Indian Railways Reservation Chart: ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. అందులో భాగంగా మరో కొత్త రూల్ ను తీసుకురాబోతోంది. ఇకపై రైలు ప్రయాణం ప్రారంభం కావడానికి 24 గంటల ముందే ప్రయాణీకుల రిజర్వేషన్ చార్ట్ ను విడుదల చేయాలని ఆలోచిస్తుంది. రైల్వే టికెటింగ్ సంస్కరణలలో భాగంగా ఈ నిర్ణయాన్ని తీసుకోవాలని భావిస్తున్నాయి. అంతేకాదు, ముందస్తు రిజర్వేషన్ చార్ట్ కారణంగా టికెట్స్ లభించని ప్రయాణీకులు ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకునేలా ఈ చార్ట్ ఉపయోగపడనుంది. ఈ నిర్ణయాన్ని వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది.
ప్రస్తుతం ప్రయాణానికి 4 గంటల ముందు చార్ట్ రెడీ
భారతీయ రైల్వే ప్రస్తుతం రైళ్లు బయలుదేరడానికి 4 గంటల ముందు ప్రయాణీకుల రిజర్వేషన్ చార్ట్‌ను రెడీ చేస్తున్నారు. అయితే, ఇకపై 4 గంటలు కాస్తా 24 గంటలు ముందుకు జరగనుంది. కొత్త రిజర్వేషన్ చార్ట్ వ్యవస్థను అమలు చేయడానికి సంబంధించి సాధ్యాసాధ్యాలను తనిఖీ చేయడానికి ట్రయల్స్ ఇప్పటికే మొదలు పెట్టినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం బికనీర్ డివిజన్ లో ట్రయల్స్ జరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా అమలు చేయడానికి ముందు రైల్వే ఎదుర్కొనే సవాళ్లను నిర్ధారించడంతో పాటు పరిష్కార మార్గాలను అణ్వేషించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రెండు రైళ్లలో జరుగుతున్న ట్రయల్స్ ఫలితాల ఆధారంగా, దేశ వ్యాప్తంగా కొత్త వ్యవస్థను అమలు చేసే దిశగా రైల్వే అడుగులు వేస్తోంది.
IRCTC ద్వారా 84 శాతం టికెట్ల బుకింగ్
ఇక రైల్వే టికెట్ల బుకింగ్ కు సంబంధించి 84 శాతం IRCTC ద్వారానే జరుగుతున్నాయి. మిగిలిన 16 శాతం టికెట్లు రైల్వే కౌంటర్ల ద్వారా తీసుకుంటున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కొత్త రిజర్వేషన్ చార్ట్ వ్యవస్థను అమలు చేయడం రైల్వేకు పెద్దగా ఇబ్బంది ఏమీ కాదని భావిస్తున్నారు. ఈ విధానాన్ని సులభంగా అమలు చేసే అవకాశం ఉందంటున్నారు. కొత్త రిజర్వేషన్ చార్ట్ వ్యవస్థ ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తుందని అధికారులు భావిస్తున్నారు.
Read Also: ప్రపంచంలో ఫాస్టెస్ట్ రైళ్లు ఇవే, ఒక్కోదాని వేగం చూస్తే కళ్లు తిరగాల్సిందే!
తత్కాల్ టికెట్ బుకింగ్ పై ఎఫెక్ట్ పడుతుందా?
తాజాగా తీసుకొచ్చే కొత్త ప్యాసింజర్ చార్ట్ వ్యవస్థ తత్కాల్ టికెట్ బుకింగ్ మీద ప్రభావం చూపిస్తుందా? అనే అనుమానాలు చాలా మందిలో వ్యక్తం అవుతున్నాయి. అయితే, ఈ లిస్టు తత్కాల్ టికెట్స్ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపించదని అధికారులు తెలిపారు. రైళ్ల షెడ్యూల్ కు 24 గంటల ముందు తత్కాల్ టికెట్లు బుక్ చేయబడతాయి. ఆ టికెట్లు బుక్ అయిన తర్వాత ఈ చార్ట్ ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విధానం వల్ల టికెట్ లభించని ప్రయాణీకులు ఇతర ప్రయాణ మార్గాలను ఎంచుకునే అవకాశం ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. ముఖ్యంగా అత్యవసర పనులు ఉన్న వారికి ఉపయోగకరంగా ఉంటుందని వెల్లడించారు.
Read Also: నలుగురు పిల్లలతో కలిసి రైల్వే ట్రాక్ పై తండ్రి.. గుండె బరువెక్కించే ఘటన!