Train Passengers Alert: అక్టోబర్ నెలలో రైలులో ప్రయాణించే వారికి ముఖ్యమైన అలర్ట్. సెంట్రల్ రైల్వే పరిధిలో అక్టోబర్ 1 నుంచి 31 వరకు ప్రత్యేక టికెట్ చెకింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సాధారణ తనిఖీలతో పోలిస్తే ఈ సమయంలో చెకింగ్ మరింత కఠినంగా ఉండే అవకాశం ఉంది. టికెట్ లేకుండా ప్రయాణించే వారితో పాటు రాయితీ టికెట్లు, ప్రత్యేక రిజర్వేషన్ కోటాలు, రైల్వే పాస్‌లు, రిజర్వేషన్ లేని టికెట్లను కూడా సిబ్బంది పరిశీలించనున్నారు.
రాయితీ, స్పెషల్ కోటా కింద టికెట్ తీసుకున్న ప్రయాణికులు తమ అర్హతను నిరూపించే అసలైన గుర్తింపు పత్రాన్ని తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి. ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ లాంటి ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు పత్రాలను చూపించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఒరిజినల్ డాక్యుమెంట్ విషయంలో జాగ్రత్త అవసరం.
ఒకే టికెట్‌పై పలువురు ప్రయాణిస్తున్నప్పుడు కూడా నిబంధనలు వర్తిస్తాయి. బుకింగ్ లో ఉన్న ప్రయాణికుల్లో అవసరమైన గుర్తింపు పత్రాన్ని చూపించాల్సిన పరిస్థితి వస్తే, సంబంధిత వ్యక్తి సరైన ఒరిజినల్ ఐడీని వెంట ఉంచుకోవాలి. అర్హతకు సంబంధించిన ఆధారాలను చూపించలేకపోతే, టికెట్ ఉన్నప్పటికీ ప్రయాణం విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే గ్రూప్‌గా ప్రయాణించే వారు ముందుగానే అన్ని డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవడం మంచిది.
రైల్వే ఇ-పాస్, ప్రివిలేజ్ టికెట్ ఆర్డర్ (PTO) ద్వారా ప్రయాణించే వారికి కూడా తనిఖీలు ఉంటాయి. ఇలాంటి ప్రయాణికులు సూచించిన ఒరిజినల్ గుర్తింపు పత్రాన్ని వెంట తీసుకెళ్లాలి. ప్రయాణానికి ముందు పాస్, PTO సక్రమంగా ప్రయాణానికి ఉపయోగపడే టికెట్, అఫీషియల్ డాక్యుమెంట్ గా మార్చారా? లేదా? అనేది కూడా నిర్ధారించుకోవాలి.
రిజర్వేషన్ లేని టికెట్లను కూడా రైల్వే సిబ్బంది తనిఖీ చేయనున్నారు. టికెట్ నిజమైనదేనా? సరైన ప్రయాణానికి ఉపయోగిస్తున్నారా? అనే అంశాలను పరిశీలిస్తారు. ప్రయాణ సమయంలో టికెట్ వివరాలను ధృవీకరించేందుకు టిటీఈలు రైల్వే యాప్‌లను కూడా ఉపయోగించే అవకాశం ఉంది.
చెల్లుబాటు అయ్యే టికెట్ లేదా అనుమతించిన ప్రయాణ పత్రం లేకుండా రైలులో ప్రయాణిస్తే అదనపు ఛార్జీతో పాటు జరిమానా చెల్లించాల్సి రావచ్చు. 2026లో చేసిన నిబంధనల మార్పుల ప్రకారం, అనధికార ప్రయాణానికి విధించే కనీస అదనపు ఛార్జీని రూ.250 నుంచి రూ.500కు పెంచారు. ఈ మార్పు జూన్ 20 నుంచి అమల్లోకి వచ్చింది.
Read Also: వెయిటింగ్ లిస్ట్ ఉన్నా టెన్షన్ వద్దు.. చార్ట్ తర్వాత కూడా రైలు టికెట్ ఇలా బుక్ చేసుకోవచ్చు!