Traffic jam Deaths India: ఇటీవల జరిగిన ట్రాఫిక్ జామ్ ఒక సాధారణ రోడ్డు సమస్యగా కాకుండా, తీవ్ర మానవీయ విషాదంగా మారింది. గంటల తరబడి వాహనాలు కదలక నిలిచిపోయిన ఈ ఉదంతంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం భయంకర స్థితిని తెలియ చేస్తోంది. వర్షం, రహదారి పనులు, తగిన ప్రత్యామ్నాయ మార్గాల లేకపోవడం అన్నీ కలిసి ఒక పెద్ద ట్రాఫిక్ విపత్తుగా మారాయి. ప్రజలు వాహనాల్లోనే ఇరుక్కుపోయి, అత్యవసర వైద్య సేవలు అందక నష్టపోయారు. ఈ సంఘటన సాంకేతిక లోపాలు, ప్లానింగ్ లోపాలు ఎలా మానవ జీవితాలపై ప్రభావం చూపుతాయో స్పష్టంగా చూపించింది. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?
ఇందోర్ -దేవాస్ హైవేపై జరిగిన ట్రాఫిక్ జామ్ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇందోర్ నగరం నుంచి దేవాస్ వైపు వెళ్లే ప్రధాన హైవేపై జరిగిన ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. గురువారం సాయంత్రం మొదలైన ట్రాఫిక్ జామ్ శుక్రవారం రాత్రి వరకు దాదాపు 30 గంటలపాటు కొనసాగింది. ట్రాఫిక్ నిలిచిపోవడంతో దాదాపు 8 కిలోమీటర్ల మేర వాహనాలు నిటారుగా నిలిచిపోయాయి.
వర్షం కారణంగా రోడ్డుపై భారీగా నీరు నిలవడం, హైవే పనులు వల్ల దారిని చిన్న సర్వీస్ రోడ్డుకు మళ్లించడం వంటి అంశాలు ఈ దుర్గటనకు దారితీశాయని స్థానికులు తెలుపుతున్నారు. చిన్న మార్గంలో పెద్ద సంఖ్యలో వాహనాలు పోవడం వల్ల తీవ్ర బీభత్సం నెలకొంది. వేలాది మంది ప్రయాణికులు ఎటు పోవాలో అర్థం కాక, గంటల తరబడి కార్లలోనే ఉండాల్సి వచ్చింది.
ఈ ట్రాఫిక్ జామ్ కారణంగా ఓ వ్యక్తి ఆసుపత్రికి వెళ్లే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. సందీప్ పటేల్ అనే వ్యక్తికి ఛాతిలో నొప్పిగా ఉండడంతో కుటుంబసభ్యులు అతన్ని కారులో ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. ట్రాఫిక్ నుంచి బయట పడేలోపే అతని ఆరోగ్యం మరింత క్షీణించి, ఆసుపత్రికి చేరుకోగలకుండానే చనిపోయాడు. ఇదే తరహాలో మరో ఇద్దరు వ్యక్తులు కమల్ పంచాల్ (62), బలరాం పటేల్ (55) కూడా వాహనాల్లోనే అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయారు. వృద్ధులైన వీరికి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తడం, సమయానికి వైద్య సేవలు అందకపోవడం వారి మరణాలకు కారణమయ్యింది. ఈ ఘటనలు విని ఎవరి హృదయమైనా కలిచివేయకుండా ఉండదు.
ఇందోర్ కలెక్టర్ అషీష్ సింగ్ ఈ ఘటనపై స్పందిస్తూ, ట్రాఫిక్ నియంత్రణ కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఎన్‌హెచ్ఏఐ, ట్రాఫిక్ పోలీసులు, పురపాలక సంస్థలు, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ అధికారులతో సమావేశమై సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ట్రాఫిక్ జామ్ వల్ల జరిగిపోయిన నష్టం తిరిగి మిగిలేదేం కాదు. ఇక, ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రంగా స్పందించింది. పలు రోజులుగా ఈ బైపాస్‌పై ట్రాఫిక్ సమస్య ఉంది. కానీ అధికారులు పట్టించుకోలేదు. మూడు ప్రాణాలు పోయాక చర్యలు తీసుకోవడమేంటి? అంటూ విమర్శలు గుప్పించింది.
ఈ పరిస్థితి వర్షాకాలంలో ప్రభుత్వ యంత్రాంగం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనేది స్పష్టంగా చూపిస్తోంది. హైవే పనులు జరుగుతున్న ప్రదేశాల్లో తగిన బోర్డులు, మార్గదర్శక సూచనలు లేకపోవడం, ప్రత్యామ్నాయ మార్గాలను ముందే సిద్ధం చేయకపోవడం వల్లే ఈ భయం కలిగింది.
ముఖ్యంగా వర్షం పడినప్పుడు రహదారులు నీటితో నిండి ప్రయాణికులకు అష్టకష్టాలు తప్పడం లేదు. అదనంగా, ట్రాఫిక్‌ను సర్వీస్ రోడ్డుకు మళ్లించినా ఆ దారి చాలా ఇరుకుగా ఉండటంతో వాహనాలు ఎదురెదురుగా నెట్టుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. అత్యవసర వైద్యం అవసరమైన వారికీ గమ్యం చేరకుండానే ప్రాణాలు పోవడం వంటి ఘటనలు ప్రభుత్వ పాలనా వైఫల్యాన్ని ఎత్తిచూపుతున్నాయి.
Also Read: Naa Anvesh latest video: అంత దరిద్రమైన వీడియోస్ అవసరమా.. నా అన్వేష్ పై నెటిజన్స్ ఫైర్!
సామాజిక మాధ్యమాల్లో ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. జీవితాన్ని రోడ్డుపై కోల్పోతారా?, ఇలాంటి హైవే ప్లానింగ్‌తో ఎవరూ సురక్షితంగా ఉండలేరు అంటూ నెటిజన్లు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఒకప్పుడే ఇది జాగ్రత్తగా పరిశీలించాల్సిన అంశం. వర్షాకాలంలో రహదారి ప్రణాళికలు, రవాణా మార్గాలు, ఎమర్జెన్సీ సర్వీసుల ప్రాప్యతపై ప్రభుత్వం ముందే జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇంతటి పెద్ద ముప్పు వాటిల్లినా ఇప్పటికీ అక్కడ ఎలాంటి శాశ్వత మార్పులు తీసుకొచ్చారో స్పష్టత లేదు. రహదారి నిర్మాణ పనులు పూర్తికాకపోవడమే కాదు, వాటిని సమయానికి పూర్తి చేయకపోవడం వల్లే ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. వాస్తవానికి ఇలాంటి సమస్యలపై ముందుగానే సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలి. భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నప్పుడు ట్రాఫిక్ డైవర్షన్లను సమర్థవంతంగా అమలు చేయాలి. ఇది కేవలం మధ్యప్రదేశ్ కు మాత్రమే సంబంధించనిది కాదు. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ సంఘటన నుండి పాఠం నేర్చుకోవాలని నెటిజన్స్ కోరుతున్నారు.
ప్రజల ప్రాణాలు ఈజీగా పోతున్న సమయంలో ప్రభుత్వం చేసే ప్రతిరోజూ ప్రతినిమిషపు నిర్ణయాలు ఎంతో కీలకం. హైవే రహదారుల ప్రణాళికలో మార్పులు, పనుల వేగవంతత, అత్యవసర పరిస్థితులకు స్పందించే విధానం వంటి అంశాలను అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలి. లేకపోతే, ఈ రోజు మధ్యప్రదేశ్‌లో జరిగిందేమో కానీ రేపు మన రాష్ట్రంలో జరగకపోతుందన్న హామీ లేదన్నది విశ్లేషకుల అంచనా. ప్రజల ప్రాణాలు కాపాడే విధంగా చర్యలు తీసుకోవడం ప్రభుత్వ ధర్మం. అందుకే ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూసుకోవడం ప్రభుత్వ బాధ్యతగా మారాలని వాహనదారులు కోరుతున్నారు.