శతాబ్దానికి పైగా చరిత్ర కలిగి భారతీయ రైల్వే సంస్థ రోజు రోజుకు ఎంతో అభివృద్ధి చెందుతున్నది. ఒకప్పుడు నీటి ఆవిరితో నడిచే రైళ్ల నుంచి మొదలుకొని నేడు అత్యధునిక వందేభారత్ స్లీపర్ రైలు వరకు చేరుకుంది. దేశంలోనే అత్యంత వేగంగా నడిచే వందేభారత్ స్లీపర్ రైలు త్వరలో పట్టాలెక్కబోతున్నది. కొత్తనీరు వచ్చి చేరుతుంటే పాతనీరు పోతుంది అన్నట్లుగా, ఓవైపు సరికొత్త రైళ్లు అందుబాటులోకి వస్తుంటే.. మరోవైపు పాత రైళ్లు తమ సర్వీసులకు గుడ్ బై చెప్తున్నాయి. అందులో భాగంగానే ముంబై పశ్చిమ రైల్వేలో గత రెండు దశాబ్దాలకు పైగా సేవలను అందిస్తున్న చివరి నాన్-ఎసి డబుల్ డెక్కర్ కోచ్ రైలు తన సేవలకు స్వస్తి పలికింది. జనవరి 4న చివరి సారిగా ఈ డబుల్ డెకర్ రైలు పరుగులు తీసింది. పలువురు రైల్వే ఉద్యోగులు, అధికారులు హాజరై ఈ రైలుకు తుది వీడ్కోలు పలికారు. దీంతో ఇక భారతీయ రైల్వేలో డబుల్ డెకర్ కోచ్ ల శకం ముగిసినట్లు అయ్యింది.
డబుల్ డెకర్ కోచ్ ల స్థానంలో ICF కోచ్ లు
జనవరి 5 నుంచి డబుల్ డెకర్ కోచ్ ల స్థానంలో ICF కోచ్ లు అందుబాటులోకి తీసుకొచ్చారు రైల్వే అధికారులు. పాత నాన్-ఎసి డబుల్ డెక్కర్ రైలుకు బదులుగా ఐసిఎఫ్ రైలును ప్రారంభించారు. కొత్త ICF రేక్ లో కూర్చునే స్థలంతో పాటు అప్పర్ బెర్త్ ల సౌకర్యం ఉంటుంది. గతంలో ప్రతి డబుల్ డెక్కర్ కోచ్ లో 136 మంది ప్రయాణికులకు సీటింగ్ స్థలం ఉండేది. కారిడార్లు, రైలు డోర్ల దగ్గర ఉన్న స్థలంతో కలిపి మొత్తం 250 నుండి 260 మంది వరకు ప్రయాణించే అవకాశం ఉండేది. మరోవైపు, ICF జనరల్ కోచ్ లో సిట్టింగ్ కోసం 100 సీట్లు ఉంటాయి. అప్పర్ బెర్త్ లతో మరో 60 సీట్లు అందుబాటులో ఉంటాయి. రైలు లే అవుట్ ప్రకారం, ICF మొత్తం సీటింగ్ సామర్థ్యం 160 మంది. నిలబడి ప్రయాణించే వారి సంఖ్యను కలుపుకుని ఈ లెక్క 250కి చేరుకుంటుంది. ప్లేస్ సమస్య రాకుండా ఉండేందుకు రైల్వే అధికారులు అదనంగా మరో నాలుగు కోచ్ లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ నిర్ణయంతో రైలులోని ఇప్పటి వరకు కోచ్‌ల సంఖ్య 18 ఉండగా, ఇకపై ఆ సంఖ్య 22కి పెరగనుంది.
విడిపోయిన డబుల్ డెకర్ రైలు బోగీలు
గత ఏడాది ఆగస్టులో ఈ డబులు డెకర్ రైలు కదులుతుండగా రెండు బోగీలు విడిపోయాయి. కప్లింగ్ విరగడంతో రెండు కోచ్ లు ఊడిపోయాయి. ఆ సమయంలో రైలు నెమ్మదిగా వెళ్తుండటంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణీకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన తర్వాత డబుల్ డెకర్ రైలును సర్వీసు నుంచి తొలగించాలని అధికారులు నిర్ణయించారు. తాజాగా తమ నిర్ణయాన్ని అమలు చేశారు. ఈ సందర్భంగా రైల్వే ఉద్యోగులు, అధికారులు ఆ రైలుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
Read Also: ఇకపై చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి రాకపోకలు చేసే రైళ్లు ఇవే.. చెక్ చేసుకోండి!