Beautiful Indian Railway Station: దేశంలో సుమారు 7,100 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ప్రధాన నగరాల నుంచి మొదలుకొని మారుమూల ప్రాంతాల వరకు రైల్వే స్టేషన్లు విస్తరించాయి. దేశ వ్యాప్తంగా ఒకటి, అర మినహా అన్ని రాష్ట్రాల్లో రైల్వే లైన్లు ఉన్నాయి. రైల్వే స్టేషన్లు ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించడంతో పాటు ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయాన్ని సమకూర్చుతున్నాయి. ఇక దేశంలోని ఎన్నో రైల్వే స్టేషన్లు తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయి. కొన్ని రైల్వే స్టేషన్లు 24 గంటలు భారీ భద్రతా వలయంలో ఉంటే, మరికొన్ని రైల్వే స్టేషన్లు అత్యంత పొడవైనవి, అత్యంత చిన్నవిగా గుర్తింపు తెచ్చుకున్నాయి. ఇంకొన్ని రైల్వే స్టేషన్లు అత్యంత భయంకరమైనవిగా ముద్రపడ్డాయి. మరికొన్ని రైల్వే స్టేషన్ల నుంచి నేరుగా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఇలా దేశంలోని పలు రైల్వే స్టేషన్లు అనేక ప్రత్యేకతలను కలిగి ఉన్నాయి.
దేశంలోనే అత్యంత అందమైన రైల్వే స్టేషన్
ఇప్పుడు మనం దేశంలోనే అత్యంత అందమైన రైల్వే స్టేషన్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. సాధారణంగా తమిళనాడుతో పాటు కేరళలోని పలు రైల్వే స్టేషన్లు చాలా అందంగా ఉంటాయి. చుట్టూ పచ్చని ప్రకృతి అందాల నడుమ ఆకట్టుకుంటాయి. దట్టమైన అడవులు, పారే సెరయేళ్లు, లోయలు, తేయాకు తోటల నడుమ ఆహా అనిపించేలా ఉంటాయి. ఇక దేశంలోని ప్రకృతి అందాల నడుమ ఆకట్టుకునే అత్యంత సుందరమైన రైల్వే స్టేషన్ గా లవ్ డేల్ రైల్వే స్టేషన్ గుర్తింపు తెచ్చుకుంది. తమిళనాడులోని ఊటీ ప్రాంతంలో ఈ రైల్వే స్టేషన్ ఉంటుంది. దేశంలో అత్యంత ప్రశాంతమైన రైల్వే స్టేషన్ గానూ లవ్ డేల్ గుర్తింపు తెచ్చుకుంది.
Read Also: ఇండియన్ రైల్వే సరికొత్త నిర్ణయం, ఇక టికెట్ లేకుండా స్టేషన్ లోకి అడుగు పెట్టడం అసాధ్యం!
బ్రిటిష్ కాలంలో నిర్మాణం
ఈ రైల్వే స్టేషన్ బ్రిటిష్ కాలంలో నిర్మాణం జరుపుకుంది. 1907లో ఈ రైల్వే స్టేషన్ ను ఆంగ్లేయులు తమ అవసరాల కోసం నిర్మించారు. లవ్ డేల్ రైల్వే స్టేషన్ సముద్ర మట్టాలనికి 7,193 అడుగుల ఎత్తులో ఉంటుంది. స్టేషన్, రైలు ట్రాక్ రోడ్డుకు సమాంతరంగా ఆనుకుని ఉంటాయి. ఈ రైల్వే స్టేషన్ వాలుగా ఉన్న టిన్ పైకప్పుతో సాధారణ కుటీర నిర్మాణంగా ఉంటుంది. తెలుపు, నీలం రంగులో పెయింట్ చేయబడి ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్ దక్షిణ రైల్వే జోన్ లోని సేలం రైల్వే డివిజన్ పరిధిలో ఉంటుంది. నీలగిరి పర్వత రైల్వేకు సంబంధించి నాలుగు రైళ్లు రోజుకు ఎనిమిది సార్లు ఇక్కడి నుంచి ప్రయాణిస్తాయి. ఈ రైల్వే స్టేషన్ ను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఈ స్టేషన్ గోడపై ఉన్న ఇత్తడి ఫలకం తనను తాను యునెస్కో సైట్ గా గర్వంగా ప్రకటించుకుంటుంది. తమిళనాడు పర్యటనకు వెళ్లిన ప్రతి ఒక్కరు నీలగిరి మౌంటైన్ రైల్వేకు సంబంధించిన టాయ్ ట్రైన్ జర్నీ తప్పకుండా చేస్తారు. వారంతా లవ్ డేల్ రైల్వే స్టేషన్ అందాలను తిలకించే అవకాశం ఉంటుంది. మీరూ తమినాడుకు వెళ్తే ఈసారి తప్పకుండా ఈ రైల్వే స్టేషన్ ను చూసిరండి!
Read Also: తొలి రాజధానికి 56 ఏళ్లు.. దేశంలో ఎన్ని రైళ్లు సేవలు అందిస్తున్నాయో తెలుసా?