IRCTC Japan Tour 2026: జపాన్ పర్యటనకు వెళ్లాలనుకునే భారతీయుల కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మరో క్రేజీ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. జపాన్‌లోని ప్రముఖ నగరాలను సందర్శించేలా 10 రోజులు, 9 రాత్రుల ప్రత్యేక పర్యటనను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ టూర్ సెప్టెంబర్ 6న ప్రారంభం కానుంది. ఢిల్లీ నుంచి విమానంలో ప్రయాణం మొదలై, సెప్టెంబర్ 15న తిరిగి ఢిల్లీకి చేరుకునేలా ప్రణాళిక రూపొందించారు. ఈ పర్యటనలో జపాన్‌లోని ప్రముఖ నగరాలైన టోక్యో, హకోనే, హమామత్సు, క్యోటో, ఒసాకా, నారా, హిరోషిమాలను సందర్శించే అవకాశం ఉంటుంది. జపాన్ సంస్కృతి, చారిత్రక ప్రదేశాలు, ప్రకృతి అందాలు, ఆధునిక సాంకేతికతను ఒకే ట్రిప్‌లో చూసేలా ఈ ప్యాకేజీని రూపొందించారు.
ప్యాకేజీ ధర విషయానికి వస్తే, ముగ్గురు కలిసి ఒక రూమ్ ను షేర్ చేసుకుంటే, ఒక్కో వ్యక్తికి రూ.3,45,999 నుంచి ప్రారంభమవుతుంది. ఇద్దరు ఒక రూమ్ లో ఉండే ప్యాకేజీ ధర రూ.3,49,999. స్పెషల్ రూమ్ కావాలంటే రూ.4,73,999 చెల్లించాల్సి ఉంటుంది. పిల్లలతో ప్రయాణించే కుటుంబాలకు కూడా ప్రత్యేక ధరలు ఉన్నాయి. 5 నుంచి 11 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు బెడ్‌తో రూ.2,92,499, బెడ్ లేకుండా రూ.2,63,999గా నిర్ణయించారు.
ఈ ప్యాకేజీలో ప్రయాణికులకు అవసరమైన చాలా సేవలను IRCTC కల్పిస్తోంది. ఢిల్లీ నుంచి జపాన్‌కు రానుపోను ఎకానమీ క్లాస్ విమాన టికెట్లు, ఫోర్ స్టార్ హోటళ్లలో వసతి, జపాన్ టూరిస్ట్ వీసా ఫీజు, ప్రతిరోజూ బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం ఇందులో ఉంటాయి. అలాగే విమానాశ్రయం నుంచి హోటల్‌కు ట్రాన్స్ పోర్ట్, ఏసీ కోచ్‌లలో లోకల్ టూర్ ప్లేసెస్, 70 ఏళ్లలోపు ప్రయాణికులకు ట్రావెల్ ఇన్సూరెన్స్, టూర్ గైడ్, ట్యాక్స్ లు కూడా ఈ ప్యాకేజీలోనే అందిస్తారు.
సెప్టెంబర్ 6న సాయంత్రం ఢిల్లీ నుంచి ఆల్ నిప్పన్ ఎయిర్‌వేస్ విమానంలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం టోక్యోలోని హనెడా విమానాశ్రయానికి చేరుకుంటారు. తిరుగు ప్రయాణం సెప్టెంబర్ 15న హనెడా నుంచి ప్రారంభమై అదే రోజు ఢిల్లీకి చేరుకుంటుంది. అయితే, విమాన సమయాలు ఎయిర్‌లైన్ మెయింటెనెన్స్ అవసరాలను బట్టి మారే అవకాశం ఉందని IRCTC వెల్లడించింది.
ఈ టూర్‌లో టోక్యోలోని అసకుసా ఆలయం, నకమిసే డోరి, ఉయెనో పార్క్, ఒడైబా, టీమ్‌ల్యాబ్ ప్లానెట్స్ లాంటి ప్రముఖ ప్రదేశాలను సందర్శిస్తారు. వాతావరణం అనుకూలంగా ఉంటే మౌంట్ ఫూజీ ఐదో స్టేషన్, లేకపోతే ఒషినో హక్కాయ్ ప్రాంతానికి తీసుకెళ్తారు. అలాగే హకోనే రోప్‌వే, హకోనే పైరేట్ షిప్ ప్రయాణం కూడా ఈ ప్యాకేజీలో ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. అంతేకాకుండా, నగోయాలోని టయోటా మ్యూజియం, SCMAGLEV రైల్వే మ్యూజియం, క్యోటోలోని అరషియామా వెదురు అడవి, కింకాకు-జి ఆలయం, ఫుషిమి ఇనారి తైషా, ఒసాకా కోట, నారా జింకల పార్క్, హిరోషిమా శాంతి స్మారక పార్క్, మియాజిమా ద్వీపం, ఇత్సుకుషిమా ఆలయం లాంటి ప్రదేశాలు కూడా ఈ యాత్రలో ఉన్నాయి. వీటితో పాటు జపాన్ ప్రపంచ ప్రఖ్యాత షింకన్సెన్ బుల్లెట్ రైలులో షిన్-ఒసాకా నుంచి హిరోషిమా వరకు ప్రయాణించే అవకాశం కూడా లభిస్తుంది.
Read Also: జంగిల్ సఫారీకి రెడీనా? అయితే, మీ కోసమే IRCTC క్రేజీ టూర్ ప్యాకేజీ రెడీ!