విదేశాలకు వెళ్లే టూరిస్టులు అక్కడ ఎలా మసులుకోవాలో చెప్పేందుకు ఇదో బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఆయా దేశాల చట్టలు గురించి తెలియకుండా ఏది పడితే అది చేస్తామంటే అస్సలు కుదరదు. ముఖ్యంగా ముస్లీం కంట్రీస్ లో నిబంధనలకు చాలా కఠినంగా ఉంటాయి. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఒళ్లు దగ్గర పెట్టుకొని ప్రవర్తించాలి. టూరిస్ట్ స్పాట్లకు వెళ్లామా.. చూశామా… ఎంజాయ్ చేసి వచ్చామా? అన్నట్లు ఉండాలి. లేదంటే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. తాజాగా బోస్నియాకు చెందిన ఓ లేడీ టూరిస్టు సుమారు 15 సెకెన్ల పాటు చేసిన డ్యాన్స్ ఇప్పుడు 5 ఏళ్ల జైలు శిక్ష పడే పరిస్థితికి తీసుకొచ్చింది.
బోస్నియాకు చెందిన మిరియం అనే సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ రీసెంట్ గా టర్కీకి వెళ్లింది. అక్కడ పర్యటక అందాలను చూసి ఎంజాయ్ చేసింది. అయితే, కప్పడోసియాలోని ఉచిసార్ పట్టణంలో ఆమె చేసిన ఓ డ్యాన్స్ ఇప్పుడు చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొనేందుకు కారణం అయ్యింది. గ్రే కలర్ లెగ్గింగ్స్, తెల్లటి టీ షర్ట్ ధరించి జెండా ఉన్న పోల్ మీద డ్యాన్స్ చేసింది. ఈ ఘటనను టర్కీ అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. ఆమెపై కేసు నమోదు చేసిన దర్యాప్తు మొదలుపెట్టారు.
ఈ ఘటనకు సంబంధించి నెవ్సెహిర్ ప్రావిన్షియల్ గవర్నర్ కార్యాలయం కీలక ప్రకటన చేసింది. ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు తెలిపింది. “మా నగరంలో టర్కిష్ జెండా స్తంభం దగ్గర ఒక విదేశీ పౌరురాలు అనుచిత ప్రవర్తనకు పాల్పడించింది. టర్కిష్ శిక్షాస్మృతిలోని ఆర్టికల్ 300, 301 కింద నెవ్సెహిర్ చీఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం ఒక క్రిమినల్ కేసు నమోదు చేసి చట్టపరమైన దర్యాప్తు ప్రారంభించింది. గవర్నర్ కార్యాలయం ఈ అనుచిత సంఘటనను నిశితంగా పరిశీలిస్తోంది. ఇది మా ప్రజల నైతిక విలువలకు అగౌరవానికి నిదర్శనంగా మేము భావిస్తున్నాము” అని వెల్లడించింది.
ఆర్టికల్ 300 ప్రకారం, టర్కిష్ జెండా పట్ల బహిరంగంగా అగౌరవం చూపితే మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది. ఆర్టికల్ 301 టర్కిష్ దేశాన్ని, అక్కడి ప్రభుత్వాన్ని లేదంటే జాతీయ వీరులను అవమానించడాన్ని సూచిస్తుంది. ఈ సెక్షన్ కింద రెండు సంవత్సరాల వరకు జైలు శిక్షను కలిగి ఉంటుంది.
అటు ఈ ఘటనపై పర్యాటకురాలు మరియం రియాక్ట్ అయ్యింది. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆమె.. తను తాను సమర్థించుకుంది. టర్కిష్ ప్రభుత్వం సంకుచిత మనస్తత్వానికి నిదర్శనంగా అభివర్ణించింది. తాను డ్యాన్స్ చేసిన రోజు అక్కడున్న టర్కీ ప్రజలు చూసి ఎంతో ఆనందపడటంతో పాటు ఆశ్చర్యపోయారని చెప్పుకొచ్చింది. ఇలాంటి చర్యల వల్ల ఆదేశానికి టూరిస్టులు వెళ్లేందుకే భయపడే అవకాశం ఉందన్నారు.