Indian Railways: హిందువులు ఎంతో పవిత్రంగా భావించే మహాకుంభ మేళా వచ్చే ఏడాది 2025 జనవరిలో అంగరంగ వైభవంగా జరగనుంది. ఇప్పటికే ప్రయాగరాజ్ లో మహా కుంభమేళా సందడి మొదలయ్యింది. మరో రెండు నెలల్లో కుంభమేళా ప్రారంభంకానున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే పెద్ద సంఖ్యలో సాధువులు తరలివస్తున్నారు. ఈ వేడుకల కోసం ఉత్తప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. కనీవినీ ఎరుగని రీతిలో భక్తలు తరలి వచ్చే అవకాశం ఉండటంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా యోగీ సర్కారు పకడ్బందీగా చర్యలు చేపడుతోంది.
భారతీయ రైల్వే సంస్థ కీలక నిర్ణయం
మహాకుంభ మేళా వేళ కోట్లాది మంది భక్తలు ప్రయాగరాజ్ కు తరలిరానున్న నేపథ్యంలో భారతీయ రైల్వే సంస్థ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. రద్దీకి అనుగుణంగా దేశ నలుమూలల నుంచి ప్రత్యేక రైళ్లను షెడ్యూల్ చేయనుంది. అంతేకాదు, ప్రయాగరాజ్ రైల్వే స్టేషన్ లో అన్ని రాష్ట్రాల భక్తులకు అర్థమయ్యేలా అనౌన్స్ మెంట్స్ చేయించాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు భారతీయ రైల్వే సంస్థ ప్రతి రైల్వే స్టేషన్ లో మూడు భాషల్లో అనౌన్స్ మెంట్స్ వినిపిస్తాయి. స్థానిక భాషతో పాటు హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రైల్వే ప్రకటనలు చేస్తారు. మహాకుంభ మేళా సందర్భంగా భారతీయ రైల్వే తొలిసారి మల్టీఫుల్ భాషల్లో అనౌన్స్ మెంట్స్ ఇవ్వబోతున్నారు. హిందీ, ఇంగ్లీష్ తో పాటు ఏకంగా 12 భాషల్లో అనౌన్స్ మెంట్స్ ఇవ్వనున్నారు. గుజరాతీ, మరాఠీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, బెంగాలీ, అస్సామీ, ఒరియా, పంజాబీలో ప్రకటనలు చేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రకటనల ద్వారా దేశ వ్యాప్తంగా వివిధ భాషలు మాట్లాడే వ్యక్తులు వారి స్వంత భాషలో రైలు సమాచారాన్ని సులభంగా పొందే అవకాశం ఉంటుందని వెల్లడించారు. ప్రయాగరాజ్ లోని అన్ని రైల్వే స్టేషన్లలో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందన్నారు.
జనవరి 2025లో మహాకుంభ మేళా వేడుకలు
12 ఏండ్లకు ఓసారి జరిగే మహాకుంభ మేళా వేడుకలు జనవరి 2025న జరగనున్నాయి. జనవరి 13 నుంచి యూపీలోని ప్రయాగరాజ్ లో ప్రారంభం కానున్నాయి. మహాకుంభ మేళా హిందువులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రపంచ నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తలు తరలివస్తారు. జనవరి 13న ప్రారంభమయ్యే మహాకుంభ మేళా వేడుకలు ఫిబ్రవరి 26 వరకు కొనసాగనున్నాయి. ఇప్పటికే ఈ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
Read Also: ఓడియమ్మ.. ఒకే రోజు 3 కోట్ల మంది రైలు ప్రయాణం, రైల్వే చరిత్రలోనే అరుదైన రికార్డు
కుంభమేళాకు ప్రత్యేక ప్రాముఖ్యత
హిందూ మతంలో కుంభ మేళాను అత్యంత పవిత్రంగా భావిస్తారు. ప్రతి మూడు సంవత్సరాలకు ఓసారి కుంభమేళా నిర్వహిస్తారు. ప్రతి 6 సంవత్సరాలకు ఓసారి అర్థ కుంభమేళా వేడుకలు జరుపుతారు. ప్రతి 12 సంవత్సరాలకు ఓసారి మహా కుంభమేళాను నిర్వహిస్తారు. పుష్కరకాలానికి ఓసారి జరిగే ఈ వేడుకల్లో పాల్గొని పునీతులయ్యేందుకు ప్రపంచ నలుమూలల నుంచి హిందువులు తరలి వస్తారు.
Read Also: ఒకే ట్రాక్ మీదకు దూసుకొచ్చిన రెండు రైళ్లు.. లోకో పైలెట్ అలా చేసి ఉండకపోతే, భారీ ప్రమాదం