Vande Bharat Train Attacked with Stones: మహారాష్ట్రలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు ఓ యువకుడు వందే భారత్ ఎక్స్ ప్రెస్ పై రాళ్లు విసిరాడు. ఈ ఘటనతో రైల్లోని ప్రయాణీకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఇన్సిడెంట్ మార్చి 13న మహారాష్ట్రలోని ఠాకుర్లి–కళ్యాణ్ రైల్వే స్టేషన్ల మధ్య జరిగింది.
రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. ముంబైలోని CSMT–సాయినగర్ షిర్డి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రయాణిస్తున్న సమయంలో ఓ గుర్తు తెలియని యువకుడు రైలుపై రాళ్లు విసిరాడు. రాళ్లు బలంగా తాకడంతో C-1, C-3, C-4, C-7 కోచ్‌ల కిటికీ అద్దాలు పగిలిపోయాయి. ఘటనతో రైల్లో ప్రయాణిస్తున్న ప్యాసింజర్స్ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే, అదృష్టవశాత్తూ ఈఘటనలో ఎవరికి పెద్ద గాయాలు కాలేదని రైల్వే అధికారులు తెలిపారు.
వందేభారత్ పై రాళ్ల దాడికి సంబంధించి సమాచారం అందుకున్న వెంటనే రైల్వే రక్షణ దళం (RPF) అప్రమత్తమైంది. కళ్యాణ్ RPF, ఇతర దర్యాప్తు బృందాలు కలిసి పత్రిపుల్ ప్రాంతంలో సోదాలు చేపట్టాయి. రైల్వే పరిసరాల్లో అనుమానాస్పదంగా కనిపించిన ఒక యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. రైలు మీద రాళ్లు వేసింది తనేనని ఒప్పుకున్నాడు. అతడిని పూణేకు చెందిన 23 ఏళ్ల సన్నీ కాంబ్లేగా గుర్తించారు. గంజాయి మత్తులో ఉండగా ప్రయాణీకులను భయపెట్టాలనే ఉద్దేశ్యంతో రైల్వే పట్టాల దగ్గరకు వెళ్లి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లు విసిరినట్లు అతను ఒప్పుకున్నాడు. అంతేకాదు, తానేదో గొప్ప పని చేస్తున్నట్లు భావించి, ఆ సంఘటనను తన మొబైల్ ఫోన్ లో వీడియో తీశాడు. పోలీసులు ఆ వీడియోను కూడా స్వాధీనం చేసుకున్నారు.
Read Also: హైదరాబాదీయులకు గుడ్ న్యూస్… ఆ స్పెషల్ రైళ్లు రెగ్యులర్ సర్వీసులు అందిస్తాయ్!
అటు ఈ ఘటనకు సంబంధించి కళ్యాణ్ RPF పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. రైల్వే చట్టంలోని సెక్షన్ 153, 147 కింద నిందితుడిపై CR నంబర్ 1029/2026 నమోదు చేశారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరిచి MCR కస్టడీకి పంపించారు. ప్రస్తుతం సన్నీ కాంబ్లేని అధర్వాడి జైలుకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన సోషల్ మీడియా లో ఫేమస్ అయ్యేందుకు కొంతమంది యువకులు ఎంతటి ప్రమాదకర చర్యలకు పాల్పడుతున్నారో మరోసారి స్పష్టంగా చూపించింది. రైల్వే అధికారులు ఇలాంటి ఘటనలపై తీవ్రంగా స్పందించారు. రైళ్లపై రాళ్లు విసురుతూ పోలీసులకు దొరికితే, రైల్వే కేసులు నమోదైతే జీవితం నాశనం అవుతుందని హెచ్చరించారు. ఎవరూ రైళ్ల విషయంలో తమాషాలు చేయకూడదని హెచ్చరించారు.
Read Also: ఉగాది ట్రావెలర్స్ కు బ్యాడ్ న్యూస్.. నో రైల్వే టిక్కెట్ రిజర్వేషన్స్!