ప్రయాణీకుల భద్రత విషయంలో భారతీయ రైల్వే కఠిన చర్యలు తీసుకుంటున్నది. రైల్వే కోచ్ లోనూ సురక్షితంగా ఉండేలా తగిన ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగానే రైల్వే కోచ్ లలో సీసీ కెమెరాలను ఇన్ స్టాల్ చేయాలని నిర్ణయించింది. ముందుగా నార్త్ సెంట్రల్ రైల్వే(NCR) పరిధిలోని ప్రయాగ్ రాజ్, ఝాన్సీ, ఆగ్రా డివిజన్లలో సుమారు 1,800 ప్యాసింజర్ కోచ్ లలో CCTV కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఆధునిక, సాంప్రదాయ రైలు కోచ్ లలో భద్రత, పర్యవేక్షణను బలోపేతంకానుంది. రైలు ప్రయాణాన్ని సురక్షితంగా ఉంచడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నట్లు NCR అధికారులు వెల్లడించారు.
ఈ ప్రాజెక్లులో భాగంగా 895 ఆధునిక LHB కోచ్‌లు, 887 ICF కోచ్ లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ సీసీ కెమెరాలు రైల్వే రేక్ లలో సమగ్ర నిఘాను అందించనున్నాయి. ప్రయాగ్ రాజ్ ఎక్స్ ప్రెస్, శ్రమశక్తి ఎక్స్ ప్రెస్ లతో సహా ఎంపిక చేసిన ప్రీమియం రైళ్లలో AI-ఆధారిత CCTV కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఇవి అధునాతన ట్రాకింగ్, రియల్-టైమ్ పర్యవేక్షణకు సహకరిస్తాయి. ప్రతి ఎయిర్ కండిషన్డ్ కోచ్ లో నాలుగు CCTV కెమెరాలు ఏర్పాటు చేస్తారు. జనరల్ కంపార్ట్ మెంట్లు, SLR కోచ్ లు, ప్యాంట్రీ కార్లలో 6 చొప్పున కెమెరాలు ఏర్పాటు చేస్తారు. ఈ కెమెరాలు గంటకు 100 కి.మీ కంటే ఎక్కువ వేగంతో, లో లైట్ పరిస్థితులలో కూడా స్పష్టమైన వీడియోలను రికార్డు చేస్తాయి.
ఈ ప్రాజెక్ట్ తొలి దశలో, ప్రయా గ్‌రాజ్ ఎక్స్ ప్రెస్, శ్రమశక్తి ఎక్స్ ప్రెస్, ప్రయాగ్ రాజ్-డాక్టర్ అంబేద్కర్ నగర్ ఎక్స్ ప్రెస్, కాళిండి ఎక్స్ ప్రెస్, ప్రయాగ్ రాజ్-లాల్ గఢ్ ఎక్స్ ప్రెస్, సుబేదార్ గంజ్-డెహ్రాడూన్ ఎక్స్ ప్రెస్, సుబేదార్ గంజ్-మీరట్ సిటీ సంగం ఎక్స్ ప్రెస్, సుబేదార్ గంజ్-శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా జమ్మూ మెయిల్ లాంటి ప్రధాన రైళ్లలో కెమెరాలు ఏర్పాటు చేస్తారు. CCTV యూనిట్లు కోచ్‌ల లోని నాలుగు ఎంట్రీ పాయింట్లు, కారిడార్లను కవర్ చేసి లోపల ప్రతి కదలికను రికార్డు చేస్తాయి. ఈ వీడియో ఫీడ్ ను NCR ప్రధాన కార్యాలయాలతో పాటు ఆగ్రా, ఝాన్సీ, ప్రయాగ్‌రాజ్ లో ఉన్న డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయాలలో పర్యవేక్షించనున్నారు. లోకోమోటివ్ క్యాబిన్లలో నిఘా పరికరాలను ఏర్పాటు చేసే ప్రణాళికలు కూడా జరుగుతున్నాయి.
ప్రయాణాలను సురక్షితంగా మార్చడంలో భాగంగా ఈ సీసీకెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు NCR చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ శశికాంత్ త్రిపాఠి వెల్లడించారు. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను నిరోధించడంతో పాటు, నిఘా వ్యవస్థ వేగవంతమైన దర్యాప్తు, పర్యవేక్షణ ప్రయత్నాలను సులభతరం చేస్తుందన్నారు. ఇన్‌స్టాలేషన్ పనులు త్వరలో ప్రారంభమవుతాయని వెల్లడించారు.
Read Also: పండుగ సీజన్ కోసం మరో 150 ప్రత్యేక రైళ్లు, ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్!