Ireland Visa Waiver 2026: విదేశీ పర్యటనలకు వెళ్లాలనుకునే భారతీయులకు ఐర్లాండ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. భారతీయులు ప్రత్యేకంగా ఐర్లాండ్ వీసా తీసుకోకుండానే ఆ దేశంలో పర్యటించేందుకు వీలు కల్పించే స్వల్పకాలిక వీసా మినహాయింపు కార్యక్రమాన్ని మరోసారి పొడిగించింది. ఈ స్కీమ్ గడువును 2026 డిసెంబర్ 31 వరకు పెంచింది. వాస్తవానికి ఈ కార్యక్రమం అక్టోబర్ 31తో ముగియాల్సి ఉంది. తాజాగా తీసుకున్న నిర్ణయంతో అర్హులైన భారతీయులకు ఐర్లాండ్ పర్యటనకు హ్యాపీగా వెళ్లే అవకాశం ఉంది.
ఈ స్కీమ్ ప్రకారం, అర్హత కలిగిన యూకే షార్ట్ స్టే వీసా కలిగి ఉండటంతో పాటు, ఆ వీసాను ఉపయోగించి ఇప్పటికే యూకేలోకి ప్రవేశించిన భారతీయులు స్పెషల్ ఐరిష్ వీసా లేకుండానే ఐర్లాండ్‌కు వెళ్లవచ్చు. అయితే, కేవలం యూకే విమానాశ్రయంలో విమానం మారి మరో దేశానికి వెళ్లే ప్రయాణికులకు ఈ అవకాశం ఉండదు. యూకేలో ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్ పూర్తి చేసి దేశంలోకి ఎంట్రీ ఇవ్వాలి. అయితే, ట్రాన్సిట్ వీసాలు, వెడ్డింగ్, సివిల్ భాగస్వామ్యం కోసం జారీ చేసిన వీసాలకు ఈ మినహాయింపు వర్తించదు.
భారతీయులతో పాటు పలు దేశాల పౌరులకు ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్స్ అందించనున్నారు. ఆసియా, యూరప్, మిడిల్ ఈస్ట్, సౌత్ అమెరికా ప్రాంతాలకు చెందిన కొన్ని దేశాలు ఇందులో ఉన్నాయి. భారత్‌తో పాటు చైనా, ఇండోనేషియా, కజకిస్తాన్, ఫిలిప్పీన్స్, థాయిలాండ్, వియత్నాం దేశాల పౌరులు ఈ పథకాన్ని వాడుకోవచ్చు. అలాగే బోస్నియా, హెర్జెగోవినా, కొసావో, మాంటెనెగ్రో, ఉత్తర మాసిడోనియా, సెర్బియా, టర్కీ, బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, కొలంబియా, పెరూ దేశాల పౌరులకు కూడా ఈ అవకాశం ఉంది.
ఈ స్కీమ్ లో భాగంగా ఐర్లాండ్ లో గరిష్టంగా 90 రోజుల వరకు ఉండేందుకు పర్మిషన్ లభిస్తుంది. అయితే, ప్రయాణికుడి యూకే వీసా, ఇమ్మిగ్రేషన్ అనుమతికి ఇంకా ఎంత గడువు మిగిలి ఉందనే అంశం కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఈ రెండింటిలో ఏది తక్కువైతే అంత కాలమే ఐర్లాండ్‌లో ఉండేందుకు అవకాశం ఉంటుంది. అర్హులైన వారు యూకే నుంచి నేరుగా ఐర్లాండ్‌కు వెళ్లవచ్చు. లేదంటే యూకేలోకి వెళ్లి, తర్వాత మరో దేశాన్ని సందర్శించి, అక్కడి నుంచి ఐర్లాండ్‌కు ప్రయాణించవచ్చు. అయితే, యూకే అనుమతి చెల్లుబాటులో ఉండటం తప్పనిసరి.
180 రోజులకు మించిన దీర్ఘకాలిక ఇమ్మిగ్రేషన్ అనుమతితో యూకేలో నివసిస్తున్న వారికి ఈ మినహాయింపు వర్తించదు. అలాంటి వారు ఐర్లాండ్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. అయితే, ఈ స్కీమ్ కింద అర్హత ఉన్న సందర్భాల్లో వీసా దరఖాస్తు ఫీజ్ నుంచి నుంచి మినహాయింపు లభిస్తుంది.
Read Also: సీతమ్మ ఊరి నుంచి రామయ్య అయోధ్యకు కొత్త రైలు.. ఇండియన్ రైల్వే గ్రీన్ సిగ్నల్!