Vizag-Tirupati Double Decker Express: ప్రస్తుతం విశాఖపట్నం- తిరుపతి- విశాఖపట్నం(22707/08) నడుమ డబుల్ డెక్కర్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రయాణీకులకు అందుబాటులో ఉంది. ఇందులో స్లీపర్ కోచ్ లు లేకపోవడంతో ప్రయాణీకులు పూర్తిగా కూర్చోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఏసీ స్లీపర్ కోచ్ లను పెంచాలంటూ ఈస్ట్ కోస్ట్ రైల్వే (ECoR) దక్షిణ మధ్య రైల్వే (SCR)కి ప్రతిపాదన పంపింది. ఈ మేరకు SCR చీఫ్ ట్రాఫిక్ ప్లానింగ్ మేనేజర్‌కు ECoR చీఫ్ కమర్షియల్ మేనేజర్ లేఖ రాశారు. SCR నడిపిస్తున్న ఈ రైలు రాత్రి సమయంలో విశాఖపట్నం నుంచి తిరుపతికి వెళ్తుంది. ఈ రైలు విశాఖ నుంచి 122.24%, తిరుపతి నుంచి 114.25% ఆక్యుపెన్సీతో నడుస్తుంది. ఈ రైలు రాత్రి 11 గంటలకు విశాఖపట్నం నుంచి బయల్దేరి మధ్యాహ్నం 12.30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో, రాత్రి 9.50 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరుతుంది. ఉదయం 10.40 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
విశాఖ నుంచి నేరుగా తిరుపతికి..
ప్రస్తుతం, 18521/22 తిరుమల డైలీ ఎక్స్ ప్రెస్, 22707/08 ట్రై-వీక్లీ డబుల్ డెక్కర్ ఎక్స్ ప్రెస్ అనే రెండు రైళ్లు విశాఖపట్నం నుంచి తిరుపతికి నేరుగా నడుస్తున్నాయి. చాలా మంది ప్రయాణీకులు శ్రీవారి దర్శనం కోసం ఈ రైళ్లలో వెళ్తున్నారు. 22707/08 డబుల్ డెక్కర్ రైలులో 10 కోచ్‌లు ఉన్నాయి, వీటిలో రెండు LWLRRM (లగేజ్, జనరేటర్, బ్రేక్ వ్యాన్) కోచ్‌లు కాగా, ఎనిమిది LWSCZDAC(చైర్ కార్) కోచ్‌లు ఉన్నాయి. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి ZRUCC సభ్యుడు కె. ఈశ్వర్ ఈ రైళ్లో స్లీపర్ కోచ్ లసంఖ్య పెంచాలని ఆయన కోరారు. ఈ లేఖ ఆధారంగా, ECoR, SCRకు ప్రతిపాదనలు పంపించింది. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, రోగులు, గర్భిణీలు, పిల్లలతో ఉన్న ప్రయాణీకులు ఈ రైలును ఉపయోగిస్తున్నారు. ఏసీ స్లీపర్ కోచ్‌లు లేకపోవడం వల్ల వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రైలు రాత్రి సమయంలో నడుస్తుండటంతో, ప్రయాణీకులు సరిగ్గా విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా ఉండాలని కోరుతున్నారు. ఈ డబుల్ డెక్కర్ ఎక్స్ ప్రెస్ లో తాత్కాలికంగా లేదంటే శాశ్వతంగా 2 A, 3 A, 3 E క్లాస్ కోచ్‌లను పెంచాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే కోరింది.
సౌత్ సెంట్రల్ రైల్వే ఆధీనంలో నడుస్తున్న డబుల్ డెక్కర్
ప్రస్తుతం విశాఖ- తిరుపతి డబుల్ డెక్కర్ రైలు సౌత్ సెంట్రల్ రైల్వే ఆధీనంలో ఈ రైలు నడుస్తుంది. వారు అంగీకరిస్తే వచ్చే నెల నుంచే ఏసీ స్లీపర్ కోచ్‌లను కలిపి ఈ రైలును నడిపే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ రైలులోని రెండు ఫ్లోర్లలో ఏసీ సిట్టింగ్ (CC) బోగీలు మాత్రమే ఉన్నాయి. దీంతో ప్రయాణీకులు తిరుపతి నుంచి విశాఖకు కూర్చొనే ప్రయాణించాల్సి వస్తోంది. పైగా ఈ రైలుకు మంచి డిమాండ్ ఉంది. అందుకే.. ఏసీ స్లీపర్ కోచ్ లు కావాలని ప్రయాణీకులు డిమాండ్ చేస్తున్నారు.
Read Also: గుడ్ న్యూస్.. ఇక ఆ నగరం నుంచి నేరుగా తిరుపతికి రైలు