ప్రశాత ప్రదేశం పహల్గామ్ లో ఉగ్రవాదులు రక్తపుటేరులు పారించిన నేపథ్యంలో.. భారత్ ఊహించని ఎదురుదాడి తప్పదని ఉగ్రమూకలను హెచ్చరించింది. ఈ దాడి వెనుక పాక్ హస్తం ఉందని ఆరోపించడంతో పాటు ఆ దేశంతో ఉన్న అన్ని సంబంధాలను తెంచుకుంటున్నట్లు ప్రకటించింది. భారత్ లోని పాక్ హైకమిషన్ అధికారులు, సిబ్బందితో పాటు ఆదేశ పౌరులు తక్షణం దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. మరోవైపు సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వెంటనే పాకిస్తాన్ కు సింధు నీటిని నిలిపివేసింది. భద్రతా బలగాల సెలవులను రద్దు చేయడంతో పాటు దేశ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది.
పాక్ సైన్యం చేతికి రైల్వే స్టేషన్లు
భారత్ నుంచి తీవ్ర ప్రతి ఘటన ఎదురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో పాకిస్తాన్ వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతోంది. తన సైన్యాన్ని సైతం అలర్ట్ చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే స్టేషన్‌లను సాయుధ దళాల నియంత్రణలో ఉంచారు. అవసరమైతే సైనిక పరికరాలను వేగంగా రవాణా చేయడానికి పాకిస్తాన్ సైన్యం అన్ని స్టేషన్ల బాధ్యతను చేపట్టిందని రైల్వే మంత్రి హనీఫ్ అబ్బాసి వెల్లడించారు. ప్రతి స్టేషన్‌లో ప్రత్యేక సైనికుల డెస్క్‌లు ఏర్పాటు చేయబడ్డాయన్నారు. పాకిస్తాన్ రైల్వే కింద ఉన్న అన్ని లాజిస్టిక్‌లు ఇప్పుడు సాయుధ దళాలకు పూర్తిగా అందుబాటులో ఉన్నాయని ధృవీకరించారు. “లాజిస్టిక్‌లు ఇప్పుడు పాకిస్తాన్ సాయుధ దళాల చేతుల్లో ఉన్నాయి. పాకిస్తాన్ రైల్వే ద్వారా యుద్ధ ట్యాంకులు, భారీ ఆయుధాలు, ఇతర యుద్ధ సామాగ్రిని తరలించేలా సమాయత్తం అవుతున్నారు. పాకిస్తాన్ రైల్వేస్ ఆధ్వర్యంలోని అన్ని స్టేషన్లు ఇప్పుడు సాయుధ దళాలతో కలిసి ఎప్పుడు, ఎలా అవసరం అయితే, అలా పని చేయడానికి సిద్ధంగా ఉన్నాయి” అన్నారు.
నీటి సరఫరాను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు
పహల్గామ్ దాడి తర్వాత భారత్- పాక్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల పైనా రైల్వే మంత్రి హనీఫ్ అబ్బాసి సీరియస్ కామెంట్స్ చేశారు. పాకిస్తాన్ కు నీటి సరఫరాను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. “మా బాలిస్టిక్ క్షిపణులు భారత్ వైపు గురిపెట్టి ఉన్నాయి. పాక్ ప్రాదేశిక సరిహద్దులను దాటడం గురించి భారత్ ఆలోచించవద్దని హెచ్చరిస్తున్నాను. పహల్గామ్ దాడి తర్వాత భారత్ దూకుడు చర్యలకు పాల్పడితే, తమ భూమి, నీరు, గాలిని కాపాడుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటాం” ” అని బెదిరింపులకు దిగారు.
భారత్ వాదనలను తోసిపుచ్చిన పాక్
పహల్గామ్ దాడి తర్వాత భారత్ కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన నేపథ్యంలో పాకిస్తాన్ తన భద్రతా దళాలను హై అలర్ట్ లో ఉంచింది. పహల్గామ్ దాడి పాకిస్తాన్ మద్దతు ఉన్న సీమాంతర ఉగ్రవాదం ఫలితమని భారత్ ఆరోపించగా, ఇస్లామాబాద్ తోసిపుచ్చింది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు భారత్ చేసిన ప్రకటనను పాకిస్తా యుద్ధ చర్యగా ప్రకటించింది. ఇక ఈనెల 22న పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. బైసరన్ లోయలో నలుగురు ఉగ్రవాదులు పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఇటీవల భారత్ లో జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి ఇదే కావడంతో అందరూ ఉలిక్కిపడ్డారు.
Read Also: ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం అలర్ట్, కాశ్మీర్ రైల్వే లింక్ భద్రత కట్టుదిట్టం!