Tatkal Train Ticket Booking: తత్కాల్ రైలు టికెట్ బుకింగ్ విషయంలో తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిజమైన ప్రయాణీకులకు లబ్ది చేకూరేలా చర్యలు చేపడుతుంది. ఇకపై తత్కాల్ రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవాలనుకునే ప్రయాణీకులకు ఇ-ఆధార్ ప్రామాణీకరణను తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. “తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోవడానికి భారతీయ రైల్వే త్వరలో ఇ-ఆధార్ ప్రామాణీకరణను ప్రారంభించనుంది” అని ఎక్స్ వేదికగా వెల్లడించారు.
ఈ నిర్ణయం ఎందుకంటే?
రైల్వేశాఖ తాజా నిర్ణయం ప్రకారం నిజమైన ప్రయాణీకులకు తత్కాల్ టికెట్ బుకింగ్స్ లో ప్రాధాన్యత ఇవ్వనుంది. మొదటి 10 నిమిషాలలో అసలైన వినియోగదారులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేలా చర్యలు చేపడుతోంది. అక్రమ సాఫ్ట్ వేర్, చాట్ బాట్ లు ఉపయోగించకుండా చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం, రైలు ప్రయాణీకులు సీట్ల లభ్యతను బట్టి 60 రోజుల ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవచ్చు.తాజా ప్లాన్‌తో, నిజమైన వినియోగదారులు ధృవీకరించబడిన రైలు టికెట్లను పొందడంలో సహాయపడనుంది. అలాగే ఇప్పుడు తత్కాల్ విషయంలోనూ అసలైన వినియోగదారులకు మేలు కలిగేలా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ నెల చివరి నుంచి ఆధార్ ప్రమాణీకరణ
తత్కాల్ రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవాలనుకునే ప్రయాణీకులు ఇకపై ఇ-ఆధార్ ప్రామాణీకరణను తప్పనిసరి చేయనుంది. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి వైష్ణవ్ ప్రకటించారు. “తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి భారతీయ రైల్వే త్వరలో ఇ-ఆధార్ ప్రామాణీకరణను ఉపయోగించడం ప్రారంభిస్తాయి. ఇది నిజమైన వినియోగదారులకు అవసరమైనప్పుడు ధృవీకరించబడిన టికెట్లను పొందడానికి సహాయపడుతుంది” తెలిపారు. ఇ-ఆధార్ ప్రామాణీకరణ కోసం ఈ ఆన్‌లైన్ తత్కాల్ రైలు టికెట్ బుకింగ్ రూల్స్ మార్పు ఈ నెల చివరి నుంచి ప్రారంభమవుతుందని రైల్వే అధికారులు వెల్లడించారు.
Bharatiya Railways will soon start using e-Aadhaar authentication to book Tatkal tickets.
This will help genuine users get confirmed tickets during need.
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) June 4, 2025
బుకింగ్ ఏజెంట్లకు రైల్వే షాక్!
ఆధార్ కార్డుతో తమ అకౌంట్ ను లింక్ చేసే IRCTC వినియోగదారులకు తత్కాల్ టికెట్ బుకింగ్స్ లో ప్రాధాన్యత లభిస్తుందని రైల్వే అధికారులు వెల్లడించారు. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ అధీకృత ఏజెంట్లు కూడా తత్కాల్ విండో ఓపెనింగ్ మొదటి 10 నిమిషాల్లో ఎటువంటి బుకింగ్‌లు చేయడానికి అనుమతించబడరు. తత్కాల్ కోటా కింద ఆన్‌లైన్‌లో విక్రయించే టికెట్లలో సగానికి పైగా విండో తెరిచిన మొదటి 10 నిమిషాల్లోనే బుక్ అయిపోతున్నాయి.
తత్కాల్ టికెట్ బుకింగ్ నియమాలు
తత్కాల్ టికెట్ బుకింగ్ అనేది ప్రయాణీ తేదీకి ఒకరోజు ముందు అందుబాటులో ఉంటుంది. ఫస్ట్ AC, ఎగ్జిక్యూటివ్ క్లాస్ మినహా అన్ని తరగతులలో తత్కాల్ బుకింగ్‌లు అనుమతించబడతాయి. తత్కాల్ బుకింగ్‌లో ఎటువంటి రాయితీ అనుమతించబడదు. తత్కాల్ ఛార్జీలను రెండవ తరగతికి ప్రాథమిక ఛార్జీలో 10 శాతం, ఇతర అన్ని తరగతులకు ప్రాథమిక ఛార్జీలో 30 శాతం చొప్పున కనీస, గరిష్టంగా ఛార్జీ నిర్ణయించారు. రైలు బయల్దేరే ఒక రోజు ముందు ఉదయం 10 గంటల నుంచి తత్కాల్ టికెట్ బుకింగ్ ప్రారంభం అవుతుంది.
Read Also: 2 జతల రైళ్లు, వారానికి 6 రోజులు.. కాశ్మీర్ వందేభారత్ రైళ్ల టైమింగ్స్ ఇవే!