HBD Maniratnam: ప్రముఖ దర్శకులు మణిరత్నం(Maniratnam ) 1956 జూన్ 2న తమిళనాడులోని మధురైలో ఫిలిం బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబంలోనే రెండవ సంతానంగా జన్మించారు. ఎస్. గోపాలరత్నం ‘వీనస్ పిక్చర్స్’ లో పనిచేసే చిత్ర పంపిణీదారుడు. ఈయన మామ వీనస్ కృష్ణమూర్తి.. చిత్ర నిర్మాత. ఈయన అన్నయ్య జి.వెంకటేశ్వర కొన్ని చిత్రాలను నిర్మించారు. కానీ ఆయన 2003లోనే మరణించారు. అలాగే ఈయన తమ్ముడు జి.శ్రీనివాసన్ కూడా కొన్ని చిత్రాలను నిర్మించగా.. ఆయన కూడా 2007లోనే మరణించారు. ఇకపోతే బెసెంట్ థియోసాఫికల్ స్కూల్లో చదువుతున్నప్పుడే ఇంట్లో సినిమాలు చూడడం నిషిద్ధమని తెలిసినా రహస్యంగా సినిమాలు చూసేవారట . ఆ సమయంలో శివాజీ గణేషన్ (Sivaji Ganesan), నగేష్(Nagesh ) వంటి హీరోలంటే చాలా ఇష్టమని సమాచారం.
సినిమా కోసం ఉద్యోగానికే రాజీనామా..
ఇక పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత మద్రాస్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న రామకృష్ణ మిషన్ వివేకానంద కళాశాల నుండి వాణిజ్యంలో పట్టభద్రుడు అయ్యాడు. ఆ తర్వాత ముంబైలోని జమ్నాలాల్ బజాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ నుండి ఫైనాన్స్ లో మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేసిన ఈయన.. మద్రాస్ లోని ఒక సంస్థలో మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా ఉద్యోగంలో చేరి.. ఆ తర్వాత ఉద్యోగం సంతృప్తికరంగా లేకపోవడంతో దర్శకుడు బి.ఆర్ పంతులు కుమారుడు రవిశంకర్, తన మొదటి సినిమాను నిర్మించే పనిలో ఉండగా.. మణిరత్నం, రవిశంకర్ మరొక స్నేహితుడు చిత్ర నిర్మాత ఎస్ బాలచందర్ కుమారుడు రామన్ ఈ సినిమా స్క్రిప్ట్ పై పనిచేశారు . మణిరత్నం సినిమా నిర్మాణంలో చురుకుగా పాల్గొనేలా చూసుకోవడానికి తన ఉద్యోగానికి రాజీనామా కూడా చేశాడు.. అయితే అనుభవం లేకపోవడంతో నిర్మాతలు ఎక్కువగా అమెరికన్ సినిమా ఆటోగ్రాఫర్ మ్యాగజైన్ పైన ఆధారపడ్డారు. షూటింగ్ ప్రారంభించారు. కానీ అది ముందుకు సాగలేదు. చివరికి ఆపేశారు. కానీ చిత్ర నిర్మాత కావాలని ఆయన ఆలోచన ఆయనను ముందడుగు వేసేలా చేసింది.
మణిరత్నం స్థాయిని పెంచిన సినిమాలు..
మణిరత్నం మొదట ఆంగ్లంలో రాసిన స్క్రిప్టును సినిమాగా రూపొందించి, దానికి ‘పల్లవి అను పల్లవి’ అని పేరు పెట్టారు. తన మామ కృష్ణమూర్తి ఈ చిత్రాన్ని తక్కువ బడ్జెట్ లోనే నిర్మించారు. ఇక తర్వాత 1986లో తమిళ ప్రేమ కథ చిత్రం ‘మౌనరాగం’కి దర్శకత్వం వహించారు. ఈ సినిమాను తెలుగులో కూడా అదే పేరుతో డబ్ చేయగా.. ఆంధ్రప్రదేశ్లో విజయం సాధించి దర్శకుడిగా మణిరత్నం స్థాయిని పెంచింది. అంతేకాదు 34వ జాతీయ అవార్డుల్లో తమిళంలో ఉత్తమ చలనచిత్రంగా నేషనల్ అవార్డు లభించింది. ఈ సినిమాకి దర్శకత్వం వహించినందుకు మొదటి ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు మణిరత్నం. 1987లో కమల్ హాసన్ (Kamal Haasan)హీరోగా ‘నాయకన్’ సినిమా చేయగా.. ఏకంగా నేషనల్ స్థాయిలో ఆయనకు విజయాన్ని అందించింది. ఇక తమిళంలో వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన తెలుగులో చేసిన ఒకే ఒక చిత్రం ‘గీతాంజలి’. ఈ సినిమా ఆయనకు భారీ విజయాన్ని అందించింది. ముఖ్యంగా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన అన్ని తమిళ్ చిత్రాలు కూడా తెలుగులో డబ్బింగ్ చేయబడ్డాయి. ముఖ్యంగా రోజా, బొంబాయి, గీతాంజలి మొదలైన చిత్రాలు మణిరత్నం స్థాయిని మరింత పెంచాయని చెప్పవచ్చు.
మణిరత్నం అందుకున్న అవార్డులు..
ఇకపోతే ఈయన అసలు పేరు గోపాలరత్నం సుబ్రహ్మణ్యం. కానీ ఇండస్ట్రీకి వచ్చాక మణిరత్నంగా తన పేరును మార్చుకున్నారు. తమిళ్, హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో చిత్ర దర్శకుడిగా, నిర్మాతగా, స్క్రీన్ రైటర్ గా పనిచేసి మంచి పేరు అందుకున్నారు. ఈయన సినీ కెరియర్లో 7 నేషనల్ అవార్డులు, 4 ఫిలింఫేర్ అవార్డులు, 6 సౌత్ ఫిలింఫేర్ అవార్డులతో పాటు వివిధ చలనచిత్రోత్సవ అవార్డులు కూడా లభించాయి. ఇక 2002లో భారత ప్రభుత్వం చేత ‘పద్మశ్రీ’ కూడా అందుకున్నారు.
మణిరత్నం వ్యక్తిగత జీవితం..
వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. ప్రముఖ హీరోయిన్ సుహాసిని (Suhasini) ని 1988 ఆగస్టు 26న వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు కూడా ఉన్నారు. ప్రస్తుతం కమలహాసన్ తో ‘థగ్ లైఫ్’ సినిమాకి దర్శకత్వం వహించారు. 38 ఏళ్ల తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా జూన్ 5న విడుదల కాబోతోంది. ఈరోజు మణిరత్నం పుట్టిన రోజు కావడంతో పలువురు సెలబ్రిటీలు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
also read:Dhanush: నన్నేం పీ*కలేరు.. నేషనల్ అవార్డు పక్కా.. ట్రోలర్స్ కి ధనుష్ గట్టి కౌంటర్!