91 Year Old Woman Running Record| వయసు అనేది కేవలం శరీరానికే తప్ప మనసుకు సంబంధం లేదని నిరూపించే అరుదైన వ్యక్తులు ప్రపంచంలో కొందరు ఉంటారు. వృద్ధాప్యంలో కూడా అసాధారణ సాహసాలు చేసి, రికార్డులు సృష్టించి అందరినీ షాకిస్తుంటారు. ఈ జాబితాలో ఇటలీకి చెందిన 91 ఏళ్ల బామ్మ ఉంది. ఆమె ఇటీవల ఒక పరుగుల పోటీలో పాల్గొని మెరుపు వేగంతో రన్నింగ్ చేసింది. ఒక నిమిషం లోపే రేసు ముగించి.. అందరూ నోరెళ్ల బెట్టే విధంగా చేసింది. ఆ వండర్ గ్రాండ్ వుమెన్ పేరు ఎమ్మా మరియా మజ్జెంగా
ఈ బామ్మ 90 ఏళ్లు పైబడిన వారి కోసం జరిగిన 200 మీటర్ల రన్నింగ్ రేసులో కేవలం 51.47 సెకన్లలో పరుగును పూర్తి చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ వయసులో చాలామంది నడవడానికే మరొకరి మీద ఆధారపడుతూ ఉంటారు. కానీ ఎమ్మా మాత్రం యువకులను తలపించే వేగంతో, ఉత్సాహంతో, ఆయాసం లేకుండా లక్ష్యాన్ని చేరుకుంది. ఈ చురుకుదనం శాస్త్రవేత్తలను కూడా ఆకర్షించింది. అందుకే ఆమె ఆరోగ్య రహస్యాన్ని తెలుసుకునేందుకు పరీక్షలు నిర్వహించారు.
ఆ పరీక్షల్లో రెండు ప్రధాన అంశాల తెలిశాయి. ఎమ్మా ఆరోగ్య రహస్యం వాటిపైనే ఆధారపడి ఉంది. మొదటిది, ఆమె కార్డియోస్పిరేటరీ ఫిట్‌నెస్. ఆమె గుండె, ఊపిరితిత్తులు రక్తానికి ఆక్సిజన్‌ను సరఫరా చేసే సామర్థ్యం 40-50 ఏళ్ల ఆరోగ్యవంతమైన మహిళలతో సమానంగా ఉంది. రెండవది, ఆమె కండరాలు. ఇవి తక్కువ శక్తిని వినియోగించి, ఎక్కువ సమయం అలసిపోకుండా పనిచేస్తున్నాయి. ఆమె కండరాల్లో వేగవంతమైన సస్పెన్షన్ ఉన్న ఫైబర్ కణజాలలు అధికంగా ఉండటం వల్ల శక్తివంతమైన కదలికలు సాధ్యమవుతున్నాయి. ఈ లక్షణాలే ఆమెను రికార్డు సృష్టించేలా చేశాయని ఇటలీ సైంటిస్ట్.. డాక్టర్ మార్టా కొలోసియో వివరించారు.
ఈ అసాధారణ శారీరక సామర్థ్యం ఎలా సాధ్యమైంది? ఎమ్మా దశాబ్దాలుగా క్రమం తప్పకుండా కష్టపడి వ్యాయామం చేసింది. 1933లో జన్మించిన ఆమె విశ్వవిద్యాలయంలోనే ఫిట్‌నెస్ ప్రయాణాన్ని ప్రారంభించి, 100, 200, 400, 800 మీటర్ల రేసుల్లో పాల్గొంది. జాతీయ ఛాంపియన్‌షిప్‌లలో నాలుగో స్థానం సాధించింది. అయితే వివాహం చేసుకొని ఆ తరువాత పిల్లల కలిగాక ఆమె రెండు దశాబ్దాలు ఫిట్‌నెస్‌కు దూరమైంది. 1986లో.. అంటే 50 ఏళ్ల వయసులో, మళ్లీ రన్నింగ్ రేసుల్లోకి ప్రవేశించి, తన పాత సహచరులతో పోటీపడింది. రన్నింగ్ రేసులో పాల్గొనం వల్ల తనకు సంతృప్తి, ఉత్సాహం కలుగుతుందని ఎమ్మా తెలిపారు.
Also Read: ఇంటి పని చేసే ఉద్యోగం.. జీతం రూ.83 లక్షలు.. ఎగబడుతున్న జనం
ఎమ్మా ఐదు ప్రపంచ రికార్డులు, తొమ్మిది యూరోపియన్ రికార్డులు, మాస్టర్ స్ప్రింటింగ్‌లో 28 ఉత్తమ ఇటాలియన్ ప్రదర్శనలతో అవార్డులు గెలుచుకుంది. ఈ 91 ఏళ్ల బామ్మ యువతరానికి స్ఫూర్తిదాయకం, వయసు అడ్డంకి కాదని నిరూపించే ఒక సజీవ ఉదాహరణ.