Rule for Ola Uber Rapido: ఈ రోజుల్లో చాలా మంది ప్రయాణం కోసం క్యాబ్స్ మీదే ఎక్కువగా ఆధార పడుతున్నారు. కొంత మంది సొంత వాహనాలు ఉన్నప్పటికీ క్యాబ్స్ బుక్ చేసుకుని మరీ జర్నీ చేస్తున్నారు. బస్సులు సమయానికి రాకపోవడం, సొంత వాహనాల్లో వెళ్దామంటే ట్రాఫిక్ సమస్యలు. వీటన్నింటి కన్నా క్యాబ్స్ బుక్ చేసుకోవడమే మేలు అని భావిస్తున్నారు. ధరలు కూడా రీజనబుల్ గా ఉండటంతో ఎక్కువగా వీటినే ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓలా, ఉబర్, రాపిడో లాంటి క్యాబ్స్ కు మంచి గిరాకీ లభిస్తోంది. అయితే, కొన్నిసార్లు కస్టమర్లకు సరిగా సేవలు అందించక ఇబ్బంది పెడుతున్నాయి అగ్రిగేట్ సంస్థలు. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర ప్రభుత్వం సరికొత్త క్యాబ్ పాలసీని తీసుకొచ్చింది. మే 1 నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తోంది.
కొత్త అగ్రిగేటర్ క్యాబ్స్ పాలసీ ఏం చెప్తోంది?
మహారాష్ట్ర సర్కారు కొత్త అగ్రిగేటర్ క్యాబ్స్ పాలసీ 2025ను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త పాలసీ ఏం చెప్తుందంటే.. అప్పుడప్పుడు కస్టమర్లు తమ అవసరాల రీత్యా బుక్ చేసుకున్న రైడ్ ను క్యాన్సిల్ చేసుకుంటారు. ఈ సమయంలో ఆయా క్యాబ్ అగ్రిగేట్ సంస్థలు క్యాన్సిలేషన్ ఛార్జ్ ను కస్టమర్ల నుంచి వసూలు చేస్తుంటాయి. అయితే, అదే రైడ్ ను సదరు క్యాబ్ డ్రైవర్ క్యాన్సిల్ చేస్తే మాత్రం ఎలాంటి ఛార్జ్ ఉండదు. పైగా కస్టమర్ల విలువైన సమయం వృథా అవుతుంది. మరో క్యాబ్ బుక్ చేసుకుని వెళ్లడానికి సమయం పడుతుంది. క్యాబ్స్ సంస్థల నుంచి ఎదురవుతున్న ఈ సమస్యను తొలగించేందుకు మహారాష్ట్ర సర్కారు ఈ కొత్త పాలసీని పరిచయం చేసింది.
రైడ్ క్యాన్సిల్ చేస్తే ఫైన్ కట్టాల్సిందే!
ఓలా, ఉబర్, రాపిడో సంస్థలకు కొత్త రూల్స్ పెట్టింది. ఇకపై క్యాబ్ డ్రైవర్లు కన్ఫర్మ్ అయిన రైడ్ లను క్యాన్సిల్ చేస్తే ఫైన్ కట్టాలని తేల్చి చెప్పింది. కస్టమర్ల విలువైన సమయాన్ని వృథా చేసినందుకు గాను, తగిన పరిహారం సదరు ప్రయాణీకుడికి అందించాలని ఈ పాలసీ తేల్చి చెప్తోంది. ఈ రూల్ కారణంగా క్యాబ్ డ్రైవర్లు అకారణంగా రైడ్ లను క్యాన్సిల్ చేయకుండా ఉంటారని ఫడ్నవీస్ సర్కారు వెల్లడించింది. అదే సమయంలో ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందుతాయని చెప్తోంది. రిటైర్డ్ IAS అధికారి సుధీర్ కుమార్ శ్రీవాస్తవ నేతృత్వంలోని కమిటీ ద్వారా ఈ కొత్త పాలసీకి రూపకల్పన చేసింది మహారాష్ట్ర సర్కారు. ఈ విధానం ప్రయాణీకుల భద్రత, డ్రైవర్ల జవాబుదారీతనం, ఛార్జీల పారదర్శకతను పెంచే అవకాశం ఉందంటున్నది. అటు మహిళా ప్రయాణీకులకు భద్రత పెంచేలా రియల్-టైమ్ GPS ట్రాకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని ఆయా సంస్థలను ఆదేశించింది. కనీసం 80% మంది ఛార్జీ ఓకే అనే రేటింగ్ ఇచ్చేలా ఆయా సంస్థల క్యాబ్స్ పని చేయాలని ఆదేశించింది. క్యాబ్ అగ్రిగేటర్లు మహారాష్ట్రలో కార్యాలయాలను ఏర్పాటు చేయాలి సూచించింది. ఇక ఈ నిర్ణయం ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా రావాలని ప్రయాణీకులు కోరుతున్నారు.
Read Also: ఏపీ, తెలంగాణకు వెళ్లే రైళ్లు ఇక భువనేశ్వర్ కొత్త రైల్వే స్టేషన్ నుంచి పరుగు.. ఎన్ని రైళ్లంటే?