Indian Railway Signboards: నిత్యం చాలా మంది రైల్వే ప్రయాణాలు చేస్తుంటారు. జర్నీ చేస్తున్న సమయంలో కోచ్ ల మీద పలు కోడ్స్ కనిపిస్తాయి. ట్రాక్ వెంట రైల్వేకు సంబంధించి అనేక రకాల సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తారు. వాటి గురించి చాలా మందికి తెలియదు. వాటిని ఎందుకు పెడతారు? వాటి వల్ల కలిగే లాభాలు ఏంటి? విషయంలో అవగాహన ఉండదు. ఈ స్టోరీలో రైల్వే ట్రాక్స్ వెంట కనిపించే రెండు రకాల సైన్ బోర్డుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
W/L, W/B సైన్ బోర్డులు ఎందుకు పెడతారు?
W/L, W/B సైన్ బోర్డులు రైల్వే ట్రాక్ పక్కనే పసుపు రంగులో కనిపిస్తాయి. బోర్డు మీద W/L లేదంటే C/Fa అని, దానితో పాటు W/B అని నల్ల రంగు అక్షరాలతో రాయబడి ఉంటుంది. ఈ బోర్డులు లోకో పైలట్లను అలర్డ్ చేయడం కోసం పెడతారు. ఈ బోర్డులు రైలు విజిల్ కు సంబంధించినవి.
W/L అంటే ఏంటి? దాని ఉపయోగం ఏంటి?
W/L సైన్ బోర్డులో ‘W’ అనే అక్షరం విజిల్ ను సూచిస్తుంది. ‘L’ అనే అక్షరం లెవల్ క్రాసింగ్ ను సూచిస్తుంది. సో, కొద్ది దూరంలో లెవల్ క్రాసింగ్ ఉంది అని లోకో పైలెట్ అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ బోర్డును చూడగానూ లోకో పైలెట్ రైలు విజిల్ ఇస్తాడు. లెవల్ క్రాసింగ్ దగ్గర ఎవరూ పట్టాల దగ్గర ఉండకూడదు, రైలు వస్తుందని చెప్పడానికి ఈ విజిల్ వేస్తారు. లోకో పైలట్ ‘W/L’ సైన్ బోర్డును చూసినప్పుడల్లా లెవల్ క్రాసింగ్ దగ్గర విజిల్ వేయాలని అర్థం. కొన్నిసార్లు W/L సైన్ బోర్డులు హిందీలో కూడా ఉంటాయి. వాటిపై C/Fa అని రాసి ఉంటుంది. C/Fa అంటే సాధారణంగా సీటీ బజావో/ఫటక్ అని అర్థం. ఇలాంటి సైన్ బోర్డులు లెవల్ క్రాసింగ్ కు సుమారు 250 మీటర్ల దూరంలో ఉంటాయి. రైలు హారన్ మోగినప్పుడు, లెవల్ క్రాసింగ్ దగ్గర ట్రాక్‌లపై ఉన్న వ్యక్తులు అప్రమత్తం అయి ట్రాక్‌ల నుంచి దూరంగా వెళ్లిపోతారు.
W/B అంటే ఏంటి? దాని ఉపయోగం ఏంటి?
రైల్వే ట్రాక్ ల వెంట కనిపించే మరో సాధారణ సైన్ బోర్డు W/B. ఇక్కడ కూడా W/Bలో W అనేది సాధారణంగా విజిల్ ను సూచిస్తుంది. B అనే అక్షరం బ్రిడ్జిని సూచిస్తుంది. లోకో పైలట్ ఇలాంటి సైన్ బోర్డును చూసినప్పుడు, ముందు ఓ బ్రిడ్జి ఉందని తెలుసుకుంటాడు. వంతెనను దాటుతున్నప్పుడు హారన్ ఇస్తాడు. రైలు వెళ్లే వరకు ఎవరూ బ్రిడ్జి కింద ఉండకూడదని చెప్పడమే ఈ విజిల్ ముఖ్య ఉద్దేశం.
ప్రజలను అప్రమత్తం చేయడం కోసం..
W/L, W/B సైన్ బోర్డుల ముఖ్య ఉద్దేశం రైలు వస్తున్న సమయంలో ప్రజలను అప్రమత్తం చేయడం. రైలు విజిల్ వేయగానే దూరంగా వెళ్లాలని చెప్పడమే. రైల్వే భద్రతలో భాగంగా వీటిని ఏర్పాటు చేస్తారు. లోకో పైలెట్ కూడా ముందు ట్రాక్ ఎలా ఉందో అర్థం చేసుకుని రైలును నడుపుతారు.
Read Also: ఈ రైల్వే స్టేషన్ నుంచి దేశంలో ఎక్కడికైనా వెళ్లొచ్చు, ఇంతకీ అది ఎక్కడుందో తెలుసా?