Is Iran Alone: ఆపదలో ఉన్నప్పుడు తెలుస్తుంది అసలైన స్నేహితులు ఎవరనేది. ఈ విషయం పహెల్‌గామ్ ఉగ్రదాడుల తర్వాత ఇండియాకు బాగా అర్థమైంది. ఇప్పుడు ఇరాన్‌కు అంతకంటే బాగా అర్థమవుతోంది. ఎందుకంటే అమెరికా దాడుల తర్వాత తనతో కలిసి అడుగులు వేసే వారు ఎవరనేది బాగా తెలిసొచ్చింది. కానీ అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే.. ఇప్పుడు ఇరాన్ ఒంటరి. ఎన్నో స్నేహ దేశాలున్నా ఇప్పుడు ఇరాన్ ఎందుకు ఒంటరిగా మిగిలింది? దానికి కారణమేంటి?
అమెరికా ఎంట్రీతో మారిన సీన్
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య చాలా రోజులుగా దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికే పరస్పర దాడులతో మిడిల్ ఈస్ట్ రీజియన్‌లో టెన్షన్స్ పీక్స్‌కు చేరాయి. కానీ ఎప్పుడైతే ఈ యుద్ధంలోకి అమెరికా ఎంటరైందో సీన్ మారిపోయింది. ఇరాన్‌పై తాము దాడులు చేశామని ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా ఆర్మీ అధికారులు కూడా ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్ పేరుతో దాడులు చేశామని.. అన్ని సక్సెస్ అయ్యాయంటూ ప్రకటించారు కూడా. తాము ఏ విధంగా దాడులు చేశామో చెబుతూ అమెరికన్ ఆర్మీ పనితీరుపై ప్రశంసలు కురిపించుకున్నారు. కానీ ఈ దాడులతో ఇప్పుడు కేవలం మిడిల్ ఈస్ట్‌కే పరిమితమైన టెన్షన్స్.. ఇప్పుడు వాల్డ్ వైడ్‌గా మారాయి.
అమెరికా మూల్యం చెల్లించుకోక తప్పదన్న ఇరాన్
తమ దేశంపై దాడి చేసి అమెరికా పెద్ద తప్పు చేసిందని.. దీనికి తగ్గ మూల్యం చెల్లించుకుంటుందని ప్రకటించింది ఇరాన్. కానీ ఈ మాటలు ఎంతమేరకు నిజమవుతాయనేది ఇప్పుడు కాస్త సందేహంగానే ఉంది. ఇరాన్‌పై అమెరికాపై దాడి చేసిందంటే దానికి చాలా అనుకూల అంశాలు ఉన్నాయి. మిడిల్ ఈస్ట్‌లో ఇజ్రాయెల్ మాత్రమే కాదు.. అరబ్ దేశాల ఫుల్ సపోర్ట్ అమెరికాకే ఉంది. మరి ఇరాన్‌కు వచ్చే సరికి ఆ సీన్ కనిపించడం లేదు. ఇరాన్‌పై దాడిని పైపైన మాత్రమే ఖండించాయి అరబ్ దేశాలు. అది కూడా అన్నీ దేశాలు కాదు. అందుకే ఇరాన్ ఇప్పుడు అమెరికాపై ప్రతీకారం మాట అటుంచి.. కనీసం ఏం చేయలేని పరిస్థితిలో ఉంది. అందుకే తన ప్రతాపాన్ని ఇజ్రాయెల్‌పై చూపిస్తోంది. అది కూడా పెద్దగా వర్కౌట్ కాని పరిస్థితి.
ఎవరిని చీఫ్‌గా నియమించినా మట్టుపెడుతున్న ఇజ్రాయెల్
ఇప్పుడు ఇరాన్ ఎలా ఒంటరిగా మారిందో చూద్దాం.. నిజానికి ఇరాన్ పెంచి పోషించిన హమాస్, హెజ్బొల్లా, హౌతీలు, ఇరాక్‌లోని పలు మిలీషియా సంస్థలను ఇప్పుడు ఇరాన్ ఉపయోగించుకునే అవకాశాలున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు లేవు. ఇజ్రాయెల్ దాడులతో ఇప్పటికే హమాస్, హెజ్బొల్లా లీడర్‌షిప్ తుడిచిపెట్టుకు పోయింది. హమాస్, హెజ్బుల్లాకు ఎవరు చీఫ్‌గా వచ్చినా వారిని మట్టుపెడుతూ వస్తోంది ఇజ్రాయెల్. ఇక రెడ్ సీలోని హౌతీలపై ఈ మధ్య వరుస దాడులు చేస్తూ వారిని అణచివేస్తోంది అమెరికా. సో.. ఇరాన్ ఇన్నాళ్ల పాటు పెంచి పోషించుకున్న సంస్థలు మరీ యాక్టివ్‌గా లేవు. అలాగని తుడిచిపెట్టుకుపోలేదు.
గతంలో ఇరాన్‌పై డైరెక్ట్‌గా దాడులు చేయని ఇజ్రాయోల్
అక్టోబర్ 7 దాడుల తర్వాత ఇజ్రాయెల్ ఓ పద్ధతి ప్రకారం దాడులు చేస్తూ వచ్చింది. ఈ దాడుల వెనక ఇరాన్ ఉన్నట్టు అనుమానించినా.. కావాలనే ఇరాన్‌పై డైరెక్ట్‌గా దాడులు చేయలేదు. మొదట దాడులు జరిపిన హమాస్‌పై ఫోకస్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోయింది. హమాస్ వీక్ కావడంతో.. లెబనాన్‌లో ఉన్న హెజ్బుల్లా దాడులు ప్రారంభించింది. ఇక ఇజ్రాయెల్ ఫోకస్ ఆ సంస్థపై పెట్టి.. వరుస దాడులు చేసింది. ఈ రెండు సంస్థలు వీక్ కావడంతో.. హౌతీలు సీన్‌లోకి ఎంటర్ అయ్యారు. భౌగోళికంగా ఇజ్రాయెల్‌కు యెమెన్ దూరంగా ఉండటంతో.. ఆ బాధ్యతను అమెరికా తీసుకుంది. రెడ్ సీలో కార్గో షిప్‌లను అడ్డుకుంటున్నారన్న పేరుతో హౌతీలపై విరుచుకపడింది. దీంతో ఇరాన్ పెంపుడు సంస్థలు వీక్‌గా మారాయి.
దాడి జరగగానే తెరపైకి చైనా, రష్యా, పాకిస్థాన్ పేర్లు
ఇక ఇతర దేశాల విషయానికి వస్తే సీన్ మరోలా ఉంది. ఎందుకంటే ఇరాన్‌పై అమెరికాపై దాడి జరిపింది అనగానే మొదట వినిపించిన పేర్లు చైనా, రష్యా, పాకిస్థాన్. ఇందులో పాకిస్థాన్ నేరుగా మద్ధతు ఇస్తుంటే.. రష్యా, చైనాలు పరోక్షంగా మద్దతు పలుకుతున్నాయి. ఎందుకంటే ఈ దేశాలతో ఇరాన్‌కు ఉన్న బంధం అలాంటిది. చైనా మెజారిటీ ఆయిల్ దిగుమతులు ఇరాన్ నుంచే చేసుకుంటోంది. ఇక ఇరాన్-రష్యా దోస్తి ఈనాటిది కాదు. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యా ఇరాన్ డ్రోన్లను కూడా వాడింది. అందుకే ఈ రెండు దేశాలు ఇరాన్‌కు అండగా ఉంటాయని అంతా భావించారు. కానీ అలా జరగలేదు.
దాడుల్లో మాత్రం తలదూర్చని అరబ్ దేశాలు
ఇక అరబ్ దేశాల సంగతికి వస్తే.. వారి పరిస్థితి అడకత్తెర పొకచెక్కలా ఉంది. ఇరాన్ తోటి అరబ్ దేశం. అరబ్ దేశాలన్ని దాదాపుగా ఇజ్రాయెల్‌ను వ్యతిరేకించేవే. కానీ ఈ దాడుల్లో మాత్రం తలదూర్చడం లేదు. కారణం అమెరికా. ఈ ఈక్వెషన్‌లో అమెరికా అనే దేశం లేకపోతే.. ఇజ్రాయెల్ ఈ పాటికి నామరూపాల్లేకుండా పోయేది. కానీ అమెరికా అండ ఇప్పుడు ఇజ్రాయెల్‌ను కాపాడుతోంది. అదే సమయంలో ఇరాన్‌ను ఒంటరి చేస్తోంది. అరబ్ దేశాలకు, అమెరికా మధ్య బంధం బలంగా ఉంది. ఈ రెండింటి మధ్య ఉన్న అనేక వాణిజ్య ఒప్పందాలు, ఇంధన అమ్మకాలే వీటికి కారణం. ప్రస్తుతం అరబ్ దేశాల భద్రతకు అమెరికా ఓ కవచంలా ఉంది. అలాంటి అమెరికాను కాదని.. ఏ అరబ్ దేశమైనా అడుగులు వేస్తే.. దాని ఎఫెక్ట్ గట్టిగానే ఉంటుంది. అవసరమైతే మిడిల్ ఈస్ట్‌లో అనేక ఉద్రిక్తతలను పెంచే సత్తా అమెరికాకు ఉంది. అందుకే కోరి కొరివితో తలగొక్కోవడం ఎందుకని.. కనీసం అటువైపుగా కనిపించడం లేదు అరబ్ దేశాలు. అదే సమయంలో ఈ దేశాలు ఇరాన్‌ను పూర్తి స్థాయిలో నమ్మేలా లేవు. ఎందుకంటే 2019లో సౌదీ అరేబియాకు చెందిన అరామ్‌కో ఇంధన ప్రాసెసింగ్ యూనిట్లపై దాడులు చేయించింది ఇరాన్. అందుకే ఇరాన్‌కు ఇతర అరబ్ దేశాల మధ్య అపనమ్మకం అనేది ఓ కాంక్రీట్ గోడలా అడ్డుగా ఉంది.
తాము ఏ సహాయం చేయలేమన్న అరబ్ దేశాలు
అరబ్ దేశాల నేతలు ఇప్పటికే ఇరాన్‌కు క్లియర్ కట్‌గా ఓ సందేశాన్ని పంపాయి. ఈ యుద్ధంలో తాము ఏ సహాయం చేయలేము.. అదే సమయంలో ఇరాన్ తమపై దాడులు చేయవద్దని. ఈ విజ్ఞప్తిని ఇరాన్ ఎంత వరకు పాటిస్తాయన్నది తెలియదు కానీ.. ప్రస్తుతానికి ఇరాన్‌కు తోటి అరబ్ దేశాల మద్దతు లేదని మాత్రం తెలుస్తోంది. అరబ్ దేశాల విషయాన్ని పక్కన పెడితే రష్యా, చైనా ఇప్పుడు ఇరాన్‌ను ఎందుకు ఒంటరి చేశాయి? దానికి వారు చెబుతున్న కారణాలేంటి? పాకిస్థాన్‌ను అమెరికా ఎలా సైలెంట్ చేసింది? ఒక్కో దేశానికి ఒక్కో లేక్క. ఒకరు సత్తా ఉన్నా మొఖం చాటేశారు.. ఒకరు చేసేందుకు ఆసక్తి ఉన్నా.. సత్తా లేదు. మరి ఇరాన్‌కు అండగా నిలిచే విషయంలో ఎవరి రీజన్స్ ఏంటి? ఒక్కో దేశం చెప్పిన కారణాలేంటి? అందులో నిజాలేంటి?
ఇరాన్ ఒంటరిగా మారడానికి అమెరికానే కారణమా?
ఇరాన్ ఒంటరిగా మారడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇందులో అమెరికా వ్యూహం కూడా ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని రోజుల క్రితం పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌తో భేటీ అయ్యారు. వైట్‌హౌజ్‌కు ఆయనను ఆహ్వానించి విందు ఏర్పాటు చేశారు. నిజానికి ఇది చాలా అరుదైన విషయం. కానీ దీని వెనకున్న అసలు వ్యూహం ప్రపంచానికి ఇప్పుడు అర్థమైంది. నిజానికి ఇరాన్‌కు అత్యంత ఆప్త దేశం పాకిస్థాన్. ఇరాన్‌పై ఏమైనా దాడులు జరిగితే.. పాకిస్థాన్ అణు దాడులు కూడా చేస్తోందంటూ ఇరాన్ ప్రభుత్వ పెద్దలు స్టేట్‌మెంట్ ఇచ్చారు. కానీ అలాంటి పాకిస్థాన్ ఇప్పుడు మౌనముద్ర దాల్చింది. అమెరికా దాడులను తాము ఖండిస్తున్నామంటూఓ స్టేట్‌మెంట్ రిలీజ్ చేసి చేతులు దులుపుకుంది. పాకిస్థాన్ ఇలా మౌనముద్ర దాల్చడానికి కారణం అమెరికా వ్యూహమే అని అర్థమవుతోంది. పాక్‌తో పని ఉంది కాబట్టే.. పిలిచి విందు ఇచ్చారు. ఇరాన్‌పై దాడి చేస్తే పాక్ సైలెంట్‌గా ఉండాలి. అందుకే పాక్‌ను వెనకేసుకొచ్చింది అమెరికా. ఉగ్ర దేశమని తెలిసినా.. IMF నిధుల విడుదలకు అడ్డు చెప్పలేదు. ఇప్పుడు దీనికి ప్రతిఫలంగా తనపై నమ్మకం పెట్టుకున్న ఇరాన్‌ను నట్టేట ముంచింది పాకిస్థాన్.
చైనాను పావుగా వాడుకుంటున్న అమెరికా
నిజానికి దాయాది దేశానికి అమెరికా అవసరం ఉంది. నిధుల సమస్యలతో పాటు.. అనేక సమస్యలు పాక్‌ను పట్టి పిడిస్తున్నాయి. అందుకే పాక్ కళ్లకు ఇప్పుడు ఏం కనిపించడం లేదు. ఇక చైనా విషయానికి వస్తే విషయం ఇరాన్ చమురుపై అధికంగా ఆధారపడింది ఈ దేశం. రోజుకు ఒక కోటి 80 లక్షల బ్యారెళ్ల చమురును ఇరాన్ నుంచి కొనుగోలు చేస్తోంది డ్రాగన్ కంట్రీ. కానీ ఇరాన్‌కు మద్దతుగా ఏం చేయలేని పరిస్థితి ఆ దేశానిది. అంతేకాదు ఇప్పుడు చైనాను పావుగా వాడుకుంటోంది అమెరికా. ఇరాన్ కనుక హర్మూజ్ జలసంధిని మూసేస్తే.. ఇప్పుడు మీ దేశానికే నష్టం.. కాబట్టి ఇరాన్‌కు మీరైనా ఆ జలసంధిని మూసేయవద్దని చెప్పండి అంటూ అమెరికా ఓపెన్‌గానే స్టేట్‌మెంట్ ఇచ్చింది. అంటే ఈ జలసంధిని మూసేస్తే మాకేం నష్టం లేదు.. మీకే అని చెప్పకనే చెప్పేసింది. ఇప్పుడు అమెరికా విన్-విన్ సిట్యూవేషన్‌లో ఉందని తేలిపోయింది.
అమెరికాకు వ్యతిరేకంగా గొంత్తెత్తని చైనా
ఇక చైనా కూడా అమెరికాకు వ్యతిరేకంగా పెద్దగా గొంత్తెత్తడం లేదు. అమెరికా-చైనా మధ్య జరుగుతున్న ట్రేడ్ వార్ ఇప్పుడిప్పుడే ఓ కొలిక్కి వస్తోంది. ఇరు దేశాల మధ్య విడతల వారీగా చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో అమెరికాతో నేరుగా తలపడే ఆలోచనలో లేదు చైనా. అందుకే ఆచితూచి స్పందిస్తోంది. ఇరాన్‌పై దాడులను ఇప్పటికే ఖండించిన చైనా.. అమెరికా దాడులు సక్సెస్ అయ్యే అవకాశాలు లేవని మాత్రం తెలిపింది. అంతేకాదు ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చింది. రష్యా పరిస్థితి మాత్రం మరోలా ఉంది. నిజానికి ఇరాన్‌కు ఏమైనా అయితే.. ఏ దేశాలైనా మొఖం చాటేయవచ్చు కానీ.. రష్యా కాదు. ఎందుకంటే ఇరు దేశాల మధ్య బంధం అలాంటిది. ఇరు దేశాల మధ్య వాణిజ్యంతో పాటు.. అనుబంధం ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యాకు ఓపెన్‌గా సహాయం చేసింది ఇరాన్. తమ డ్రోన్లను కూడా అందించింది. ఆ డ్రోన్లతో ఉక్రెయిన్‌పై అనేక దాడులు చేసింది. అందుకే అత్యంత నమ్మకంతో అమెరికా దాడులు చేయగానే ఇరాన్ విదేశాంగమంత్రి రష్యాకు వెళ్లి చర్చలు జరిపారు. కానీ అక్కడ ఆశించినంత సాయం దొరకలేదని సమాచారం.
పుతిన్ ఇచ్చిన స్టేట్ మెంట్‌తో ఇరాన్‌కు భారీ ఎదురుదెబ్బ
ఇదే సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఓ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఈ యుద్ధంలో తాము తటస్థంగా ఉంటామన్నారు. పుతిన్ ఇచ్చిన ఈ స్టేట్‌మెంట్ ఇరాన్‌కు భారీ ఎదురుదెబ్బ అని చెప్పాలి. అయితే తమ నిర్ణయానికి ఓ కారణం ఉందంటున్నారు పుతిన్. ఇజ్రాయెల్ దాదాపుగా రష్యన్ మాట్లాడే దేశమే అంటూ కొత్త వాదనను వినిపించారు పుతిన్. ఇజ్రాయెల్‌లో ఒకప్పటి సోవియట్ యూనియన్, ఇప్పటి రష్యాకు చెందిన వారు 20 లక్షల మంది ఉన్నారని చెబుతున్నారు. ఈ విషయాన్నింటిని పరిగణలోకి తీసుకొని తాము తటస్థంగా ఉన్నామని చెబుతున్నారు ఆయన. పైపైకి ఈ విషయాలు నమ్మబుల్‌గా ఉన్నా.. అసలు విషయాలు వేరే అని తెలుస్తోంది. ప్రస్తుతం ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో తలమునకలై ఉంది రష్యా. ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందులు, ఆయుధాల కొరత ఉన్నట్టు తెలుస్తోంది. ఇలాంటి సమయంలో ఇరాన్‌కు మద్దతుగా బరిలోకి దిగి.. అమెరికాతో యుద్ధం చేయడం సరైన ఆప్షన్ అనుకోవడం లేదు రష్యా. అంతేకాదు ఒక్కసారి అమెరికాకు వ్యతిరేకంగా అడుగులు వేస్తే.. నాటోను రంగంలోకి దించుతుంది అమెరికా. ఇన్నాళ్లు ఒంటరిగా పోరాడుతున్న ఉక్రెయిన్‌కు నాటో జత చేరితే.. రష్యా తీవ్రంగా నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. ఇవన్నీ ఆలోచించే పుతిన్ సైలెంట్‌గా సైడ్ అయిపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇలా ఒక్కో దేశం ఒక్కో కారణం చూపిస్తూ.. ఇరాన్‌ను ఒంటరి చేస్తున్నాయి. మరోవైపు ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్న ఇరాన్ మాత్రం ఒంటరిగానైనా పోరాడాలనే డిసైడ్ అయ్యింది. ఇప్పటికే సిరియా, ఇరాక్‌లోని అమెరికా ఎయిర్‌బేస్‌లను టార్గెట్ చేస్తూ దాడులు మొదలుపెట్టింది. కానీ ఈ దాడులను కొనసాగించే సత్తా మాత్రం ఇరాన్‌కు అంతంతమాత్రమే. అంతేకాదు.. అమెరికా మరోసారి ప్రతిదాడులు చేస్తే ఈసారి ఇరాన్ భారీగా నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. అంతేకాదు ఇరాన్‌లో అధికారమార్పిడి జరగాలంటూ.. ఆ దేశంలో కొత్త కుంపటి పెట్టే ప్రయత్నాలను ఇప్పటికే అమెరికా మొదలుపెట్టింది. మరి ఇరాన్ వీటన్నింటిని తట్టుకొని అమెరికాకు వ్యతిరేకంగా నిలవగలదా? లేదా? అనే ప్రశ్నకు ఇప్పుడు కాలమే సమాధానం చెప్పాలి.
Story By Vamshi krishna, Bigtv