Singer Pravasthi: బుల్లితెరపై కనిపించే రియాలిటీ షోల గురించి ప్రేక్షకులకు తెలియని ఎన్నో నిజాలు ఉంటాయి. ఆ షోలు ఒక గంట, గంటన్నర పాటు అందరినీ ఎంటర్‌టైన్ చేస్తాయన్న విషయం మాత్రమే చాలామందికి తెలుసు. కానీ ఆ గంట, గంటన్నర ఎపిసోడ్ షూటింగ్ వెనుక ఎంత కథ ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. అలా ‘పాడుతా తీయగా’ లాంటి సెన్సేషనల్ సింగింగ్ షో వల్ల ఇండస్ట్రీకి ఎంతోమంది కొత్త సింగర్స్ పరిచయమయ్యారు. అలాంటి షోపై తీవ్రమైన ఆరోపణలు చేసింది ప్రవస్తి ఆరాధ్య అనే ఓ సింగర్. దీంతో ఒక్కసారి మ్యూజిక్ ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. దానిపై సీనియర్ సింగర్ ఎస్పీ శైలజ భర్త శుభలేఖ సుధాకర్ సైతం స్పందించారు.
స్పందించిన సుధాకర్
‘పాడుతా తీయగా’ కాంట్రవర్సీపై ఇప్పటివరకు ఆ షోలోని జడ్జిలు, దాని నిర్మాణ సంస్థ అయిన జ్ఞాపిక ఎంటర్‌టైన్మెంట్స్‌తో పాటు పలు ఇతర సింగర్స్ కూడా స్పందించారు. చాలావరకు సింగర్స్ సపోర్ట్ అంతా షోకే వెళ్తోంది. చాలామంది ప్రవస్తి ఆరాధ్య ఆరోపణలను తోచిపుచ్చుతూ కామెంట్స్ చేస్తున్నారు. సునీత లాంటి సీనియర్ సింగర్, ఎమ్ఎమ్ కీరవాణి లాంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌పై బాడీ షేమింగ్ ఆరోపణలు ఎలా చేస్తావని తనపై ఫైర్ అవుతున్నారు. ఇక ఈ విషయంపై ప్రముఖ సింగర్ ఎస్పీ శైలజ భర్త శుభలేఖ సుధాకర్ కూడా స్పందించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. ప్రవస్తి కాంట్రవర్సీపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
నిస్వార్థంగా మొదలుపెట్టారు
ఏ పని చేసినా దానిని స్వార్థంగా చేయవచ్చు, నిస్వార్థంగా చేయవచ్చు అని చెప్పుకొచ్చారు శుభలేఖ సుధాకర్ (Subhalekha Sudhakar). ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. పాడుతా తీయగా షోను నిస్వార్థంగా చేశారని అన్నారు. ‘‘కొత్త టాలెంట్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేయాలి అన్నదే ఎస్పీబీ తపన. ఇండస్ట్రీలోకి కొత్తవాళ్లు రావాలి, వాళ్లు కూడా ఎదగాలి అనే ఆలోచనతోనే ఆ షోను మొదలుపెట్టారు. అలా ఆయన అనుకున్నట్టుగానే చాలామంది సింగర్స్‌ను ప్రపంచానికి పరిచయం చేశారు. బాలు ఉన్నప్పుడు సీజన్స్‌లో కంటెస్టెంట్స్‌గా వచ్చిన వారు ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కడో ఒకచోట్ నిలదొక్కుకున్నారు. దానివల్ల ఆయన అనుకుంది సాధించారు’’ అని గుర్తుచేసుకున్నారు సుధాకర్.
Also Read: వారి వాట్సాప్ చాట్ లీక్ చేసిన ప్రవస్తి.. అంటే తను చెప్పిందంతా నిజమేనా.?
హాని చేస్తున్నారు
‘‘ఒక వ్యక్తికి సహాయం చేసినప్పుడు నిస్వార్థంగా చేయాలి. ఇప్పుడు నేను సహాయం చేస్తున్నాను, భవిష్యత్తులో నాకు సహాయం కావాలంటే నేను తిరిగి అడగొచ్చు అనే ఉద్దేశ్యంతో మాత్రం చేయకూడదు. అలా అయితే అది వ్యాపారం అవుతుంది. ఆ వ్యాపారానికి మీరు పెట్టుబడి పెడుతున్నట్టు అవుతుంది. వీలుంటే ఎవరికైనా సహాయం చేయండి. హాని కాదు. ప్రస్తుతం ప్రపంచమంతా రివర్స్ అయిపోయింది. కేవలం హాని మాత్రమే చేస్తున్నారు’’ అని షాకింగ్ కామెంట్స్ చేశారు శుభలేఖ సుధాకర్. మొత్తానికి ఆయన ‘పాడుతా తీయగా’ కాంట్రవర్సీపై స్పందించారు కానీ అందులో ఎవరికి సపోర్ట్ చేశారు, ఎవరిని విమర్శించారు అనే విషయం మాత్రం ప్రేక్షకులకు అర్థం కావడం లేదు.