Indian Cheapest Train Journey: ప్రస్తుతం దేశంలో వందేభారత్, నమో భారత్, రాజధాని, శతాబ్ది లాంటి రైళ్లు ప్రజలకు అత్యంత మెరుగైన సేవలను అందిస్తున్నాయి. అత్యంత వేగం, చక్కటి సౌకర్యాలు ప్రజలకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని కలిగిస్తున్నాయి. ఈ రైళ్ల టికెట్లకు ఏడాదంతా ఫుల్ డిమాండ్ ఉంటుంది. సీట్ల లభ్యతను బట్టి ఛార్జీలు ఉంటాయి. ఈ రైళ్ల టికెట్ ధరలు ఒక్కోసారి విమాన ఛార్జీలను తలపిస్తాయి. కానీ, మనం చెప్పుకోబోయే ఈ రైలు దేశంలోనే అత్యంత చౌకైన రైలు. వేగం పరంగానూ వందేభారత్, రాజధాని ఎక్స్ ప్రెస్ రైళ్లను మించి ఉంటుంది. ఇంతకీ ఆ రైలు ఏది? టికెట్ ధర ఎంత ఉంటుంది? అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
పేదల రాజధాని ఈ ‘గరీబ్ రథ్’ ఎక్స్ ప్రెస్
దేశంలో అతి తక్కువ టికెట్ ధర కలిగిన ఏసీ ఎక్స్ ప్రెస్ రైలు గరీబ్ రథ్ ఎక్స్ ప్రెస్. ఈ రైల్లో అత్యంత తక్కువ ఛార్జీ ఉంటుంది. రాజధాని, శతాబ్ది, వందే భారత్ లాంటి రైళ్ల మాదిరిగానే, ఈ రైలు పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ రైలు. ఛార్జీల పరంగా మిగతా రైళ్లతో పోల్చితే చాలా చౌకగా ఉంటుంది. ఏసీ కోచ్ లు ఉన్న ఈ రైలు ఛార్జీ కిలో మీటరుకు కేవలం 68 పైసలు ఉంటుంది. పేదలకు తక్కువ ఖర్చుతో ఏసీ ప్రయాణాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ రైలును ప్రారంభించారు. 2006లో ఈ రైలు మొదటిసారి బీహార్ లోని సహర్సా నుంచి అమృత్ సర్ కు ప్రారంభించారు. ప్రస్తుతం గరీబ్ రైళ్లు 26 మార్గాల్లో నడుస్తున్నాయి. ఈ రైలుకు కూడా ప్రజల నుంచి మంచి డిమాండ్ ఉంటుంది. టికెట్ కోసం ప్రయాణీకులు పోటీ పడుతుంటారు.
వేగం ఎక్కువ.. టికెట్ ధర తక్కువ
ఇక గరీబ్ థర్ వేగం ఇతర ఎక్స్ ప్రెస్ రైళ్లకు ధీటుగా ఉంటుంది. వందే భారత్ ఎక్స్ ప్రెస్ వేగం గంటకు 160 కి.మీ అయినప్పటికీ, ప్రస్తుతం రైళ్ల సగటు వేగం గంటకు 66 నుంచి 96 కి.మీకి పరిమితం చేశారు. గరీబ్ రథ్ రైలు సగటున గంటకు 70 నుంచి 75 కి.మీ వేగంతో నడుస్తుంది.
ఇక చెన్నై నుంచి ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ మధ్య నడిచే గరీబ్ రథ్ దేశంలోనే అత్యంత దూరం ప్రయాణించే గరీబ్ రథ్ ఎక్స్ ప్రెస్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ రెండు నగరాల మధ్య ఈ దూరం 2075 కి.మీ ఉంటుంది. ఈ రైలు చెన్నై నుంచి ఢిల్లీకి 28 గంటల 30 నిమిషాల్లో చేరుకుంటుంది. ఈ రైలు ఛార్జీ రూ. 1,500గా ఉంటుంది. ఇక ఇదే మార్గంలో రాజధాని ఎక్స్ ప్రెస్ 28.25 గంటల్లో చేరుకుంటుంది. రాజధాని ఎక్స్ ప్రెస్ థర్డ్ ఏసీ ఛార్జీ రూ.4210. అంటే, గరీబ్ రథ్ ధరకు దాదాపు మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది. అంటే గరీబ్ రథ్ లో కిలో మీటరుకు ఛార్జీ కేవలం 68 పైసలు ఉంటుంది.
Read Also: దేశంలో అతిపెద్ద రైల్వే స్టేషన్లు ఇవే, ఒక్కో స్టేషన్ లో ఎన్ని ఫ్లాట్ ఫారమ్ లు ఉన్నాయో తెలుసా?