Perabathula Rajasekharam MLC: ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ఖాతాలో మరో విజయం చేరింది. ఇప్పటికే ఉమ్మడి కృష్ణా – గుంటూరు ఎమ్మెల్సీగా ఆలపాటి రాజా విజయాన్ని అందుకున్నారు. దీనితో కూటమికి తొలి విజయం దక్కింది. అయితే ఉభయ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ విజయాన్ని అందుకోవడంతో మరో విజయం టీడీపీ ఖాతాలో చేరింది.
ఉభయ గోదావరి జిల్లాలో తొలిసారి టిడిపి ఖాతాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం దక్కడంపై టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ విజయంతో ఏపీలోని మొత్తం 5 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకుందని చెప్పవచ్చు. టీడీపీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకు లక్షా 24 వేల 702 ఓట్లు రాగా, పీడీయఫ్ అభ్యర్థి డి .వి. రాఘవులుకు 47 వేల 241 ఓట్లు పోలయ్యాయి. 77 వేల 461 ఓట్ల వ్యత్యాసంతో టీడీపీ అభ్యర్థి రాజశేఖరం విజయాన్ని అందుకున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. కాగా స్వతంత్ర అభ్యర్థి, మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు జి.వి.సుందర్ కు 16,183 ఓట్లు పోలయ్యాయి.
మొత్తం 2,18,997 ఓట్లు పోలుకాగా, వ్యాలిడ్ ఓట్లు 1,99,208, అన్ వ్యాలిడ్ ఓట్లు 19,789 గా ఎన్నికల అధికారులు గుర్తించారు. టిడిపి అభ్యర్థి విజయంతో ఎన్డీయే కూటమి నేతలు సంబరాలు జరుపుకున్నారు. ఇది ఇలా ఉంటే గుంటూరు -కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 82వేల 320 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచిన కూటమి బలపరిచిన, టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజా మాత్రం మొదటి ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపులోనే ఫలితం తేలిపోవడం విశేషం. దీనితో నిన్నటి నుండి కూటమి నేతలు సంబరాల్లో మునిగిపోయారు.
ఉభయ గోదావరి జిల్లాలో తొలిసారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకోవడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ప్రజలు కూటమి ప్రభుత్వంపై నమ్మకం ఉంచి, తమ అభ్యర్థులను గెలిపించారని ప్రజలు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పాలన సాగిస్తామని లోకేష్ అన్నారు. ఇప్పటికే ఏపీలో పెట్టుబడుల సాధనపై దృష్టి సారించిన ప్రభుత్వం, ఓ వైపు ఉపాధి మార్గాలు చూపేందుకు పలు కార్యక్రమాలను చేపడుతోంది. యువతలో నైపుణ్యత పెంచడం కోసం శిక్షణ తరగతులు, ఉపాధి కోసం జాబ్ మేళాలు నిర్వహిస్తుండగా ఇటువంటి కార్యక్రమాలు పట్టభద్రుల ఆదరణకు గురయ్యాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం మీద కూటమిపై పట్టభద్రులు ఉంచిన నమ్మకమే ఏపీలో మొత్తం 5 గ్రాడ్యుయేట్ స్థానాలు కూటమి ఖాతాలో చేరాయని చెప్పవచ్చు.
Also Read: Summer Tips: మీ ఇంటికి వేడిగాలుల ఎఫెక్ట్ ఉందా? ఇలా చేస్తే అంతా కూల్ కూల్..
కాగా ఉభయ గోదావరి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సంధర్భంగా కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉత్కంఠభరితంగా కౌంటింగ్ సాగగా.. చివరకు కూటమి అభ్యర్థి విజయాన్ని అందుకోవడంతో మిగిలిన అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రం నుండి వెళ్లిపోయారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి వరుస విజయాలను అందుకోవడంతో మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం వద్ద సందడి నెలకొంది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు బాణాసంచా కాలుస్తూ స్వీట్లు పంచుకున్నారు.
ఉభయ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ విజయం
సమీప ప్రత్యర్థి వీర రాఘవులు (PDF)పై 77,461 ఓట్ల తేడాతో రాజశేఖర్ ఘన విజయం
మొత్తం పోలైన ఓట్లు – 2,18,997
పేరాబత్తుల రాజశేఖర్‌కు పోలైన ఓట్లు – 1,24,702 pic.twitter.com/DfP0A0AYYn
— BIG TV Breaking News (@bigtvtelugu) March 4, 2025