Indian Railways Insurance: రోజూ కోట్లాది మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. వారిలో చాలా మందికి భారతీయ రైల్వే సంస్థ అందిస్తున్న సదుపాయాల గురించి పెద్దగా తెలియదు. టికెట్ కొన్నామా? రైలు ఎక్కి గమ్యస్థానానికి చేరామా? అంత వరకే ఆలోచిస్తారు. ఈ స్టోరీలో రైల్వే ప్రయాణీకులకు ఎంతో ఉపయోగపడే ఓ ముఖ్యమైన విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
రూ. 35 పైసలతో రూ. 10 లక్షల ఇన్సూరెన్స్
IRCTC యాప్ లేదంటే వెబ్ సైట్ ద్వారా టికెట్ బుక్ చేసుకునే సమయంలో ట్రావెల్ ఇన్సూరెన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. పేమెంట్ సమయంలో ఈ ఆప్షన్ కనిపిస్తుంది. కచ్చితంగా దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. రైల్వే ప్రయాణం చేసే వారిలో సగానికి పైగా మంది ఈ ఇన్సూరెన్స్ ను ఎంచుకోవడం లేదు. అలా చేయడం వల్ల మీరు చాలా ప్రయోజనాలను మిస్ అవుతున్నట్లే. ఈ ఇన్సూరెన్స్ ఆప్షన్ ను ఎంచుకోవడం వల్ల కేవలం 35 పైసలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ 35 పైసలతో ఏకంగా రూ. 10 లక్షల ఇన్సూరెన్స్ లభిస్తుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ప్రయాణీకుల భద్రత కోసం భారతీయ రైల్వే సంస్థ ఈ సదుపాయం కల్పిస్తున్నది.
పూర్తి అంగ వైకల్యం ఏర్పడినా రూ. 10 లక్షలు
రైలు టికెట్లు బుక్ చేసుకునే సమయంలో ఇన్సూరెన్స్ ను సెలెక్ట్ చేసి పేమెంట్ చేయగానే, రైల్వే సంస్థతో టై అప్ ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మెయిల్ వస్తుంది. వివరాలతో పాటు పాలసీ డాక్యుమెంట్ కూడా పంపిస్తారు. రైళ్లో ప్రయాణిస్తున్న సమయంలో పొరపాటున ఏదైనా ప్రమాదానికి గురై చనిపోతే, మన కుటుంబానికి ఆ బీమా సంస్థ రూ. 10 లక్షలు చెల్లిస్తుంది. ప్రమాదంలో పూర్తిగా అంగవైకల్యం ఏర్పడినా రూ. 10 లక్షలు చెల్లిస్తుంది. పాక్షిక అంగవైకల్యం ఏర్పడితే రూ. 7.5 లక్షల బీమా అందిస్తుంది. వైకల్యం ఏర్పడకుండా, కేవలం గాయాలతో హాస్పిటల్ లో చేరితే, వైద్య ఖర్చుల కోసం రూ. 2 లక్షలు ఇస్తుంది. మొత్తంగా 35 పైసలతో ఇన్ని రకాలుగా బీమా వచ్చే అవకాశం ఉంటుంది.
Read Also: ప్రయాణీకులకు గుడ్ న్యూస్, వందే భారత్ రైళ్ల కోచ్ లు పెరుగుతున్నాయ్!
ఇన్సూరెన్స్ ఎలా క్లెయిమ్ చేయాలంటే?
ఇంతకీ ఈ ఇన్సూరెన్స్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలంటే.. రైలు ప్రమాదం జరిగిన 4 నెలల్లోగా ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్లి తగిన పత్రాలను అందివ్వాలి. 15 రోజుల్లోగా క్లెయిమ్ డబ్బులు మన బ్యాంక్ అకౌంట్ లో పడుతాయి. ఒక వేళ ప్యాసింజర్ చనిపోతే, నామినీ వెళ్లి రైల్వే అధికారులు ఇచ్చే డెత్ సర్టిఫికేట్ తో పాటు వాళ్లు అడిగిన డాక్యుమెంట్స్ ఇవ్వాలి. ఇవన్నీ ఇస్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది మన బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది. సో, రెగ్యులర్ గా రైళ్లలో ప్రయాణం చేసే వాళ్లు కచ్చితంగా ఈ ఇన్సూరెన్స్ ఆప్షన్ ను సెలక్ట్ చేసుకోండి. పొరపాటున ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ కంపెనీ అందించే ఆర్థిక భరోసాను పొందండి!
Read Also: ట్రైన్ లో మీ లగేజ్ మర్చిపోయారా? సింపుల్ ఇలా చేస్తే మీ దగ్గరికి చేరుతుంది!