IndiGo flight Viral Video: ఢిల్లీ నుంచి నుంచి శ్రీనగర్ వెళ్తూ రాళ్ల వర్షంలో చిక్కుకున్న ఇండిగో విమానం ఘటన మర్చిపోక ముందే.. మరో ఇండిగో విమానం కల్లోల పరిస్థితుల్లో చిక్కుకుంది. విపరీతమైన దుమ్ము తుఫాన్ లో చిక్కి ఊగిపోయింది. పరిస్థితి చక్కబడే వరకు గాల్లోనే చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. ప్రయాణీకులు ప్రాణాలను అర చేతిలో పట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చింది. చివరకు పైలెట్ చాకచక్యంతో సేఫ్ గా ల్యాండ్ చేశాడు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిందంటే..?
రాయ్ పూర్- ఢిల్లీ విమానంలో కల్లోలం
దుమ్ము తుఫాన్ కారణంగా రాయ్ పూర్- ఢిల్లీ ఇండిగో విమానంలో విపత్కర పరిస్థితులు ఎదురయ్యాయి. విపరీతమైన దుమ్ము తుఫాను చుట్టుముట్టడంతో గాల్లోనే చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. ఆదివారం సాయంత్రం ఢిల్లీలో గాలి దుమారం చెలరేగింది. నెమ్మదిగా తీవ్రమైన దుమ్ము తుఫానుగా మారింది. అదే సమయంలో రాయ్ పూర్ నుంచి బయల్దేరిన ఇండిగో విమానం ఢిల్లీ సమీపంలోకి చేరుకుంది. బలమైన ఈదురు గాలులు, దుమ్ము తుఫాన్ లో చిక్కుకుపోయింది. ఈ నేపథ్యంలో ఏటీసీ అధికారులు ల్యాండింగ్ కు అనుమతి ఇవ్వలేదు. పరిస్థితి చక్కబడే వరకు గాల్లోనే చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. ఈ సమయంలో ప్రయాణీకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి ఓ ప్రయాణీకుడు వీడియోను రికార్డు చేసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. విమానం గాల్లో చక్కర్లు కొడుతున్న సమయంలో పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు కనిపిస్తోంది.
#WATCH | An IndiGo flight number 6E 6313 from Raipur to Delhi experienced turbulence due to a duststorm, prompting the pilot to climb up again when the aircraft was about to touch down at Delhi airport. The aircraft landed safely at Delhi airport after making many circuits in the… pic.twitter.com/TtDUwIH79b
— ANI (@ANI) June 1, 2025
సేఫ్ గా ల్యాండ్ చేసిన పైలెట్
దుమ్ము తుఫాన్ ప్రభావం తగ్గిన తర్వాత ఇండిగో విమానం దిగేందుకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత ఢిల్లీ విమానాశ్రయంలో సదరు విమానం సురక్షితంగా దిగింది. విమానం దుమ్ము తుఫాన్ లో చిక్కుకున్న సమయంలో గాలి వేగం గంటకు 80 కి.మీ గా ఉన్నట్లు వెల్లించారు. ఇవాళ తెల్లవారు జామున కూడా ఢిల్లీలో బలమైన దుమ్ము తుఫాన్ చెలరేగింది. గడిచిన మూడు రోజుల పాటు ఢిల్లీలో ఓ మోస్తారు వర్షాలు కురవడంతో వాతావరణం చల్లడించింది.
రాళ్ల వానలో చిక్కుకున్న ఇండిగో విమానం
గత నెల 22న ఇండిగో విమానం రాళ్ల వానలో చిక్కుకుంది. ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో విమానం మార్గమధ్యంలో వడగళ్ల వానలో చిక్కుకుంది. విమాన సిబ్బంది, క్యాబిన్ సిబ్బంది నిర్దేశిత నిబంధనలను అనుసరించి విమానాన్ని శ్రీనగర్‌లో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటనలో విమానం ముందు భాగం ధ్వంసం అయ్యింది. అయినప్పటికీ పైలెట్ చాకచక్యంతో సేఫ్ గా కిందికి దించాడు. రెండు వారాల వ్యవధిలో రెండుసార్లు ఇండిగో విమానాలు విపత్కర పరిస్థితులలో చిక్కుకోవడంతో ప్రయాణీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరో 30 ఎయిర్ బస్ విమానాల కొనుగోలు
అటు విమానయాన రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ఇండిగో విమానయాన సంస్థ ప్రయత్నిస్తోంది. ఇండిగో ఎయిర్ లైన్స్.. ఎయిర్ బస్ నుంచి మరో 30 ( ఏ350 రకం విమానాలు) కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకంది. గత ఏడాది ఏప్రిల్‌లోనూ ఇండిగో.. ఎయిర్‌బస్ నుంచి 30 (ఏ350 రకం) విమానాలు కొనేందుకు ఆర్డర్ చేసింది. తాజా ఒప్పందంతో ఇండిగో ఏ350 విమానాల సంఖ్య 60కి చేరింది.