Train Accident: అది 1943 అక్టోబర్ 11.. రెండో ప్రపంచ యుద్ధం ముమ్మరంగా సాగుతున్న కాలం. ఆ రోజు ఇంగ్లండ్‌లోని స్టీటన్ సమీపంలో జరిగిన రైలు ప్రమాదం ఓ చరిత్రను సృష్టించింది. లండన్ నుండి గ్లాస్గో, ఎడిన్‌బర్గ్‌లకు వెళుతున్న నైట్ ఎక్స్‌ప్రెస్ రైలు, తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో గడ్డి లోడ్‌తో ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఒక్కసారిగా భారీ కుదుపునకు రైలు గురవ్వడంతో తొమ్మిది కోచ్‌లలోని, 200 మంది ప్రయాణికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ఘటనలో రైలు ఇంజన్ ఒకవైపుకు తిరిగి, రైలు పట్టాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. గూడ్స్ రైలులోని పది వ్యాగన్లు తుక్కుతుక్కుగా మారాయి.
ఇక్కడ ఓ అద్భుతం చోటుచేసుకుంది. ఇంత భారీ ప్రమాదం జరిగినా.. ఒక్కరూ మరణించలేదు. ఓ నలుగురు మాత్రమే గాయపడ్డారు. డ్రైవర్ జాన్ థామస్ బానర్, ఫైర్‌మన్ జార్జ్ వుడ్స్, గార్డ్ జార్జ్ ఐర్లాండ్, ఒక ఎయిర్‌మన్. వీరిని కీగ్లీలోని విక్టోరియా హాస్పిటల్‌కు తరలించారు, అయితే వీరిలో డ్రైవర్ బానర్‌కు మాత్రం ఘటనా స్థలంలోనే ప్రథమ చికిత్స అందించారు. ఇంజన్ తిరిగినప్పుడు క్యాబ్‌లోని రైలును గట్టిగా పట్టుకోవడం వల్ల తనకు పెద్దగా గాయాలు కాలేదు.
ఇక మిగిలిన ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేర్చారు. ప్రయాణికుల్లో ఒకరైన 19 ఏళ్ల జాక్ కాక్‌షాట్ రాయల్ ఎయిర్ ఫోర్స్ సభ్యుడు. తను స్థానికుడైనందున అక్కడి నుంచి త్వరగానే ఇంటికి చేరుకున్నాడు. మిగతా వాళ్లు స్టేషన్‌లో వేచి ఉండగా, లిలియన్ థాంప్సన్ అనే 41 ఏళ్ల మహిళా రైల్వే కార్మికురాలు అక్కడే ఉన్న ట్రావెలింగ్ క్యాంటీన్‌లో వేడి టీ అలాగే ఆహారాన్ని ప్రిపేర్ చేసి ఇచ్చింది. ఇక రైల్వే సంస్థ మూడు గంటల్లో స్కిప్టన్ నుంచి రిలీఫ్ రైలును ఏర్పాటు చేసింది. రైలు మార్గం రిపేరు కావడానికి కొన్ని రోజులు పట్టగా.. ఈ లోగా స్థానిక షటిల్ బస్సులను స్కిప్టన్ ద్వారా డైవర్షన్ ఏర్పాటు చేశారు. ఈ మొత్తం ఘటన నాటి పరిస్థితులను తెలియజేయడమే గాక, యుద్ధ సమయంలో రైల్వే వ్యవస్థ ఎదుర్కొన్న సవాళ్లను, సామాన్య ప్రజల, మహిళల కీలక పాత్రను తెలియజేసింది.