Coromandel Express History Significance: భారతీయ రైల్వేలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రైలు కోరమాండల్ ఎక్స్ ప్రెస్. రాజధాని, శతాబ్ది, దురంతో లాంటి రైళ్ల కంటే ముందే, కోరమాండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఎక్స్ ప్రెస్ సుమారు 5 దశాబ్దాలుగా సేవలు అందిస్తోంది. దేశంలో అత్యంత వేగంగా ప్రయాణించిన తొలి రైలుగా కోరమాండల్ ఎక్స్ ప్రెస్ గుర్తింపు తెచ్చుకుంది. ఈ రైలు పశ్చిమ బెంగాల్ లోని హౌరా నుంచి తమిళనాడులోని చెన్నై సెంట్రల్ వరకు రాకపోకలు కొనసాగిస్తోంది. మొత్తం 4 రాష్ట్రాల మీదుగా, 1,661 కిలో మీటర్ల దూరం ప్రయాణిస్తుంది. గంటకు 130 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైలు 25 గంటల్లో తన గమ్యస్థానానికి చేరుకుంటుంది.
5 దశాబ్దాలుగా సేవలు అందిస్తూ..
1977 మార్చి 6న ఈ రైలు ప్రారంభం అయ్యింది. ఈ రైలు అందుబాటులోకి వచ్చిన తొలినాళ్లలో కేవలం వారానికి రెండు రోజులు మాత్రమే నడిచేది. ఆ తర్వాత ప్రయాణీకుల నుంచి డిమాండ్ పెరగడంతో దీన్ని రోజూ నడిపిస్తున్నారు. ఈ రైలు ఇప్పటి వరకు కోట్లాది మందిని తమ గమ్యస్థానాలకు చేర్చింది. ఇక ఈ రైలు వస్తుందంటేనే, ఆ లైన్ లోని మిగతా రైళ్లను నిలిపివేస్తారు. ఈ రైలుకు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు రైల్వే అధికారులు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిసా, పశ్చిమ బెంగాల్ ప్రజలకు ఈ రైలుతో ఎంతో అనుభందం ఉంది. ఆ అనుబంధంతోటే కోరమాండల్ ను రైల్వే లెజెండ్ గా పిలుస్తుంటారు. ఈ రైలు ఏపీలోని విజయవాడ, ఏలూరు, తాడేపల్లి గూడెం, రాజమండ్రి, విశాఖపట్నం, ఒంగోలులో హాల్టింగ్ ఉంటుంది.
Read Also: వామ్మో.. రైలు ఇంజిన్ లైట్ ఫోకస్ అంత దూరం ఉంటుందా? మీరు అస్సలు ఊహించి ఉండరు!
కోరమాండల్ అనే పేరు ఎలా వచ్చింది?
13వ శతాబ్దం వరకు చోళ సామ్రాజ్యం దాదాపు దక్షిణ భారతదేశం అంతా విస్తరించింది. తమిళనాడు, ఒడిషాతో పాటు పశ్చిమ బెంగాల్ వరకు చోళుల ప్రభావం ఉండేది. చోళులు పాలించిన ప్రాంతాన్ని చోళమండలం అని పిలుస్తారు. దీనినే కోరమండలం అంటారు. భారతదేశంలో ఆగ్నేయం అంటే.. సౌత్ ఈస్ట్ తీరంలో చోళ సామ్రాజ్యం విస్తరించింది. బంగాళాఖాతం తీరం వెంబడి ఉన్న తూర్పు ప్రాంతాన్ని చోళులు పాలించారు. దీనికి కోరమండల తీరంగా పేరు వచ్చింది. దీనికి బ్రిటిషర్లు ఆ పేరు పెట్టారు. కావేరీ నది సంగమం నుంచి పులికాట్ సరస్సు వరకు తీర ప్రాంతమే కోరమండల ప్రాంతం. తొలుత దీన్ని చోళమండల తీరంగా పిలిచే వాళ్లు. ఆ తర్వాత బ్రిటిషర్లు కోరమాండల్ అని పిలవడం మొదలు పెట్టారు. ఈ తీర ప్రాంతంలో ప్రయాణించే రైలు కావడంతో దీన్ని కోరమాండల్ ఎక్స్ ప్రెస్ గా పిలవడం మొదలు పెట్టారు. ఈ రైలు ఈశాన్య రైల్వే జోన్ పరిధిలో నడుస్తోంది.
Read Also: సచిన్,కోహ్లీ పేర్లతో రైల్వే స్టేషన్లు, ఎక్కడ ఉన్నాయో తెలుసా?