Flight With No Pilot| 200 మందికి పైగా ప్రయాణికులు ఉన్న విమానం గాల్లో ఎగురుతోంది. కానీ విమానాన్ని గమ్యస్థానానికి తీసుకెళ్లే పైలట్ మాత్రం అందులో లేడు! ఈ భయంకరమైన సంఘటన స్పెయిన్‌కి వెళ్తున్న లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానంలో చోటుచేసుకుంది. ఈ ఘటన 2024 ఫిబ్రవరి 17న జరిగింది. తాజాగా జర్మనీ వార్తా సంస్థ డీపీఏ దీన్ని వెలుగులోకి తెచ్చింది.
ఆ రోజు ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి స్పెయిన్‌లోని సెవిల్లెకు వెళ్లేందుకు ఎయిర్‌బస్ ఏ321 విమానం బయలుదేరింది. ఈ విమానంలో 199 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. విమానం ఎగిరిన కొద్దిసేపటికే ప్రధాన పైలట్ రెస్ట్‌రూమ్‌కి వెళ్లడంతో కాక్‌పిట్‌లో కో పైలట్ ఒక్కరే ఉన్నారు. కానీ అకస్మాత్తుగా కో పైలట్ అనారోగ్యంతో స్పృహతప్పి కిందపడిపోయారు.
అనూహ్యంగా జరిగిన ఈ ఘటనతో.. విమానం దాదాపు 10 నిమిషాల పాటు పూర్తిగా కోపైలట్ లేకుండా ఉంది. విమానం ఆటోపైలట్ పై ఆధారపడి గాల్లో ఎగురుతోంది. కోపైలట్ అపస్మారక స్థితిలో ఉన్నప్పటికీ, అతని చేతుల నుంచి కొన్ని నియంత్రణలు అనుకోకుండా ఆపరేట్ కావడంతో వాయిస్ రికార్డర్‌లో గందరగోళ శబ్దాలు రికార్డ్ అయ్యాయి. ఈ ఘటన గురించి విచారణ పూర్తి చేసిన స్పానిష్ సివిల్ ఏవియేషన్ ఆక్సిడెంట్ అండ్ ఇన్‌సిడెంట్ ఇన్‌వెస్టిగేషన్ కమిషన్ (సీఐఏఐఏసీ) ఇటీవలే రిపోర్ట్ సమర్పించింది.
ఇదే సమయంలో రెస్ట్‌రూమ్ నుంచి వచ్చిన కెప్టెన్.. కాక్‌పిట్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. తలుపు ఓపెన్ చేయడానికి అవసరమైన కోడ్‌ను ఎంటర్ చేసినా స్పందన లేదు. దీంతో అతను అయిదు సార్లు ఇదే ప్రయత్నం చేశాడు. ఫలితం లేకపోవడంతో, ఆన్‌బోర్డ్ టెలిఫోన్ ద్వారా కూడా క్రూ సభ్యులు కోపైలట్‌ను సంప్రదించే ప్రయత్నం చేశారు. కానీ అతడి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. చివరికి కెప్టెన్ అత్యవసర డోర్ ఓపెనింగ్ కోడ్ ఉపయోగించారు.
Also Read: పెళ్లిపీటలపైనే చనిపోయిన వరుడు.. తాళికట్టగానే విషాదం
అయితే ఈ సమయంలో అదృష్టవశాత్తూ కోపైలట్ స్పృహలోకి వచ్చి చాలా కష్టపడి తలుపును లోపల నుంచి తెరిచారు. ఈ సంఘటన తర్వాత విమానాన్ని అత్యవసరంగా మాడ్రిడ్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ చేసి.. కోపైలట్‌ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ తమ ఫ్లైట్ సేఫ్టీ విభాగం ద్వారా ఈ సంఘటనపై విచారణ జరిపినప్పటికీ, దాని ఫలితాలను మాత్రం బయటపెట్టలేదని డీపీఏ పేర్కొంది.
ఈ ఘటన విమాన ప్రయాణం భద్రతపై అనుమానాలు రేపింది. పైలట్ లేకుండా గాల్లో ప్రయాణించిన విమానం సురక్షితంగా ల్యాండ్ కావడం నిజంగా అద్భుతమే. అయితే భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు మళ్లీ ఎదురుకాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై విమానయాన సంస్థలు మరింత సీరియస్‌గా ఆలోచించాల్సిన అవసరం ఉంది.