దేశంలోని నగర ప్రజలకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు పలు నగరాల్లో మెట్రో వ్యవస్థలు అందుబాటులోకి వస్తున్నాయి. దేశంలో తొలిసారి కోల్ కత్తాలో మెట్రో రైలు సేవలు ప్రారంభం కాగా, ప్రస్తుతం హైదరాబాద్ సహా పలు సిటీల్లో మెట్రో సేవలు అందుతున్నాయి. తాజాగా ఈ లిస్టులో మరో సిటీ చేరబోతోంది. దేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా గుర్తింపు తెచ్చుకున్న మధ్యప్రదేశ్ లో ని ఇండోర్ లో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇవాళ్టి (మే 31) నుంచి మెట్రో సేవలను ప్రారంభిస్తున్నారు. మధ్యప్రదేశ్ నగర రవాణాలో మెట్రో కీలక పాత్ర పోషించబోతోంది.
వారం రోజుల పాటు ఉచిత మెట్రో ప్రయాణం
మెట్రో రైలు ప్రారంభోత్సవం సందర్భంగా ప్రయాణీకులకు ఇండోర్ మెట్రో అదిరిపోయే ఆఫర్ ను ప్రకటించింది. ఈ ఆఫర్ల ద్వారా ప్రయాణీకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. మెట్రో ప్రారంభం అయిన తొలి వారం రోజుల పాటు ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తోంది. రెండో వారంలో టికెట్ ధరపై 75 శాతం తగ్గింపు అందిస్తోంది. మూడో వారంలో 50 శాతం తగ్గింపు అందిస్తోంది. ఆ తర్వాత మూడవ నెల వరకు 25% తగ్గింపు అందిస్తున్నట్లు తెలిపింది. ప్రారంభ దశలో అంటే 30 కి.మీ లోపు ఛార్జీ రూ. 20 నుంచి రూ. 30 వరకు ఉంటుంది. 31.32 కి.మీ కంటే ఎక్కువ దూరం ఉన్న ప్రయాణాలకు రూ. 30 నుంచి రూ. 80 వరకు ఛార్జీ ఉంటుంది. ప్రయాణీకులు మొదటి వారం ఉచిత ప్రయాణం ఎంజాయ్ చేయాలని మధ్యప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (MPMRCL) సూచించింది. ఆ తర్వాత మూడు నెలల్లో టైర్డ్ డిస్కౌంట్ ను పొందే అవకాశం ఉందని వెల్లడించింది. మెట్రో రైలు ప్రారంభంలో సూపర్ ప్రియారిటీ కారిడార్ అని పిలువబడే యెల్లో లైన్ 6 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. గాంధీ నగర్ నుంచి సూపర్ కారిడార్ 3 వరకు ఐదు కీలక స్టేషన్లను కలిగి ఉంటుంది.
ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు రైలు ప్రయాణాలు
రైళ్లు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 30 నిమిషాలకు ఒకటి నడుస్తుందని మెట్రో అధికారులు వెల్లడించారు. ఒక్కో రైలు ప్రతి దిశలో రోజూ 25 ట్రిప్పులు వేయనున్నట్లు ప్రకటించారు. ఇండోర్ మెట్రో రైలు 980 మంది ప్రయాణికుల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లు, స్టేషన్లలో లిఫ్ట్ లు, ఎస్కలేటర్లు, వికలాంగ ప్రయాణీకులకు బ్రెయిలీ ఇండికేష్స్, టచ్ టైల్స్, CCTV కెమెరాలు, అత్యవసర బటన్లు, ఇంటర్ కామ్‌లు, దృష్టి లోపం ఉన్న ప్రయాణీకులకు ఆడియో ప్రకటనలు, వీల్ చైర్ యాక్సెస్, సీటింగ్ ప్రాంతాలు, టాయిలెట్లు, తాగునీటి సౌకర్యాలను కల్పించినట్లు మెట్రో అధికారులు తెలిపారు. ఇండోర్ మెట్రో ప్రాజెక్ట్ ను సుమారు రూ. ,500 కోట్ల వ్యయంతో నిర్మించారు. ట్రాఫిక్ రద్దీ, కాలుష్యాన్ని తగ్గించడం, ప్రయాణీకుల సౌకర్యాన్ని పెంచడం లక్ష్యంగా ఈ మెట్రోను తీర్చిదిద్దారు.
Read Also: దేశాలు, ఖండాలను కలిపే వంతెనలు.. ఈ సరిహద్దులు భలే ఉంటాయ్ బాసు!