కోతులు, పక్షులు, పాముల కారణంగా రైళ్ల రాకపోకలకు తరచుగా అంతరాయాలు ఏర్పడుతుంటాయి. తాజాగా ఓ పాము జపాన్ లో ఏకంగా బుల్లెట్ రైలు నిలిచిపోయేలా చేసింది. జపాన్ లో అత్యంత రద్దీగా ఉండే బుల్లెట్ రైలు మార్గంలో సడెన్ గా ఓ రైలును ఆపాల్సి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే..
బుల్లెట్ రైలును ఆపేసిన పాము
జపాన్ లో అత్యంత రద్దీ రూట్లలో టోక్యో- ఒసాకా మార్గం ఒకటి. ఈ రెండు నగరాల మధ్య షింకన్ సెన్ బుల్లెట్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. తాజా బుల్లెట్ రైలును పాము కారణంగా ఆపేశారు అధికారులు. మైబారా- గిఫు-హషిమా స్టేషన్ల మధ్య నిన్న(ఏప్రిల్ 30న) సాయంత్రం 5.25 గంటలకు ఓ మీటర్ పొడవున్న పాము రైళ్లకు పవర్ సప్లై చేసే విద్యుత్ స్తంభం ఎక్కి ఓవర్ హెడ్ లైన్ కు చుట్టుకుంది. విద్యుత్ తీవ్రతకు పాము చనిపోయినప్పటికీ విద్యుత్ ప్రసరణకు అంతరాయం ఏర్పడింది. సుమారు 2 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రైల్వే లైను నుంచి పామును తొలగించి సుమారు రాత్రి 7 గంటల సమయంలో విద్యుత్ ను పునరుద్దరించారు అధికారులు.
విద్యుత్ అంతరాయంతో బుల్లెట్ రైలు ఆగడం తొలిసారి
జపాన్ లో ప్రతి ఏటా గోల్డెన్ వీక్ సిరీస్ పేరుతో దేశ వ్యాప్తంగా సెలవులు ఇస్తారు. బుధవారం నుంచే ఈ సెలవులు ప్రారంభం అయ్యాయి. నగరాల్లో ఉండే ప్రజలు ఈ సెలవుల కారణంగా సొంత ఊళ్లకు వెళ్తున్నారు. పాము కారణంగా ఆ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగడంతో ప్రయాణీకులు తీవ్ర అవస్థలు పడ్డారు. “నేను షింకన్‌సెన్ రైల్లో నెలకు చాలాసార్లు ప్రయాణిస్తాను. కానీ, ఏనాడు విద్యుత్తు అంతరాయం కారణంగా రైళ్లు ఆగిపోవడం చూడలేదు. తొలిసారి ఇలా జరిగింది” అని ఓ ప్రయాణీకుడు వెల్లడించారు.
రోజుకు 4 లక్షలకు పైగా ప్రయాణం
టోక్యో- నగోయా- ఒసాకాలను కలిపే ఈ మార్గంలో రోజుకు సగటున 430,000 మంది ప్రయాణీకులు రాకపోకలు కొనసాగిస్తారు. ఈ మార్గంలో రోజూ 370 కి పైగా రైళ్లు నడుస్తాయి. ఈ మార్గంలోని రైళ్లు గంటకు 285 కి.మీ వేగంతో ప్రయాణిస్తాయి. ఒక్కో బుల్లెట్ రైలు జపాన్ రాజధాని నుండి ఒసాకాకు రెండున్నర గంటల కంటే తక్కువ సమయంలో చేరుకుంటుంది.
1964లో తొలి హైస్పీడ్ రైలు అందుబాటులోకి
1964 టోక్యో ఒలింపిక్స్‌కు ముందు జపాన్ లో మొట్టమొదటి హై-స్పీడ్ రైలు టోకైడో షింకన్ సెన్ ప్రారంభం అయ్యింది. అప్పటి నుంచి 7 బిలియన్లకు పైగా ప్రయాణీకు రాకపోకలు కొనసాగించారు. ఈ రైలు అత్యంత సేఫ్టీ రైలుగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ రైలు ఇప్పటి వరకు ఒక్క ప్రమాదానికి కూడా గురి కాలేదు. షెడ్యూల్ చేసిన సమయానికి కచ్చింతగా రాకపోకలు కొనసాగిస్తుంది.
ఇక పాముల కారణంగా జపాన్ లో గతంలోనూ కొన్నిసార్లు రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు కలిగాయి. గత ఏడాది ఏప్రిల్‌లో నగోయా నుంచి టోక్యోకు వెళ్లే బోగీలో ఓ పాము కనిపించడంతో ప్రయాణీకులు భయాందోళనకు గురయ్యారు. ఫలితంగా ఈ రైలును నిలిపివేశారు. 2009లోనూ టోక్యో- ఫుకుషిమా మధ్య ఓ పాము విద్యుత్ వైర్ల మీదికి ఎక్కడంతో రైళ్లకు అంతరాయం కలిగింది.
Read Also: 4 రంగుల్లో ఇండియన్ పాస్ పోర్టులు, ఇది ఉంటే వీసా లేకుండానే విదేశాలకు వెళ్లొచ్చు!