Indian Railways: గత దశాబ్ద కాలంగా దేశంలో రైల్వే వ్యవస్థ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే సెమీ హైస్పీడ్ రైళ్లు అందుబాటులోకి రాగా, వీలైనంత త్వరగా బుల్లెట్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. దేశంలోనే తొలిసారి ముంబై- అహ్మదాబాద్ నడుమ హైస్పీడ్ రైలు పరుగులు తీయబోతోంది. 2028 నాటికి ప్రారంభం ఈ రైలు అందుబాటులోకి రానుంది. ఈ రెండు నగరాల నడుమ 508 కిలో మీటర్ల దూరం ఉంటుంది. ప్రస్తుతం 8 గంటల ప్రయాణం పడుతుండగా, బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే కేవలం 3 గంటల్లో గమ్యస్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది. జపాన్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ సహకారంతో భారత ప్రభుత్వం ఈ కారిడార్ ను నిర్మిస్తోంది. గుజరాత్, మహారాష్ట్రలో ఇప్పటికే ఈ రైల్వే కారిడార్ నిర్మాణ పనులు మొదలయ్యాయి. గుజరాత్ విభాగంలో శరవేగంగా పనులు కొనసాగుతున్నాయి. మహారాష్ట్రలో పలు సమస్యలను దాటుకుని ఇప్పుడిప్పుడే పనులు ఊపందుకున్నాయి.
12 రైల్వే స్టేషన్లలో హాల్టింగ్
ముంబై- అహ్మదాబాద్ నడుమ రాకపోకలు కొనసాగించే ఈ రైలు మొత్తం 12 రైల్వే స్టేషన్ల మీదుగా వెళ్తుంది. గుజరాత్, మహారాష్ట్రలోని కీలక ప్రాంతాల్లో వ్యూహాత్మకంగా రైల్వే లైన్ ను నిర్మిస్తున్నారు. ముంబై స్టేషన్ భూగర్భంలో నిర్మించబడుతోంది. ఇప్పటికే ఉన్న ప్రజా రవాణా వ్యవస్థలతో సులభంగా ఇంటర్ ఛేంజ్ లను అందిస్తుంది. ఈ మార్గంలో థానే, విరార్, బోయిసర్, వాపి, సూరత్, వడోదర, అహ్మదాబాద్ లాంటి ప్రదేశాలలో స్టాప్ లు ఉంటాయి. ప్రతిపాదిత డీప్ సీ పోర్ట్ సమీపంలోని వాధ్వన్ వరకు భవిష్యత్తులో పొడిగించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. దేశ మల్టీ మోడల్ ట్రాన్స్ పోర్ట్ ఇంటిగ్రేషన్ ఆశయాలకు అనుగుణంగా దీనిని నిర్మిస్తున్నారు.
2026లో బుల్లెట్ రైలు ట్రయల్ రన్
సూరత్, బిలిమోరా మధ్య 50 కిలో మీటర్ల విస్తీర్ణంలో మొదటి ట్రయల్ రన్ 2026లో జరగనుంది. దేశంలో అత్యంత రద్దీగా ఉండే ప్రయాణీకుల జోన్‌లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ కారిడార్, ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత పర్యావరణ అనుకూల రవాణాలో కీలక భూమిక పోషించనుంది. ఈ రైల్వే లైన్ మొత్తం రూ. 1.1 లక్షల కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం జరుపుకుంటుంది. ఈ రైల్వే కారిడార్ అవసరాల కోసం సోలార్ పవర్ ను ఉపయోగించుకోనున్నారు. వర్షపు నీటిని ఆదా చేసి ఉపయోగించుకునేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ రైల్వే ప్రాజెక్టుతో ఉపాధి, స్థానిక పరిశ్రమల అభివృద్ధి, పట్టణ అభివృద్ధికి దోహదపడనుంది. బుల్లెట్ రైలు ఈ మార్గంలో ప్రజలకు వేగవంతమైన, ఆహ్లాదకరమైన ప్రయాణ అనుభవాన్ని అందించనుంది. ఇప్పటికే ఈ మార్గంలో ట్రయల్ రన్ కోసం జపాన్ భారత్ కు రెండు సింకన్ సెన్ బుల్లెట్ రైళ్లను గిఫ్ట్ గా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ బుల్లెట్ రైలు అందుబాటులోకి వచ్చిన తర్వాత దేశంలోని మరిన్ని మార్గాల్లో ఈ రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
Read Also: కోరమాండల్ ఎక్స్ ప్రెస్ కు ఆ పేరు ఎలా వచ్చింది? చోళ రాజులకు దీనికి ఉన్న సంబంధం ఏంటి?