Mehandipur Balaji Temple: దేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. నిత్యం భక్తులు దర్శించుకుని దైవానుగ్రహం పొందుతారు. కాసేపు ఆలయ ప్రాంగణంలో కూర్చొని మానసిక ప్రశాంతతను పొందుతారు. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆలయం పూర్తి భిన్నంగా ఉంటుంది. ఆలయం పేరు నుంచి మొదలుకొని అక్కడికి వచ్చే భక్తుల వరకూ అన్నీ వింతగానే ఉంటాయి. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉందంటే..
బాలాజీ పేరుతో హనుమాన్ దర్శనం
దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆలయం శ్రీ మెహందీపూర్ బాలాజీ ఆలయం. రాజస్థాన్ లోని దౌసా జిల్లాలో ఈ ఆలయం ఉంటుంది. నిజానికి బాలాజీ అనగానే వేంకటేశ్వర స్వామి అనుకుంటాం. కానీ, ఈ ఆలయంలో హనుమంతుడు కొలువై ఉన్నాడు. ఈ హనుమాన్ రూపం కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇతర ఆలయాల మాదిరిగా ప్రశాంత రూపంలో కాకుండా పెద్ద నేత్రాలతో ఉగ్ర రూపంతో కనిపిస్తాడు. ఏ ఇతర ప్రాంతంలోని దేవాలయంలో లేని భయానక వాతావరణం ఈ ఆలయంలో కనిపిస్తుంది.
ఎందుకు ఈ ఆలయం ప్రత్యేకమైనది?
నిత్యం ఈ ఆలయ ప్రాంగణం అరుపులు, కేకలు, పూనకాలతో ఊగిపోయే భక్తులతోనే కనిపిస్తుంది. ఇందుకు కారణం.. ఇక్కడి ఆలయంలోని హనుమంతుడు భూత, ప్రేతాత్మలను తరిమికొడతాడని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలో, దుష్టశక్తులు ఆవహించిన భక్తులు ఇక్కడికి వచ్చి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుంటారు. ఆయన పెద్ద కళ్లవైపు చూడగానే పట్టిన దయ్యం పారిపోతుందని నమ్ముతారు. అందుకే, సాధారణ భక్తులు ఈ ఆలయానికి వెళ్లేందుకు భయపడుతారు. దుష్టశక్తులు ఆవహించిన భక్తుల వింత ప్రవర్తన చూసి జడుసుకుంటారు. ఎక్కడ ఆ భూతాలు తమను పట్టుకుంటాయోననే భయంతో చుట్టుపక్కలకు కూడా రావడానికి ఇష్టపడరు. ఈ ఆలయ ప్రాంగణం అంతా ఓ రకమైన భయానక పరిస్థితితో నిండి ఉంటుంది.
హనుమంతుడి దర్శనంతో భూతాలు పరార్
భూత శక్తి ఆవహించిన భక్తులు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోగానే సాధారణ స్థితికి చేరుకుంటారని స్థానికులు చెప్తారు. ఈ ఆలయంలోకి కుల, మతాలతో సంబంధం లేకుండా భక్తులు తరలి వచ్చి స్వామి వారిని సేవిస్తారు. తమ మీద ఉన్న చెడు శక్తులను వదిలించుకుని వెళ్తారు. ఈ ఆలయంలో మంగళ, శనివారాల్లో దెయ్యాలను వదిలించే ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ రెండు రోజుల్లో వందలాది మంది తరలివస్తుంటారు.
Mehandipur Balaji Mandir is a Hindu temple dedicated to the Hindu deity Hanuman. The temple is dedicated to Balaji (another name for Shree Hanuman Ji). Its reputation for ritualistic healing & exorcism of evil spirits attracts many pilgrims from all over the world.#hinduacademy pic.twitter.com/4FpHYx3Nqj
— Hindu Academy (@hinduacademy) January 12, 2021
ఈ ఆలయంలోకి వచ్చే భక్తులు చేయకూడని పనులు
ఇక ఈ ఆలయంలోకి వచ్చే భక్తులు కొన్ని పద్దతులు పాటించాల్సి ఉంటుంది. ఆలయానికి వచ్చే ముందు మద్యం, మాంసం తీసుకోకూడదు. ఇక్కడ ఇచ్చే ప్రసాదాన్ని ఎవరూ ఇంటికి తీసుకెళ్లకూడదు. మొత్తం ఈ గుడి ఆవరణలోనే తినాలి. ఈ ప్రసాదాన్ని ఎవరైనా ఇంటికి తీసుకెళ్తే కీడు జరుగుతుందని నమ్ముతారు. దుష్ట శక్తులతో బాధపడే వారిని ఓ ప్రత్యేక స్థలంలో పూజ చేసిన తర్వాత ఒంటరిగా వదిలిపెడతారు. కొద్ది సేపట్లోనే వాళ్లు సాధారణ స్థితికి చేరుకుని తిరిగి వస్తారు. ఈ ఆలయంలో ఉన్న రహస్యాలను తెలుసుకునేందుకు పలు దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు గతంలో ఇక్కడ పరిశోధనలు నిర్వహించారు. కానీ, ఎలాంటి రహస్యాలు కనుగొనలేకపోయారు.
Read Also:ఈ ఊర్లో ఇంటికో మంత్రగాడు, చేతబడులే వీరి ఉపాధి.. ధైర్యం ఉంటేనే వెళ్లండి!