Indian Railway Modernization: ఒక చిన్న స్టేషన్‌కి హైటెక్ టచ్ వస్తుందంటే ఎలా ఉంటుందో తెలుసా? వందలాది మార్గాలు కలిసే చోట.. క్షణాల వ్యవధిలో రైళ్లు మార్గం మార్చుకుంటే.. అవి ఎదురెదురుగా వస్తూ కూడా ప్రమాదం జరగకుండా దూసుకెళ్లితే.. ఇదంతా సినిమా కాదు. నిజంగానే జరుగుతోంది. అదీ మన ఇండియన్ రైల్వే సత్తా అని చెప్పవచ్చు. ఇంతకు ఏ స్టేషన్? ఎక్కడ ఉందో తెలుసుకుందాం.
❂ ఇదొక చిన్న స్టేషన్ కానీ..
అస్సాంలోని మరియానీ జంక్షన్ ఇప్పుడు పూర్తిగా హైటెక్ హబ్‌గా మారిపోయింది. ఇక్కడ తాజాగా అమలు చేసిన ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్ (Electronic Interlocking System) వల్ల రైళ్ల రాకపోకలు మరింత సురక్షితంగా, సమర్థవంతంగా మారాయి. ఈ సాంకేతిక మార్పు ద్వారా రైలు ప్రయాణం కేవలం వేగవంతమైనదే కాకుండా, అత్యంత భద్రత కలిగినట్లుగా కూడా మారుతోంది.
గతంలో స్టేషన్ మాస్టర్లు, పాయింట్ మెన్లు లివర్లు నొక్కుతూ మార్గాలు మార్చాల్సి వచ్చేది. అది పూర్తిగా మనుషులపై ఆధారపడే ప్రక్రియ. పొరపాటు జరిగే అవకాశం ఎక్కువ. ముఖ్యంగా భారీగా రైళ్ల రాకపోకలు ఉన్న జంక్షన్లలో ఇది ప్రమాదకరం. ఇక ఇప్పుడు ఈ సరికొత్త ఇంటర్‌లాకింగ్ సిస్టమ్ వల్ల అలా కాదు. ఒకే కంప్యూటర్ స్క్రీన్ పై నుంచి 135 రూట్లను, 33 పాయింట్లను, 44 ట్రాక్ సర్క్యూట్లను ఒకేసారి పర్యవేక్షించగలుగుతున్నారు.
❂ ఇప్పుడు వచ్చిన మార్పులేంటి?
ఈ సాంకేతిక వ్యవస్థతో రైళ్లు ఏ దిశనుంచి వస్తున్నాయో, ఏ దిశకు వెళ్లాలో ముందే అర్థం అవుతుంది. ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు రావడాన్ని పూర్తిగా అడ్డుకుంటుంది. మార్గాలు మార్చే వ్యవహారం వేలు కాదు, కేవలం మౌస్ క్లిక్ మాత్రమే చాలు. రైళ్ల వేగం, సమయ పాలన, సేఫ్టీ కూడా ఇకపై ఈ స్టేషన్ సొంతం కానుంది. మరియానీ జంక్షన్ ప్రాధాన్యం చాలా ఎక్కువ. ఇది నార్త్‌ఈస్ట్ ఫ్రంట్‌లో ఒక కీలక రైల్వే నెక్సస్. పశ్చిమ బెంగాల్, నాగాలాండ్, మణిపూర్ లాంటి రాష్ట్రాల నుంచి వచ్చే అనేక రైళ్లకు ఇది గుండా వెళ్లే మార్గం. అలాంటి వ్యూహాత్మక స్థలంలో టెక్నాలజీ ఆధారిత మార్పు జరగడం అనేది గొప్ప విషయమే.
ఈ కొత్త వ్యవస్థ వల్ల రైల్వే సిబ్బంది పని ఒత్తిడి తగ్గుతోంది. ట్రాక్ మార్పులు చేయడానికి గంటల తరబడి మనుషులు పని చేయాల్సిన అవసరం ఉండదు. అదే సమయంలో ప్రయాణికుల ప్రాణాలకు గట్టి కవచం ఏర్పడుతుంది. ఉదాహరణకు, రాత్రిళ్లు తక్కువ చూపులో పాత విధానాలు సరిగ్గా పని చేయకపోవచ్చు. కానీ ఇది కంప్యూటరైజ్డ్ వ్యవస్థ కనుక, ఎలాంటి వెలుగు లేకపోయినా ట్రైన్ల పథం స్పష్టంగా తెలుస్తుంది.
Also Read: August 2025 bank holidays: ఆగస్ట్ నెల బ్యాంకు సెలవులు ఫుల్.. ఈ తేదీలు గుర్తు పెట్టుకోండి!
ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ వ్యవస్థ మానవ తప్పిదాలను జీరో చేసేస్తుంది. గతంలో ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చి ప్రమాదాలు జరగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ప్రమాదాలకు ఇక వీడ్కోలు చెప్పే రోజులు వచ్చేశాయి. ఇది కేవలం మరియానీ స్టేషన్‌కే పరిమితం కాదు. రాబోయే రోజుల్లో మరిన్ని ముఖ్యమైన స్టేషన్లలో కూడా ఇదే విధంగా ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థ అమలు చేయాలనే దిశగా రైల్వే శాఖ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. ముఖ్యంగా ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న టెర్మినల్స్, జంక్షన్లకు ఇది వరమవుతుంది.
❂ ఈ వ్యవస్థ వల్ల ఏర్పడే ప్రయోజనాలు
☀ సెంట్రలైజ్డ్ మానిటరింగ్: ఒక్కే స్క్రీన్ పై రైలు టెర్మినల్ అంతా కనిపించగలుగుతారు
☀ ఆటోమిషన్: మనిషి జోక్యం లేకుండా అనేక పనులు దానికంతట అవే జరుగుతాయి
☀ సేఫ్టీ: ప్రమాదాలు, దుర్ఘటనలు, హ్యూమన్ ఎర్రర్ అన్నీ తక్కువ అవుతాయి. రైళ్లు ఒకదాని వెనుక ఒకటి వేగంగా నడిపించగలగడం వల్ల ట్రాఫిక్ క్లియర్ అవుతుంది
ఈ ఇంటర్‌లాకింగ్ టెక్నాలజీ అమలు చేయడంలో భారత్ ముందుగానే అడుగు వేసింది. ఇది developed nations కూడా అనుసరిస్తున్న విధానమే. మనదేశంలో అటువంటి వ్యవస్థ అమలవుతుందంటే అది గర్వించదగ్గ విషయమే. ఇది రైల్వే రంగంలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కి ఓ మంచి ఉదాహరణగా నిలుస్తోంది. చివరగా చెప్పాలంటే.. రైలు ప్రయాణం ఇప్పుడు కేవలం స్టేషన్లు మార్చడం కాదు, విజన్ మార్చే దిశగా సాగుతోంది. ఇక ముందు మీరు ఎక్కడి స్టేషన్ నుంచైనా ట్రైన్ ఎక్కినా.. మీ కళ్లకు కనిపించని ఒక ఎలక్ట్రానిక్ గార్డ్ మీ ప్రాణాలకు బంగారు కవచంలా రక్షణ ఇస్తోంది. అందుకే ఇండియన్ రైల్వే సత్తా ముందు ప్రపంచ దేశాలన్నీ తలవంచే పరిస్థితి వచ్చిందని చెప్పవచ్చు.