీ చాటి చెప్పింది. ఓ తల్లి చేతిలో పసికందు. అప్పుడే ట్రైన్ వచ్చింది. ట్రైన్ ఎక్కిన తల్లి బిడ్డను అలా ఉంచిన క్షణంలో బిడ్డ ఏడుపులు మొదలయ్యాయి. ఆకలితో ఏడుస్తున్న బిడ్డ కోసం తల్లి చిన్న ప్లాట్‌ఫామ్ స్టాల్ దగ్గరకు పాల కోసం పరుగెత్తింది. అదే సమయంలో రైలు ఆగకుండా ముందుకు కదిలింది. తల్లి మాత్రం వణికిపోయింది. తాను వెళ్లిపోయే రైలు తను చేరుకోలేని దూరం వరకు వెళ్లిపోతుందన్న భయం ఆమె ముఖంలో స్పష్టంగా కనిపించింది.
ఆ తర్వాత ఏం జరిగింది?
రైలులో బిడ్డ ఒంటరిగా ఏడుస్తూ ఉన్న అరుపులు, ఆ తల్లి చెవికి వినిపిస్తూనే ఉన్నాయి. దేఎనితో ఆమె కళ్ల నుంచి కన్నీళ్లు గలగల నేల రాలాయి. క్షణాల్లోనే అక్కడున్న ప్రయాణికులు, చుట్టుపక్కలవాళ్లు గమనించారు. కానీ ఆ సమయంలో ఈ తతంగాన్ని గమనించినవారు ఇంకొకరు ఉన్నారు.. ఆయనే రైల్వే గార్డు. అతను తన విధుల్లో అప్రమత్తంగా ఉండి, స్టేషన్ చివర్లో ఉన్న పరిస్థితులను గమనిస్తున్నాడు. ఆ తల్లిని చూడగానే ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా తన చేతిలోని హ్యాండ్ సిగ్నల్‌ను ఊపాడు. అలా అక్షరాలా ఒక సెకన్ లో ఆయన తీసుకున్న నిర్ణయమే.. ఆ తల్లిని తిరిగి తన బిడ్డ దగ్గరకు చేర్చింది.
తల్లీ బిడ్డ కోసం.. రైలే ఆగింది!
ఈ సంఘటనను చూసినవారందరికీ కళ్లలో కన్నీరు వచ్చింది. ఎందుకంటే ఆ గార్డు చేసిన పని కేవలం విధిగా కాకుండా, తక్షణం ఓ తల్లి కోసం తీసుకున్న చర్య. సాధారణంగా రైలు ఒకసారి కదిలిన తరువాత అప్రూవల్ లేకుండా ఆపడం అనేది ఓ పెద్ద ప్రక్రియ. కానీ ఇక్కడ ఆ గార్డు మానవతా కోణంలో ఆలోచించారు. ఒక తల్లి.. ఒక బిడ్డ.. ఇద్దరి మధ్య విభజన క్షణాల వ్యవధిలో జరుగుతోందన్న ఆవేదనను అతను మనస్ఫూర్తిగా గ్రహించాడు.
ప్రస్తుతం ఈ సంఘటన ఎక్కడ జరిగిందో స్పష్టంగా తెలియదు. ఎందుకంటే ఈ వీడియో వైరల్ అయినప్పటికీ స్టేషన్ పేరు లేదా రైలు నంబర్ ఎక్కడా కనిపించలేదు. కానీ దీనికి లొకేషన్ అవసరం లేదు. ఇది ఇండియన్ రైల్వేలో పనిచేస్తున్న వేలాదిమంది ఉద్యోగులలో ఒక్కరిలో కనిపించిన మానవత్వానికి ప్రతీక.
Also Read: Indian Railway Modernization: చిన్న స్టేషన్ కు.. హైటెక్ హంగులు.. ఎక్కడంటే?
అమ్మ ప్రేమ, గార్డు స్పందన
పాల కోసం తల్లి రైలు దిగి పరుగెత్తడం అనేది ఆమె తప్పు కాదు. అదే సమయంలో రైలు కదలడం అనేది యంత్రాంగం పని. కానీ ఈ రెండు మధ్య వచ్చిన పరిస్థితికి, పుట్టిన బిడ్డపై గల మానవతా స్పర్శే వారిద్దరినీ కలిపింది. ఒక విధంగా చూసుకుంటే.. ఈ సంఘటనలో నష్టమేమీ జరగలేదు. కానీ జరిగినది మాత్రం ఒక సందేశం.
ఈ రోజుల్లో రైల్వే వ్యవస్థ పూర్తిగా ఆటోమేటెడ్ వ్యవస్థల్లోకి మారుతోంది. ఇంటర్‌లాకింగ్‌లు, డిజిటల్ కమ్యూనికేషన్, ట్రాక్ మానిటరింగ్ వంటి సాంకేతికతలే ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. కానీ ఆ టెక్నాలజీ వెనుక మనుషులు ఉన్నారు. అటువంటి వారిలో ఒకరు ఈ గార్డు. ఈ సంఘటనను చూశాక ఎందరో ప్రయాణికులు సోషల్ మీడియాలో స్పందించారు. ఇలాంటి గార్డులు ఉండటం వల్లే ఈ దేశం సురక్షితంగా ఉంది, తల్లి ప్రాణంగా లెక్కించే బిడ్డకు రైల్వే గార్డు జీవితాన్ని ఇచ్చినట్టే అంటూ హృదయాన్ని తాకే కామెంట్లు వెల్లువెత్తాయి.
ఒక్క క్షణం. ఒక్క నిర్ణయం. ఒక్క ఆత్మీయ భావన. ఇవే ఒక తల్లిని, ఒక బిడ్డను, ఒక కుటుంబాన్ని మళ్ళీ కలిపాయి. రైలు ప్రయాణాలే కాదు, జీవితంలోనూ ఏ మార్గం ఎప్పుడు తప్పిపోతుందో చెప్పలేం. కానీ మన చుట్టూ మానవత్వం ఉన్నప్పుడు.. ఎక్కడైనా ఒక గార్డు ఉన్నప్పుడు.. ఆ మార్గం మళ్ళీ మన దారి అవుతుందనిపిస్తుంది. అలాంటి ఘటనే ఇది.