Tirumala News: శ్రీవారి సేవకులకు శుభవార్తగా చెప్పవచ్చు. శ్రీవారి సేవకుల కోసం టీటీడీ సరికొత్త విధానాలను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులకు సేవలు అందించేందుకు శ్రీవారి సేవకులు ఎందరో నిత్యం ఉంటారు. క్యూ లైన్ల వద్ద, అన్నప్రసాదం కేంద్రాల వద్ద వీరి సేవలు అమోఘం. గోవిందా అనే నామస్మరణ సాగిస్తూ సేవకులు భక్తితత్వంతో భక్తుల సేవలో తరిస్తుంటారు. అటువంటి శ్రీవారి సేవకుల కోసం టీటీడీ కీలక నిర్ణయం తీసుకోనుంది.
కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడు వెలసిన తిరుమలకు నిత్యం ఎందరో భక్తులు వస్తుంటారు. శ్రీవారిని దర్శించుకున్న భక్తులు గోవిందా నామస్మరణ సాగిస్తూ తమ భక్తిని చాటుకుంటారు. అయితే శ్రీవారి భక్తుల సేవలో టీటీడీ అనునిత్యం తరిస్తుంటుంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తారు. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా దేశ విదేశాల నుండి శ్రీవారి భక్తులు తిరుమలకు రావడం సర్వసాధారణమే. అయితే శ్రీవారి భక్తుల సేవ కోసం శ్రీవారి సేవకులను టీటీడీ నియమిస్తుంది.
శ్రీవారి సేవలో తరించే అవకాశాన్ని భక్తులకు కల్పించేందుకు టీటీడీ, శ్రీవారి సేవకులను నియమిస్తుంది. శ్రీవారి సేవకులు తాము చేసే సేవ కోసం ముందుగా రిజిస్ట్రేషన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి టీటీడీ, శ్రీవారి సేవకులుగా అవకాశం కల్పిస్తుంది. వీరు అనునిత్యం శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సేవలో తరిస్తుంటారు. తిరుమలలో ఏ బ్రహ్మోత్సవాలు జరిగినా శ్రీవారి సేవకులు ప్రధాన పాత్ర పోషిస్తారు. కేవలం గోవిందా అనే నామస్మరణ సాగిస్తూ, భక్తులకు పలు సూచనలు జారీ చేస్తూ శ్రీవారి సేవలో సేవకులు తరిస్తుంటారు.
ఇటీవల రథసప్తమి ఉత్సవాల సమయంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విశిష్ట సేవలు అందించిన శ్రీవారి సేవకులతో సమావేశం నిర్వహించారు. భక్తులకు శ్రీవారి సేవకులు అర్థరాత్రి సమయంలో కూడా విశేషంగా సేవలందించడం చాలా ఆనందం కలిగించిందని, శ్రీవారి సేవకుల విధానాన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అలాగే సీఎం చంద్రబాబు కూడా శ్రీవారి భక్తులకు అందించే సేవలపై ఆధ్యాత్మిక సంస్థల సూచనలు, సలహాలు స్వీకరించాలని సూచించారు. అందుకే టీటీడీ అధ్వర్యంలో శ్రీసత్యసాయి సేవా సంస్థలకు చెందిన నలుగురు సభ్యుల బృందం సమగ్రనివేదికను రూపొందించింది.
శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు మరింత బాధ్యతగా సేవా భావంతో సేవలు అందించేందుకు శ్రీసత్యసాయి సేవా సంస్థలకు చెందిన నలుగురు సభ్యుల బృందం సమగ్రనివేదికను రూపొందించింది. ఈ బృందం టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో ఈవో జె. శ్యామల రావుకు నివేదికను అందించారు. శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు దేశంలో పేరొందిన ఆధ్యాత్మిక సంస్థల నిర్వహణా పరమైన సూచనలను, సలహాలను తీసుకుని అమలు చేయాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటనలో భాగంగా ఆదేశించడం జరిగింది.
ఇందులో భాగంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థలకు చెందిన నలుగురు బృందం రఘుపాత్రుని లక్ష్మణరావు, రాష్ట్ర అధ్యక్షులు, చుండూరి సురేంద్ర, రాష్ట్ర ఉపాధ్యక్షులు, కొమరగిరి శ్యామ్ ప్రసాద్, రాష్ట్ర సేవా సమన్వయకర్త, చెవిటి విశ్వనాథ రెడ్డి, రాష్ట్ర జాయింట్ సేవా సమన్వయకర్త ఫిబ్రవరి 28 నుండి 5 రోజుల పాటు తిరుమలలో క్షేత్రస్థాయిలో శాఖల వారీగా పరిశీలించి నివేదికను తయారు చేసి టిటిడి ఈవోకు అందించారు.
నివేదికలో సేవకులకు మాస్టర్ ట్రైనర్స్ ద్వారా ట్రైనింగ్, సులభతరంగా రిజిస్ట్రేషన్ , క్షేత్ర స్థాయిలో శిక్షణ , గ్రామ స్థాయిలో ధర్మ ప్రచారానికి సేవకులతో సమన్వయం చేసేలా సూచించారు. వీటితో పాటు శాఖల వారీగా చేపట్టాల్సిన అంశాలను, సౌకర్యాలను నివేదిక రూపంలో ఈవోకు అందించారు. సదరు 7 పేజీల నివేదిక ఇచ్చిన ప్రతినిధులను ఈ సందర్భంగా ఈవో అభినందించారు. శ్రీవారి సేవకుల సేవలపై శ్రీ సత్యసాయి సేవా సంస్థ ప్రతినిధులు ఇచ్చిన నివేదిక మరింత ఉపయోగకరంగా ఉందని, సదరు నివేదికలోని అంశాలను అమలు చేసి శ్రీవారి భక్తులకు మరింత మెరుగ్గా సేవలు అందించేందుకు ఉపయోగపడుతుందని ఈవో చెప్పారు. ఈ సందర్భంగా నివేదికపై తదుపరి చర్యలు తీసుకోవాలని సిపీఆర్వో డా.టి.రవిని ఈవో ఆదేశించారు. మొత్తం మీద శ్రీవారి సేవకులకు క్షేత్రస్థాయిలో శిక్షణ ఇవ్వాలని సూచించడం, అలాగే రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభతరం చేయాలని సూచించడం అభినందనీయమని పలువురు శ్రీవారి సేవకులు తెలిపారు.