Food Quality Issue in Vande Bharat: పాట్నా–టాటానగర్ మార్గంలో నడిచే వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలులో ఆహార నాణ్యతపై మరోసారి వివాదం చెలరేగింది. ఈసారి మ్యాటర్ మరింత సీరియస్ అయ్యింది. ప్రయాణికులకు అందించిన పెరుగులో పురుగులు వచ్చాయని ప్రయాణీకులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులను రైల్వేశాఖ సీరియస్ గా తీసుకుంటుంది. ఐఆర్‌సిటిసితో పాటు క్యాటరింగ్ కాంట్రాక్టర్ కు భారీగా జరిమానా విధించింది.
వందేభారత్ ప్రయాణీకులు పెరుగు చెడిపోయిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేశారు. ఈ విషయం ఒక్కసారిగా వైరల్ అయింది. వెంటనే స్పందించిన రైల్వేశాఖ ఫుడ్ సరఫరా చేస్తున్న సంస్థపై విచారణ ప్రారంభించింది. అదే సమయంలో ఐఆర్‌సిటిసికి రూ. 10 లక్షల జరిమానా విధించింది. అటు ఆన్‌బోర్డ్ ఫుడ్ సర్వీస్ ప్రొవైడర్ కు రూ. 50 లక్షల జరిమానా విధించింది. కాంట్రాక్టును రద్దు చేసుకోవాలని రైల్వే అధికారులు ఆదేశించారు. కాంట్రాక్టును రద్దు చేసే ప్రక్రియను కూడా ప్రారంభించారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు మళ్లీ జరగకుండా ఉండేందుకు, ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ చేసే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు.
అటు ఈ పెరుగు వ్యవహారానికి సంబంధించి రైల్వే అధికారులు అమూల్ కంపెనీని కూడా వివరణ కోసం పిలిపించారు. పెరుగు సరఫరాలో నాణ్యత లోపం ఎలా వచ్చిందనే విషయంపై పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీనివల్ల సరఫరా వ్యవస్థలో ఎక్కడ లోపం జరిగిందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. నిజానికి వందే భారత్ లాంటి ప్రీమియం రైళ్లలో ప్రయాణించే వారు మంచి ఆహారం, పరిశుభ్రత, నాణ్యతను ఆశిస్తారు. ఈ రైళ్లు సాధారణ రైళ్ల కంటే ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తాయి. సేవల నాణ్యత కూడా అదే స్థాయిలో ఉండాలని ప్రయాణికులు భావిస్తారు. ఈ ఘటన ఆ అంచనాలను తారుమారు చేసింది.
గత కొన్ని సంవత్సరాలుగా రైళ్లలో ఫుడ్ క్వాలిటీ పెంచేందుకు రైల్వే పలు చర్యలు తీసుకుంటోంది. ప్యాకేజింగ్ ప్రమాణాలు, పరిశుభ్రత నిబంధనలు, సరఫరాదారుల బాధ్యతను కఠినతరం చేసింది. తప్పులు జరిగితే జరిమానాలు విధించడం, కాంట్రాక్టులను రద్దు చేయడం లాంటి చర్యలు తీసుకుంటోంది. కానీ, తాజాగా ఈ ఘటన వెలుగులోకి రావడంతో రైల్వేశాఖ సీరియస్ అయ్యింది. అమూల్ పెరుగు వివాదం కేవలం ఘటన మాత్రమే కాదు, రైల్వే క్యాటరింగ్ వ్యవస్థలో ఉన్న లోపాలను బయటపెట్టింది. అదే సమయంలో, రైల్వే తీసుకున్న కఠిన చర్యలు భవిష్యత్తులో సేవలు మెరుగుపడతాయనే నమ్మకాన్ని కూడా ఇస్తున్నాయి. రాబోయే రోజుల్లో ప్రయాణికులు మరింత సురక్షితమైన, నాణ్యమైన ఆహారాన్ని పొందే అవకాశాలు పెరుగుతాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Read Also: వందే భారత్ ఫుడ్ బాగాలేదా? రైల్వే అధికారులకు ఎలా కంప్లైంట్ చేయాలంటే?