Indian Railways: భారతీయ రైల్వే సంస్థ ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించేందుకు ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. నిత్యం కోట్లాది మంది రైల్వే ప్రయాణం చేస్తున్న నేపథ్యంలో వారి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగానే త్వరలో జనరల్ టికెట్లకు సంబంధించిన రూల్స్ విషయంలో కీలక మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా రైల్వే టికెట్లలో రిజర్వేషన్, జనరల్ టికెట్లు ఉంటాయి. ఫస్ట్ ఏసీ, సెకెండ్ ఏసీ, థర్డ్ ఏసీ, చైర్ కార్, స్లీపర్, సెకెండ్ సీటింగ్ బోగీల్లో ప్రయాణం చేయాలాంటే ముందుగా టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్ కోచ్ లలో రిజర్వేషన్ చేయకుండానే అప్పటికప్పుడు టికెట్ తీసుకుని ప్రయాణించే అవకాశం ఉంటుంది.
జనరల్ టికెట్ బుకింగ్ రూల్స్ లో కీలక మార్పులు
ఇక భారతీయ రైల్వే సంస్థ ఇప్పటి వరకు ఉన్న జనరల్ టికెట్ బుకింగ్ రూల్స్ లో కొన్ని కీలక మార్పులు చేయనుంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం జనరల్ టికెట్లు కొనుగోలు చేసిన ప్రయాణీకులు, ఏ రైలులో అయినా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. పలానా రైళ్లోనే వెళ్లాలి అనే రూల్ ఏమీ లేదు. అయితే, ఇండియన్ రైల్వే తీసుకురాబోయే కొత్త రూల్స్ తో ఇకపై ఈ వెసులు బాటు ఉండకపోవచ్చు. ఇకపై జనరల్ టికెట్ పై వెళ్లాల్సిన రైలు పేరును మెన్షన్ చేసే అవకాశం ఉంది. టికెట్ మీద ఏ రైలు పేరు ఉంటే, ఆ రైలులోనే వెళ్లాల్సి ఉంటుంది.
జనరల్ టికెట్ రూల్స్ ఎందుకు మార్చుతున్నారంటే?
రీసెంట్ గా ఢిల్లీ రైల్వే స్టేషన్ లో ప్రయాణీకుల రద్దీ కారణంగా తీవ్ర స్థాయిలో తొక్కిసలాట జరిగింది. పలువురు ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నిరోధించడంతో పాటు ప్రయాణీకుల భద్రతను మెరుగుపరచడానికి కొత్త నిబంధనలు తీసుకొస్తున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే జనరల్ టికెట్ల మీద పేర్లను రాయాలనే అంశంపై తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. త్వరలోనే రైల్వేశాఖ అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
ఇకపై ఇష్టం వచ్చిన రైలు ఎక్కుతామంటే కుదరదు!
త్వరలో అందుబాటులోకి రానున్న జనరల్ టికెట్ రూల్స్ ప్రకారం ఒక టికెట్ తీసుకున్నాక, ఆ టికెట్ మీద మెన్షన్ చేసిన రైలులోనే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ రైలులో ఎక్కడం కుదరకపోతే మరో రైలు టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు, కొత్త రైల్వే రూల్స్ ప్రకారం జనరల్ టికెట్ కొనుగోలు చేసిన తర్వాత సుమారు 3 గంటల వరకు వ్యాలిడిటీ ఉండనుంది. నిర్ణీత సమయంలోగా ప్రయాణం మొదలుపెట్టకపోతే, ఆ టికెట్ చెల్లుబాటు కాదు.
Read Also: ఈ పిల్లాడివి ‘ఊసరవెల్లి’ కళ్లు.. రంగులు ఎలా మారుతున్నాయో చూడండి!
ఈ నిబంధనలతో ప్రయాణీకుల భద్రత పెరిగే అవకాశం ఉంటుందని రైల్వే అధికారులు భావిస్తున్నారు. అంతేకాదు, రైలు ప్రయాణాలను మరింత సౌకర్యవంతంగా ఉంటాయంటున్నారు. వీలైనంత త్వరగా ఈ రూల్స్ గురించి రైల్వేశాఖ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Read Also: మొసళ్లతో నిండిన నదిని దాటబోయిన 8 నక్కలు.. చివరికి ఎన్ని మిగిలాయంటే?