Indian Hydrogen Train Trials: భారతీయ రైల్వేలో వందే భారత్ రైళ్లు సరికొత్త మైల్ స్టోన్ గా నిలువగా, ఇప్పుడు హైడ్రోజన్ తో నడిచే రైలు పట్టాలెక్కబోతోంది. వచ్చే నెల నుంచి ఈ రైలుకు ట్రయల్ రన్ నిర్వహించేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. హర్యానాలోని జింద్-సోనిపట్ మార్గంలోని 90 కిలో మీటర్ల మేర ఈ ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ట్రయల్స్ సమయంలో రైలు పనితీరు, సామర్థ్యం, భద్రతా ఫీచర్లను అధికారులు పర్యవేక్షించనున్నారు. గ్రీన్ ఎనర్జీ సోల్యూషన్స్ తో పాటు 2030 నాటికి కర్బన్ ఉద్గారాలు లేని ప్రయాణాలను కొనసాగించేందుకు భారతీయ రైల్వే సంస్థ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఈ హైడ్రోజన్ రైలును అందుబాటులోకి తెస్తున్నది.
గ్రీన్ ట్రాన్స్ పోర్టేషన్ కీలక ముందడుగు
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రూపొందించిన హైడ్రోజన్-ఆధారిత రైలు.. హైడ్రోజన్, ఆక్సిజన్‌ను కలపడం ద్వారా విద్యుత్తును ఉత్పత్తి జరిగి రైలు ముందుకు కదులుతుంది. ఈ ప్రక్రియలో కర్బన ఉద్గారాలకు బదులుగా నీటి ఆవిరి మాత్రమే విడుదల అవుతుంది. పర్యావరణానికి ఎలాంటి హాని జరగదని అధికారులు వెల్లడించారు. నూటికి నూరు శాతం పొల్యూషన్ ప్రీ రైలుగా తన సేవలను కొనసాగించనుంది.
హైడ్రోజన్ రైళ్లతో కలిగే మేలు
హైడ్రోజన్ తో నడిచే రైళ్లను హైడ్రాలిక్స్ అని కూడా పిలుస్తారు. సాంప్రదాయ డీజిల్-ఆధారిత లోకోమోటివ్‌లతో పోల్చితే ఈ రైళ్లు అనేక ప్రయోజనాలను అందిస్తాయి.
⦿ పర్యావరణహితం: ఈ రైళ్లు ఎలాంటి కర్బన ఉద్గారాలను వెదజల్లవు. ఎలాంటి పొల్యూషన్ ఉండదు.
⦿ వ్యయ-ప్రభావం: హైడ్రోజన్ విరివిగా లభిస్తున్న నేపథ్యంలో కొరత అనేది ఉండదు. ప్రస్తుతం ఉత్పత్తి స్థాయి పెరగడం కలిసి రానుంది.
⦿శక్తి సామర్థ్యం: హైడ్రోజన్ రైళ్లు డీజిల్ కౌంటర్ పార్ట్ లతో పోలిస్తే ఎలాంటి శబ్దం లేకుండా అత్యంత సమర్థవంతంగా పని చేస్తాయి.
2025 నాటికి అందుబాటులోకి 35 హైడ్రోజన్ రైళ్లు
2025 నాటికి దేశ వ్యాప్తంగా 35 రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని భారతీయ రైల్వే సంస్థ భావిస్తున్నది. ఈ రైళ్లు ప్రధానంగా నాన్-ఎలక్ట్రిఫైడ్ రూట్లలో వీటి సేవలు ప్రారంభించాని అధికారులు భావిస్తున్నారు. డీజిల్ ఇంజిన్‌లపై ఆధారపడి నడుస్తున్న రూట్లలో హైడ్రోజన్ రైళ్లను భర్తీ చేయనున్నారు. అటు హైడ్రోజన్ ఉత్పత్తి, నిల్వ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి విదేశీ కంపెనీలతో భారతీయ రైల్వే సంస్థ టైఅప్ అవుతోంది.
ఇప్పటికే పలు దేశాల్లో హైడ్రోజన్ రైళ్ల సేవలు
ఇప్పటికే పలు దేశాల్లో హైడ్రోజన్ తో నడిచే రైళ్లు తమ సేవలను అందిస్తున్నాయి. జర్మనీ, చైనా ప్రజా రవాణాలో హైడ్రోజన్ రైళ్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇప్పుడు భారత్ లోనూ అందుబాటలోకి రాబోతున్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ లలో ఒకటిగా కొనసాగుతున్న భారతీయ రైల్వే సంస్థ హైడ్రోజన్ టెక్నాలజీని అందిపుచ్చుకోవడం వల్ల పర్యావరణానికి ఎంతో మేలు కలిగే అవకాశం ఉంది. రేపటి కాలుష్య రహిత ప్రపంచానికి మేలు కలగనుందని పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు.
Read Also: ఇకపై మీ ట్రైన్ టికెట్ 100% కన్ఫార్మ్.. లేదంటే 3 రెట్లు డబ్బు వెనక్కి!