Real Time Reservation Facility: వందేభారత్ లో ప్రయాణించాలనుకు ప్యాసింజర్లకు రైల్వేశాఖ అదరిపోయే విషయం చెప్పింది. రైలు బయల్దేరే 15 నిమిషాల ముందు టికెట్లను బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు రియల్ టైమ్ రిజర్వేషన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పింది. ప్రయాణీకుల సౌలభ్యాన్ని పెంచడం, సీట్ల ఆక్యుపెన్సీని ఆప్టిమైజ్ చేయడం కోసం ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపింది. చివరి నిమిషంలో ప్రయాణం చేయాలనుకునే ప్రయాణీకులకు ఈ విధానం ఎంతో మేలుకలగనుంది. ఈ కొత్త బుకింగ్ ఆన్ లైన్ తో పాటు ఆయా మార్గాల్లోని స్టేషన్ కౌంటర్లలో నేరుగా అందుబాటులో ఉందని రైల్వే వెల్లడించింది.
అమల్లోకి రియల్ టైమ్ రిజర్వేషన్ విధానం
భారతీయ రైల్వే ఈ సరికొత్త టికెట్ బుకింగ్ విధానాన్ని తాజాగా అమల్లోకి తీసుకొచ్చింది. కేరళలో, అలప్పుజ మార్గంలో నడిచే తిరువనంతపురం- మంగళూరు, మంగళూరు- తిరువనంతపురం వందే భారత్ రైళ్లకు ఈ రియల్ టైమ్ బుకింగ్ ఆప్షన్ ను అమలు చేస్తోంది. గతంలో రైలు ప్రయాణానికి ముందే టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉండేది. కానీ, ఇప్పుడు, రైలు దాని ప్రారంభ స్టేషన్ నుంచి బయలుదేరిన తర్వాత కూడా టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఆయా మార్గంలో ప్రయాణించే సయంలో ఖాళీ అయిన సీట్లను బుర్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. దీని వలన మార్గం మధ్యలో ఎక్కే ప్రయాణీకులకు ఎంతో మేలు కలగనుంది.
ఇతర మార్గాల్లోనూ అమలు చేస్తున్న ఇండియన్ రైల్వే
రియల్ టైమ్ టికెట్ బుకింగ్ విధానాన్ని కేరళతో పాటు ఇతర కీలకమైన వందే భారత్ మార్గాలకు విస్తరించింది. వీటిలో చెన్నై- నాగర్ కోయిల్, నాగర్ కోయిల్- చెన్నై సర్వీసులతో పాటు కోయంబత్తూర్- బెంగళూరు మార్గం, మంగళూరు- మద్గావ్ కనెక్షన్, మధురై- బెంగళూరు సర్వీస్, చెన్నై- విజయవాడ రైళ్లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం 8 రైల్వే జోన్ లోని మొత్తంగా 8 వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను కవర్ చేస్తుంది. ఈ విధానం ప్రయాణాన్ని క్రమబద్ధీకరించడానికి, ప్రీమియం రైళ్లలో అందుబాటులో ఉన్న వసతిని ఉపయోగించుకునేలా ఉపయోగపడుతుంది.
Read Also: ప్రయాణికుడిని చితకబాదిన రైల్వే కేటరింగ్ సిబ్బంది.. ఆ విషయం ఎవరు లీక్ చేశారు?
వందేభారత్ నెట్ వర్క్ అంతటా సీట్ల ఆక్యుపెన్సీ పెరిగే అవకాశం
తాజాగా భారతీయ రైల్వే తీసుకొచ్చిన ఈ కీలకమైన మార్పు వందే భారత్ నెట్ వర్క్ అంతటా సీట్ల ఆక్యుపెన్సీ రేట్లను గణనీయంగా మెరుగుపరచడానికి ఉపయోగపడనుంది. ఆకస్మిక ప్రయాణాలు చేయాలనుకునే ప్రయాణీకులకు ఎక్కువ సౌలభ్యాన్ని అందిస్తుంది. ఈ విధానం సెమీ హై స్పీడ్ రైలులో ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. బుకింగ్ ప్రక్రియ మరింత సమర్థవంతమైన, ప్రయాణీకులకు అనుకూలమైన రైల్వే విధానం వైపు కీలక ముందడుగా చెప్పుకోవచ్చు. ఇకపై వందే భారత్ రైళ్లు బయలుదేరే 15 నిమిషాల ముందు రియల్ టైమ్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉందంటున్నారు రైల్వే అధికారులు. ప్రయాణీకులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు.
Read Also: తెలంగాణలో ఔటర్ రింగ్ రైలు, పది జిల్లాలను మీదుగా రైల్వే లైన్!