Train Ticket Booking Rules: రైలు టికెట్ బుక్ చేసుకోవాలంటే ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది. ముఖ్యంగా పండుగలు, సెలవులు, వేసవి లాంటి రద్దీ సమయాల్లో చాలా రైళ్ల టికెట్లు త్వరగా అయిపోతాయి. క్షణాల్లో వెయిటింగ్ లిస్ట్ కనిపిస్తుంది. అయితే, రిజర్వేషన్ చార్ట్ సిద్ధమైన తర్వాత కూడా టికెట్ దొరికే అవకాశం ఉందా? రైల్వే రూల్స్ ఏం చెప్తున్నాయంటే..
రిజర్వేషన్ చార్ట్ రెడీ అయిన తర్వాత కూడా రైలుకు టికెట్ బుకింగ్ పూర్తిగా ఆగిపోదు. రైలులో కొన్ని సీట్లు, బెర్త్ లు ఖాళీగా మిగిలితే వాటిని కరెంట్ బుకింగ్ ద్వారా ప్రయాణికులకు అందుబాటులో ఉంచుతారు. రైల్వే నిబంధనల ప్రకారం చార్టింగ్ తర్వాత మిగిలిన ఖాళీ వసతిని బుక్ చేసుకునే విధానాన్నే కరెంట్ బుకింగ్ అంటారు. అయితే, ఇందులో కీలక విషయం ఉంది. కరెంట్ బుకింగ్ ద్వారా కేవలం కన్ఫర్మ్ టికెట్లు మాత్రమే జారీ అవుతాయి. RAC, వెయిటింగ్ లిస్ట్ టికెట్లు ఈ విధానంలో ఇవ్వరు.
రైలు ప్రయాణానికి కొన్ని గంటల ముందు చూసినప్పుడు భారీ వెయిటింగ్ లిస్ట్ కనిపించవచ్చు. దీంతో చాలామంది ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకోకుండా ఆగిపోతారు. కానీ, ఆ తర్వాత కొందరు ప్రయాణికులు తమ టికెట్లను రద్దు చేసుకోవచ్చు. అలాగే చార్టింగ్ సమయంలో ఇతర మార్పుల వల్ల కొన్ని సీట్లు ఖాళీగా మిగిలే అవకాశం ఉంటుంది. అలాంటి సీట్లు అందుబాటులోకి వస్తే కరెంట్ బుకింగ్ ద్వారా వాటిని బుక్ చేసుకోవచ్చు. అందుకే ముందుగా టికెట్ అందుబాటులో లేకపోయినా, చార్ట్ తయారైన తర్వాత మరోసారి లైవ్ సీటు అవైలబులిటీ చెక్ చేయడం ఉపయోగకరంగా ఉంటుంది.
కరెంట్ బుకింగ్‌లో సాధారణ రిజర్వేషన్‌కు భిన్నంగా కొన్ని నియమాలు ఉంటాయి. ఇందులో సాధారణ ప్రయాణికులు, ఏజెంట్లు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ-టికెట్ బుకింగ్ మాత్రమే అనుమతిస్తారు. అలాగే కరెంట్ బుకింగ్ సమయంలో కన్ఫర్మ్ టికెట్ మాత్రమే జారీ అవుతుంది. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు వర్తించే రాయితీలు మాత్రం అందుబాటులో ఉంటాయి. ఈ బుకింగ్‌లో బోర్డింగ్ పాయింట్ మార్చడం, పేరు, వయస్సు లాంటి వివరాలను మార్చడం సాధ్యం కాదు.
ఇటీవల రైల్వేలు రిజర్వేషన్ చార్ట్ తయారీ విధానంలో మార్పులు చేశాయి. గతంలో మొదటి చార్ట్ సాధారణంగా రైలు బయలుదేరే సమయానికి కొన్ని గంటల ముందు సిద్ధమయ్యేది. ఇప్పుడు కొన్ని రైళ్లకు మొదటి చార్ట్ ను మరింత ముందుగానే సిద్ధం చేస్తున్నారు. రైలు బయలుదేరే సమయాన్ని బట్టి మొదటి చార్ట్ సుమారు 9 నుంచి 18 గంటల ముందే సిద్ధమయ్యే విధానం అమల్లో ఉంది. ఇక రెండో రిజర్వేషన్ చార్ట్ సాధారణంగా రైలు బయలుదేరే సమయానికి దాదాపు 30 నిమిషాల ముందు సిద్ధమవుతుంది.
Read Also: హైదరాబాద్ బుల్లెట్ రైళ్ల స్పీడుపై షాకింగ్ అప్‌డేట్.. ఏంటీ, మరీ అంత తక్కువా?