hotel check in safety tips| ఎప్పుడైనా ట్రావెల్ చేస్తున్నప్పడు హోటల్ లాడ్జింగ్‌లో బస చేయడం సాధారణం. అయితే హోటల్ చేరుకున్న వెంటనే బ్యాగులు పెట్టుకుని మంచంపై వాలిపోవడం చాలామందికి అలవాటు. కానీ గది ఎంత అందంగా కనిపించినా, కొన్ని విషయాలు ముందుగా పరిశీలించడం చాలా అవసరం.
చిన్న నిర్లక్ష్యం భద్రత, పరిశుభ్రత, ప్రైవసీ, సౌకర్యాల విషయంలో ఇబ్బందులు కలిగించవచ్చు. అందుకే హోటల్‌లో చెక్-ఇన్ చేసిన వెంటనే కొన్ని నిమిషాలు గది పరిశీలించండి.
గదిలోకి వెళ్లిన వెంటనే భద్రతకు సంబంధించిన విషయాలను ముందుగా పరిశీలించాలి. మెయిన్ డోర్ లాక్, గడియ, సేఫ్టీ చైన్ సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చూడండి. వాటిని రెండు మూడుసార్లు తెరిచి, మూసి పరీక్షించండి. గదిలో బాల్కనీ లేదా కిటికీ ఉంటే వాటి లాక్స్ కూడా చెక్ చేయండి. అవి లోపలి నుంచి పూర్తిగా మూసుకుంటున్నాయో నిర్ధారించుకోండి. లాక్‌లో ఏదైనా సమస్య కనిపిస్తే వెంటనే రిసెప్షన్‌కు సమాచారం ఇవ్వండి. అవసరమైతే మరో గదిని కేటాయించాలని హోటల్ సిబ్బందిని అడగండి.
హోటల్ గదిలోకి వెళ్లిన వెంటనే మంచంపై పడుకోకుండా ముందుగా దాన్ని పరిశీలించండి. బెడ్‌షీట్, మ్యాట్రెస్ అంచులు, మూలలు, కుట్టిన ప్రాంతాలను జాగ్రత్తగా చూడండి. ఏవైనా మరకలు, పురుగులు లేదా అపరిశుభ్రత కనిపిస్తున్నాయో పరిశీలించండి. మ్యాట్రెస్ స్టిచింగ్ ఉన్న ప్రాంతాల్లో బెడ్‌బగ్స్ వంటి పురుగులు దాగి ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి సమస్య కనిపిస్తే వెంటనే హోటల్ సిబ్బందికి తెలియజేయండి. అవసరమైతే బెడ్‌షీట్ మార్చించండి లేదా మ్యాట్రెస్‌ను పరిశీలించమని అడగండి.
బాత్రూమ్ పరిశుభ్రంగా ఉండటం సౌకర్యవంతమైన హోటల్ బసకు చాలా ముఖ్యం. టాయిలెట్ సీట్, ట్యాప్స్, షవర్ ప్రాంతాన్ని ముందుగా పరిశీలించండి. స్పష్టంగా కనిపించే శుభ్రత సమస్యలు ఉంటే వెంటనే హౌస్ కీపింగ్‌కి చెప్పండి. అలాగే వేడి నీరు వస్తుందో లేదో ముందుగానే పరీక్షించండి. గీజర్ ఆన్ చేసి కొద్దిసేపటి తర్వాత నీటి ఉష్ణోగ్రతను పరిశీలించండి. ఇలా చేయడం వల్ల ఉదయం తయారయ్యే సమయంలో అనవసరమైన ఇబ్బందులు తగ్గుతాయి.
తెలియని ప్రదేశంలో బస చేస్తున్నప్పుడు వ్యక్తిగత గోప్యతకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. గదిలో అవసరం లేని వస్తువులు లేదా ఎలక్ట్రానిక్ పరికరాలు ఉంటే జాగ్రత్తగా వాటిని చెక్ చేయండి. అసాధారణంగా కనిపించే ఫిక్చర్లు లేదా పరికరాలపై జాగ్రత్తగా దృష్టి పెట్టండి. వాటిలో రహస్య కెమెరాలు ఉండే అవకాశం ఉంది. అయితే కనిపించే ప్రతి చిన్న లైట్‌ను రహస్య కెమెరాగా భావించకండి. ఏదైనా నిజంగా అనుమానాస్పదంగా అనిపిస్తే హోటల్ మేనేజ్‌మెంట్‌కు తెలియజేయండి. ఎలక్ట్రికల్ పరికరాలను మీరే విప్పి చూడకుండా జాగ్రత్త పడండి.
Also Read: షాపింగ్ సమయంలో అందమైన వస్తువులు చూడగానే కొనాలనిపిస్తుంది.. దీనికి కారణాలు ఇవే
గదిలోకి వెళ్లిన వెంటనే ఏసీ సరిగ్గా పనిచేస్తుందో పరీక్షించండి. రిమోట్‌తో ఏసీ ఆన్ చేసి కూలింగ్ వస్తుందో చూడండి. టీవీతో పాటు ఇతర ప్రాథమిక సౌకర్యాలు కూడా పనిచేస్తున్నాయో పరిశీలించండి.
మీ ఫోన్ ఛార్జర్‌తో అందుబాటులో ఉన్న సాకెట్లను చెక్ చేయవచ్చు. చివరగా రూమ్ ల్యాండ్‌లైన్ నుంచి రిసెప్షన్‌కు కాల్ చేసి పరీక్షించండి.
చిన్న చెక్‌తో హోటల్ బసను మరింత సౌకర్యవంతంగా మార్చుకోవచ్చు గదిలో స్థిరపడే ముందు కొన్ని నిమిషాలు పరిశీలిస్తే అనేక సమస్యలను ముందే గుర్తించి నివారించవచ్చు.
Also Read: చిన్న వయసులోనే పేరు, గుర్తింపు పొందుతారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి అతిత్వరగా విజయాలు సాధిస్తారు