J&K Vande Bharat Express: దేశ రాజధాని న్యూఢిల్లీతో నేరుగా జమ్మూకాశ్మీర్ కు కనెక్టివిటీని పెంచేందుకు కేంద్రం ప్రభుత్వం త్వరలో వందేభారత్ రైళ్లను ప్రారంభించబోతున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే కాశ్మీర్ లోయలో తొలిసారి వందేభారత్ రైలు పరుగులు తీయనుంది. జమ్మూకాశ్మీర్ వాతావరణాన్ని తట్టుకునేలా ఈ రైలులో ప్రత్యేక ఫీచర్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. సున్నా డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న కాశ్మీర్ లోయలోనూ రైళ్లు ఎలాంటి అవాంతరాలు లేకుండా పని చేసేలా రూపొందించారు.
జమ్మూకాశ్మీర్ కోసం స్పెషల్ వందేభారత్ రైళ్లు
న్యూఢిల్లీ, జమ్మూకాశ్మీర్ నడుమ సేవలు అందించే వందేభారత్ రైళ్లను గత వందేభారత్ రైళ్లతో పోల్చితే ప్రత్యేకంగా రూపొందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాశ్మీర్ ప్రయాణం కోసం ప్రస్తుతం ఉన్న చైర్ కార్ వేరియంట్ వందే భారత్ రేక్‌ల డిజైన్ ను మార్చుతున్నట్లు వెల్లడించారు. ప్లంబింగ్, వాటర్ ట్యాంకుల కోసం ప్రత్యేక హీటర్లు ఏర్పాటు చేశారు. డ్రైవర్ ఫ్రంట్ లుక్ అవుట్ గ్లాస్ కోసం ఎంబెడెడ్ హీటింగ్ ఎలిమెంట్ సహా అధునాతన భద్రతా ఫీచర్లను తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ ఎలిమెంట్స్ గ్లాస్ ను సబ్ జీరో టెంపరేచర్‌లో డీఫ్రాస్ట్ గా ఉంచుతాయి. ఈ టెక్నాలజీని తొలిసారి అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు.
జమ్మూకాశ్మీర్ లో అందుబాటులోకి రానున్న వందేభారత్ రైళ్ల బ్రేక్ సిస్టమ్ ను ఎయిర్ డ్రైయర్ మెకానిజంతో రూపొందించారు. బ్రేకులు సరిగ్గా పని చేసేందుకు హీటర్లను అమర్చారు. రైళ్లలోని వాటర్ ట్యాంకులలోని నీళ్లు గడ్డకట్టకుండా ఉండేందుకు సిలికాన్ హీటింగ్ ప్యాడ్లను ఏర్పాటు చేశారు. ఒక వాటర్ ట్యాంక్ కు 1800 వాట్ల హీటర్లను అమర్చారు. అంతేకాదు, రైళ్లలోని వాటర్ పంపింగ్ సిస్టమ్లో హీటింగ్ కేబుల్స్, థర్మల్ ఇన్సులేషన్లు ఏర్పాటు చేశారు. ఈ వందేభారత్ ఎయిర్ కండీషన్డ్ రైళ్లలో 24 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ ఉండేలా తగు ఏర్పాటు చేశారు.
చివరి దశకు చేరుకున్న రైల్వే ట్రాక్ నిర్మాణం
ప్రస్తుతం ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్ కాశ్మీర్ లోని అన్ని ప్రధాన ఏరియాల మధ్య రైల్వే కనెక్టివిటీని ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటి వరకు రైలు జమ్మూలోని కత్రా వరకు మాత్రమే రైల్వే నెట్ వర్క్ ఉంది. ఈ నేపథ్యంలో కాశ్మీర్ లోని అన్ని ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 37,012 కోట్లను కేటాయించింది. ఈ నిధులతో జమ్మూ- శ్రీనగర్ మధ్య కనెక్టివిటీని ఏర్పాటు చేస్తున్నారు. బారాముల్లా, శ్రీనగర్, ఖాజిగుండ్, బనిహాల్, సంగల్దాన్ మధ్య రైల్వే కనెక్టివిటీ ఇప్పటికే ఉంది. దీనిని ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా లైనుకు కలపనున్నారు. ఈ రైలు సర్వీస్ కోసం చీనాబ్ నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెనను ఏర్పాటు చేశారు. చీనాబ్ రైల్వే బ్రిడ్జికి అనుసంధానంగా ఏర్పాటు చేస్తున్న పలు చిన్న సొరంగాల నిర్మాణాలు కూడా పూర్తి కావస్తున్నాయి. త్వరలోనే రైల్వే లైన్ నిర్మాణం పూర్తికానుంది. ఆ వెంటనే ప్రధాని మోడీ ఢిల్లీ నుంచి జమ్మూకాశ్మీర్ కు ప్రత్యేక రైలును ప్రారంభించనున్నారు.
Read Also: ఏ సందర్భాల్లో ఫుల్ అమౌంట్ రీఫండ్ పొందవచ్చు? రైల్వే రూల్స్ ఏం చెప్తున్నాయంటే?