Indian Railways: దేశ వ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తుల కోసం భారతీయ రైల్వే సరికొత్త టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొస్తున్నది. ఇప్పటికే హైదరాబాద్ నుంచి నార్త్ లోని పలు ఆధ్యాత్మిక ప్రదేశాలకు భారత్ గౌరవ్ రైలు ద్వారా ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించిన IRCTC, తాజాగా తిరుపతి, శ్రీకాళహస్తిని కవర్ చేసేలా నాలుగు రోజుల టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ‘తిరుపతి బై నారాయణాద్రి’ పేరుతో ఈ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ టూర్ కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ప్యాకేజీ ఛార్జీల వివరాలు
ఈ రైలులో ఏసీ, స్లీపర్ క్లాస్ బెర్తులు అందుబాటులో ఉన్నాయి. థర్డ్ ఏసీలో సింగిల్ షేరింగ్ కు ఒక్కో వ్యక్తికి రూ. 13,950గా నిర్ణయించారు. ట్విన్ షేరింగ్ కి రూ. 10,860, త్రిఫుల్ షేరింగ్ కు రూ. 9080గా నిర్ణయించారు. 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు బెర్త్ తో అయితే రూ. 6, 620, బెర్త్ లేకుండా అయితే రూ. 5560గా ఫిక్స్ చేశారు. ఇక స్లీపర్ క్లాస్ లో సింగిల్ షేరింగ్ కు రూ. 12,080, ట్విన్ షేరింగ్ కు రూ.8,990, త్రిఫుల్ షేరింగ్ కు 7,210, 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు బెర్త్ తో అయితే, 4,750, బెర్త్ లేకుండా అయితే, రూ. 3,690గా నిర్ణయించారు.
3 రాత్రలు, నాలుగు పగళ్లు
ఈ టూర్ నాలుగు రోజుల పాటు కొనసాగుతుంది.
DAY1: 12734 నెంబర్ గల ఎక్స్ ప్రెస్ రైలు సాయంత్రం 5.30 గంటలకు లింగంపల్లి నుంచి బయల్దేరుతుంది. సాయంత్రం 6.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. సాయత్రం 7.38 గంటలకు నల్లగొండకు వస్తుంది. రాత్రంతా ప్రయాణిస్తుంది.
DAY2: ఉదయం 5.55 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. ప్రయాణీకులను హోటల్ కు తీసుకెళ్తారు. ఫ్రెప్ అప్ అయిన తర్వాత తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయానికి తీసుకెళ్తారు. ఆ తర్వాత శ్రీకాళహిస్తి ఆలయానికి తీసుకెళ్తారు. ఆ తర్వాత మళ్లీ హోటల్ కు తీసుకొస్తారు. రాత్రి తిరుపతిలోనే బస చేయాల్సి ఉంటుంది.
DAY3: మూడో రోజు తెల్లవారు జామున 2.30 గంటలకు హోటల్ నుంచి బయల్దేరుతారు. తిరుమల ఉచిత దర్శనం క్యూ దగ్గర దింపుతారు. మధ్యాహ్నం వరకు దర్శనం పూర్తి అవుతుంది. మళ్లీ అందరినీ హోటల్ కు తీసుకెళ్తారు. ఫ్రెష్ అయ్యాక.. అందరినీ రైల్వే స్టేషన్ దగ్గరికి తీసుకొస్తారు. 12733 నెంబర్ గల ఎక్స్ ప్రెస్ సాయంత్రం 6.35 గంటలకు తిరుపతి నుంచి బయల్దేరుతుంది. రాత్రంతా జర్నీ కొనసాగుతుంది.
DAY 4: నాలుగో రోజు ఉదయం 3.04 గంటలకు నల్లగొండ చేరుకుంటారు. ఉదయం 5.35 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటారు. ఉదయం 6.45కు లింగంపల్లికి రావడంతో టూర్ పూర్తి అవుతుంది.
ప్యాకేజీలో కల్పించే వసతులు
ఇక ఈ టూర్ ప్యాకేజీలో వెళ్లే వారికి తిరుపతిలో వసతి సౌకర్యం కల్పిస్తారు. ఆలయ దర్శనాలకు ఏసీ వాహనాలను ఏర్పాటు చేస్తారు. ప్రణాళిక ప్రకారం దర్శనాలు చేయించే బాధ్యత తీసుకుంటారు. ఫుడ్ విషయానికి వస్తే ఒకసారి బ్రేక్ ఫాస్ట్ మాత్రమే అందిస్తారు. బ్రేక్ ఫాస్ట్ మినహా మిగతా భోజనాల ఖర్చులను ప్రయాణీకులు భరించాల్సి ఉంటుంది. దర్శనం టికెట్లు కూడా ప్రయాణీకులే తీసుకోవాలి. టూర్ గైడ్ సర్వీసు కావాలంటే ప్రత్యేకంగా పే చేయాల్సి ఉంటుంది.
Read Also: ఇండియాలో టాప్ 5 లగ్జరీ రైళ్లు ఇవే, ఒక్కసారైనా జర్నీ చేయాల్సిందే!