Indian Railways Crowd: భారతీయ రైల్వే సంస్థ అరుదైన ఘనత సాధించింది. ఒకే రోజు 3 కోట్ల మంది ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చి సరికొత్త బెంచ్ మార్క్ ను సృష్టించింది. నవంబర్ 4న ఈ చారిత్రాత్మక రికార్డును నెలకొల్పింది. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
ఒకే రోజు 3 కోట్ల మంది రైల్వే ప్రయాణం
నవంబర్ 4న దేశ వ్యాప్తంగా నాన్ సబర్బన్ రైళ్లు 1 కోటి 20 లక్షల 72 వేల మంది ప్రయాణీకులను గమ్య స్థానాలకు తీసుకెళ్లాయి. వీరిలో రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణీకులు సంఖ్య 19 లక్షల 43 వేల మంది కాగా, రిజర్వేషన్ చేయించుకోని ప్రయాణీకులు 1 కోటి 1 లక్షా 29 వేల మంది ఉన్నారు. అటు సబర్బన్ రైళ్లలో 1 కోటి 80 లక్షల మంది ప్రయాణించారు. 2024లో అత్యధిక సింగిల్-డే ప్రయాణీకుల సంఖ్యగా రికార్డు సాధించింది. మొత్తం ఒక్క రోజే 3 కోట్లకు పైగా ప్రయాణీకుల గమ్యస్థానాలకు చేర్చి సరి కొత్త బెంచ్ మార్క్ ని నెలకొల్పింది రైల్వే సంస్థ.
దసరా, దీపావళి, ఛత్ పూజతో పోటెత్తిన ప్రయాణీకులు
దసరా, దీపావళి, ఛత్ పూజ లాంటి పండుగ సీజన్ కావడంతో లక్షలాది మంది ప్రజలు తమ సొంతూళ్లకు చేరుకున్నారు. ఇందులో ఎక్కువ శాతం మంది రైళ్ల ద్వారానే తమ గ్రామానికి చేరుకున్నారు. రైళ్లన్నీ కిక్కిరిసిపోయాయి. రద్దీకి అనుగుణంగా భారతీయ రైల్వే సంస్థ ప్రత్యేక రైళ్లను నడిపించింది. ఈ నేపథ్యంలో అత్యధిక ప్రయాణీకులతో సరికొత్త రికార్డు నెలకొల్పింది.
పెద్ద సంఖ్యలో ప్రత్యేక రైళ్ల ఏర్పాటు
పండుగల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇండియన్ రైల్వేస్ కీలక నిర్ణయం తీసుకుంది. రద్దీకి అనుకూలంగా ప్రత్యేక రైళ్లను అందుబాటులో ఉంచింది. ఈ పండుగ సీజన్ లో మొత్తంగా 7,750 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. గత ఏడాది కేవలం 4,429 ప్రత్యేక రైళ్లను నడిపారు. గతంతో పోల్చితే ఈసారి ఏకంగా 73% ఎక్కువగా ఉంది. అటు పండుగల సీజన్ ముగుస్తున్నందున ప్రత్యేక చర్యలు చేపట్టింది. నవంబర్ 8న ఛత్ పూజ ముగియనుంది. తిరిగి మళ్లీ తమ వర్క్ ప్లేస్ కు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నది. నవంబర్ 8 నుంచి 11 వరకు అదనపు రైళ్లను షెడ్యూల్ చేసింది.
బీహార్, యూపీ, జార్ఖండ్ భారీగా రద్దీ
ఈ ఏడాది బీహార్, యూపీ, జార్ఖండ్ అత్యధిక రద్దీ ఉన్నట్లు రైల్వేశాఖ వెల్లడించింది. అక్టోబర్ 1 నుంచి మొదలుకొని నవంబర్ 5 వరకు ఈ మూడు రాష్ట్రాలకు సంబంధించిన సుమారు 6.85 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది. మొత్తంగా ఈ పండుగ సీజన్ లో గతంలో ఎప్పుడూ లేనంత మందిని తీసుకెళ్లింది భారతీయ రైల్వే సంస్థ.
➡️ Indian Railways sets new record: Over 3 Crore passengers traveled in Indian Railways in a single day on 4th November, 2024
➡️ #IndianRailways facilitated the travel of 65 lakh passengers through 4,521 special trains in last thirty-six days
➡️ Indian Railways Schedules Over…
— PIB India (@PIB_India) November 7, 2024
Read Also: ఒకే ట్రాక్ మీదకు దూసుకొచ్చిన రెండు రైళ్లు.. లోకో పైలెట్ అలా చేసి ఉండకపోతే, భారీ ప్రమాదం