Mumbai Goa RoRo Train: కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రలోని కోలాడ్, గోవా మధ్య ప్రైవేట్ వాహనాల కోసం కొత్త రోల్-ఆన్/రోల్-ఆఫ్ (RoRo) రైలు సేవను ప్రారంభించబోతోంది. ఆగస్టు చివరిలో వినాయక చవితి పండుగకు ముందు ఈ సేవను అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రయత్నిస్తోంది. కార్లను ప్రత్యేకంగా రూపొందించిన రైలు వ్యాగన్లలో రవాణా చేయడానికి వీలు కలగనుంది. ప్రయాణీకులు కార్ల లోపలే ఉండి హాయిగా ప్రయాణం చేయవచ్చు.
కొలాడ్-మంగళూరు మధ్య RoRo సేవలు
ప్రస్తుతం కోలాడ్- మంగళూరు మధ్య KRCL RoRo సేవలను అందిస్తోంది. అయితే, ఇవి సరుకురవాణా వాహనాలను రవాణా చేస్తున్నాయి. ఈ సేవను ప్రధానంగా ట్రక్ ఆపరేటర్లు ఉపయోగిస్తున్నారు. ఇదే విధానాన్ని ప్రైవేట్ వాహనాలకు అంటే కార్లకు కూడా అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది కొంకణ్ రైల్వే. రద్దీగా ఉండే ముంబై-గోవా హైవే మీద ఇబ్బందులు పడటం ఇష్టం లేని వాహనదారులు ఈ సేవలను ఉపయోగించుకునే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. ఎలాంటి ఒత్తిడి లేని ప్రయాణం కోసం ఈ విధానం ఉపయోగపడనుంది. ముఖ్యంగా పండుగ సీజన్లలో ట్రాఫిక్ జామ్ ఏర్పడి గంటల తరబడి రోడ్ల మీదే వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. RoRo సేవ ద్వారా ఆ ఇబ్బందులకు చెక్ పడనుంది.
కోలాడ్ నుంచి గోవా వరకు RoRo సేవలు
RoRo సేవలను కోలాడ్ నుంచి గోవా వరకు అందుబాటులోకి తీసుకురావాలని కొంకణ్ రైల్వే ప్రయత్నిస్తోంది. ముంబై నుంచి కోలాడ్ స్టేషన్ వరకు దాదాపు 106 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తారు. అక్కడ వారి కార్లు ఫ్లాట్ బెడ్ వ్యాగన్లలో లోడ్ చేయబడతాయి. ఆ తర్వాత గోవాకు ప్రయాణం రైలు ద్వారా జరుగుతుంది. ఈ విధానం ప్రైవేట్ ప్రయాణాల కర్బన ఉద్గారాలను తగ్గించడంతో పాటు ఇంధన వినియోగాన్ని తగ్గిస్తుంది. రోడ్డు భద్రతను పెంచుతుంది. అంతేకాదు, ప్రయాణీకులు సుమారు 10 నుంచి 12 గంటల పాటు ప్రయాణంలో చక్కగా విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం సరుకు రవాణా ట్రక్కులకు అనుగుణంగా నిర్మాణం
ప్రస్తుత RoRo వ్యాగన్లను సరుకు రవాణా ట్రక్కుల కోసం నిర్మించారు. అంటే, ర్యాంప్ అలైన్ మెంట్లు, పెర్నెమ్, ఓల్డ్ గోవా సమీపంలో సొరంగం క్లియరెన్స్, ప్రయాణీకుల రవాణా కోసం భద్రతా ప్రోటోకాల్స్ ను అప్ డేట్ చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ సర్వీస్ కావాలంటే కనీసం ప్రతి ట్రిప్‌కు 40 కార్లు అవసరం. KRCL ఆదిశగా పని చేస్తుంది. ఆగస్టు 27 నుంచి ప్రారంభమయ్యే గణపతి ఉత్సవాలకు సకాలంలో ఈ ప్రాజెక్టకు సంబంధించి పైలెట్ రన్ మొదలు పెట్టాలని భావిస్తోంది. ఒకవేళ ఈ పైలెట్ ప్రాజెక్టు సక్సెస్ అయితే, కోలాడ్-గోవా RoRo దేశంలోని ఇతర అధిక డిమాండ్ ఉన్న కారిడార్లకు ఒక రోల్ మోడల్ గా నిలువనుంది. గోవాకు వెళ్లే పర్యాటకులకు ఈ సేవ ఎంతగానో ఉపయోగపడనుంది.
Read Also: ఇండియన్ బుల్లెట్ రైలుకు.. చైనా రెడ్ సిగ్నల్.. అవి ఇవ్వలేమంటూ పేచీ!