Indian Railways New Rule: కుంభమేళా లాంటి ఆధ్యాత్మిక వేడుకలతో పాటు పలు పండుగలు, ప్రత్యేక రద్దీ సమయాల్లో చాలా మంది టికెట్లు బుక్ చేసుకున్నా, ఎక్కువ సంఖ్యలో వెయిటింగ్ లిస్టు ఉంటుంది. అయినప్పటికీ.. చాలా రైలు ఎక్కుతారు. రిజర్వేషన్ కోచ్ లలో జర్నీ చేస్తుంటారు. టీసీ వస్తే ఫైన్ కడతారు. లేదంటే, ఖాళీగా ఉన్న సీటును రిజర్వ్ చేయించుకుని జర్నీ చేస్తుంటారు. అయితే, ఇకపై వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణీకులు రిజర్వేషన్ కోచ్ లో ప్రయాణించకూడదని రైల్వేశాఖ తేల్చి చెప్పింది. ఒకవేళ నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
వెయిటింగ్ టికెట్ తో రైలు ఎక్కితే?
వెయిటింగ్ టికెట్ తో రిజర్వేషన్ కోచ్ లో ప్రయాణిస్తే కఠిన చర్యలు తప్పవని తాజాగా రైల్వేశాఖ వెల్లడించింది. జరిమానా విధించడంతో పాటు నెక్ట్స్ స్టేషన్ లో డీబోర్డ్ చేయనున్నట్లు అధికారులు తేల్చి చెప్పారు. జరిమానా అనేది స్టార్టింగ్ స్టేషన్ నుంచి ట్రావెల్ పాయింట్ వరకు కనీస ఛార్జీతో పాటు ఆయా కోచ్ ను బట్టి మారుతూ ఉందన్నారు. ఒకవేళ ఏసీ కోచ్ లో ప్రయాణిస్తే టికెట్ ఛార్జీతో పాటు అదనంగా రూ. 440 చెల్లించాల్సి ఉంటుందన్నారు. అయితే, వెయిటింగ్ టికెట్లను కలిగి ఉన్న ప్రయాణీకులు సాధారణ కోచ్ లో ప్రయాణించ వచ్చని వెల్లడించారు. జనరల్ కోచ్ లో ప్రయాణించడానికి రిజర్వేషన్ అవసరం లేదన్నారు. వెయిటింగ్ టికెట్లు ఉన్నవాళ్లు రైలు బయలుదేరడానికి కనీసం అరగంట ముందు టికెట్ క్యాన్సిల్ చేసుకోవడం మంచిదని రైల్వే అధికారులు సూచించారు.
Read Also: ఇండియన్ రైల్వే సరికొత్త నిర్ణయం, ఇక టికెట్ లేకుండా స్టేషన్ లోకి అడుగు పెట్టడం అసాధ్యం!
జనవరి 1 నుంచి కొత్త నిబంధనలు అమలు
జనవరి 1, 2025 నుంచి భారతీయ రైల్వే సంస్థ వెయిటింగ్ టికెట్లకు సంబంధించి కొత్త నిబంధనలను పరిచయం చేసింది. ఈ నిబంధనలు ప్రయాణీకులంతా పాటించాలని సూచించింది. పాటించని వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించింది. వాస్తవానికి రైళ్లలో ఎయిర్ కండిషన్డ్ కోచ్ లు, స్లీపర్ కోచ్ లు, జనరల్ బోగీలు ఉంటాయి. ఏసీ, స్లీపర్ కోచ్ లలో కన్ఫార్మ్ టికెట్ ఉన్నవాళ్లు మాత్రమే ప్రయాణించాలి. జనరల్ టికెట్ తీసుకున్న వాళ్లు జనరల్ బోగీల్లో ఎక్కాలి. కానీ, గత కొంతకాలంగా రిజర్వేషన్ కోచ్ లలో రిజర్వేషన్ లేని ప్రయాణీకులు, వెయిటింగ్ లిస్ట్ టికెట్ ఉన్న ప్రయాణీకుల సంఖ్య పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో కన్ఫార్మ్ టికెట్లు ఉన్న ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉండేది. కానీ, ఇప్పుడు సౌత్ రాష్ట్రాల్లోనూ, ముఖ్యంగా కేరళ, తమిళనాడులో చాలా మంది కన్ఫార్మ్ టికెట్ లేకపోయినా రిజర్వేషన్ కోచ్ లలో ప్రయాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. అందుకే, కన్ఫార్మ్ టికెట్ లేని వాళ్లు రిజర్వేషన్ కోచ్ లలో ప్రయాణించకూడదని రైల్వేశాఖ హెచ్చరించింది.
Read Also: మీ సీట్లో కూర్చొని మీతోనే గొడవ పెట్టుకుంటున్నారా? సింఫుల్ గా ఇలా చేయండి!