Pakistan Train Viral Video: పాకిస్తాన్ లో గత 15 రోజుల్లో మూడు రైలు ప్రమాదాలు జరగడంతో ఆ దేశ ప్రజలు రైళ్లలో వెళ్లేందుకే జంకుతున్నారు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ కు చెందిన ఓ రైలు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో పాకిస్తాన్ రైల్వేకు చెందిన ‘అవామ్ ఎక్స్ ప్రెస్’గా తెలుస్తోంది. ఈ రైలును చూస్తుంటే, ఇందులో అసలు మనుషులే ప్రయాణిస్తారా? అనే అనుమానం కలుగుతుంది. విరిగిన సీట్లు, తుప్పు పట్టిన వాల్స్, ఫ్లోర్ మీద చెత్త కుప్పలు చూస్తేనే వామ్మో అనిపిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది చక్రాల మీద నడుస్తున్న స్క్రాప్ లాగా కనిపిస్తుంది.
వీళ్లకు కాశ్మీర్ కావాలట!
ఈ వీడియోను చూసి సోషల్ మీడియాలో నెటిజన్లు పాకిస్తాన్ పై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఓవైపు దేశంలో ఇలాంటి దుస్థితి ఉంటే.. వీళ్లకు పాకిస్తాన్ కావాలా? అంటూ ప్రశ్నిస్తున్నారు. కొందరు ఈ రైలును ‘కదిలే జంక్‌యార్డ్’ అని అభివర్ణిస్తున్నారు.”మీ రైల్వే వ్యవస్థే ఇంత దారుణంగా ఉన్నప్పుడు, కాశ్మీర్ ను క్లెయిమ్ చేయడానికి ఏ నైతికత ఉంది?” అంటూ మండిపడుతున్నారు. “ఇది కేవలం రైలు కాదు. వైఫల్యానికి కదిలే చిహ్నం” అని మరికొంత మంది రాసుకొచ్చారు.
పతనావస్థకు చేరిన పాకిస్తాన్ రైల్వే
పాకిస్తాన్ లో ఇలాంటి రైళ్లు కనిపించడం కొత్తేమీ కాదు. పాకిస్తాన్ రైల్వే పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోందని గత కొద్ది సంవత్సరాలుగా నివేదికలు వెల్లడిస్తూనే ఉన్నాయి. ఒకప్పుడు అభివృద్ధి చెందిన రైల్వే నెట్ వర్క్ గా ఉండగా, దానికి బడ్జెట్ కోతలతో పాటు నిర్లక్ష్య పూరిత ధోరణి కనబర్చడం కారణంగా పూర్తిగా పతనావస్థకు చేరింది. డజన్ల కొద్దీ రైల్వే స్టేషన్లు మూసివేయబడ్డాయి. అనేక రైళ్లు ప్రమాదకరమైన స్థితిలో నడుస్తున్నాయి. ఈ పరిస్థితి 2023 హజారా ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పడం లాంటి ఘోరాలకు దారితీసింది. ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులు మరణించారు. 2025లో జాఫర్ ఎక్స్ ప్రెస్ బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) దాడికి గురైంది. రైల్వే వ్యవస్థ దుర్బలత్వాన్ని, ప్రభుత్వం తన పౌరులను రక్షించడంలో విఫలమవడాన్ని ఈ ఘటన బహిర్గతం చేసింది.
Read Also: పట్టాలపై వెళ్తున్న రైలు ఒక్కసారే గాల్లోకి.. 29 మంది..
తాజా వీడియోతో పాకిస్తాన్ కు డ్యామేజ్!
తాజాగా వైరల్ అవుతున్న రైలు వీడియో పాకిస్తాన్ కు సంబంధించి ప్రపంచ ప్రతిష్టకు మరింత హానికరం. అంతర్జాతీయ వేదికలపై కాశ్మీర్ సమస్యను లేవనెత్తుతున్న పాకిస్తాన్.. సొంత రైల్వే మౌలిక సదుపాయాలను నిర్వహించలేని దేశంగా ఎక్స్ పోజ్ అవుతోంది. ఉగ్రవాదం మీద డబ్బులు తగలేయడం కంటే, పాకిస్తాన్ తన శిథిలావస్థలో ఉన్న సంస్థలను పునర్నిర్మించడంపై దృష్టి పెట్టాలని విమర్శకులు సూచిస్తున్నారు. లేదంటే ప్రజల ప్రాణాలు పోవడం ఖాయం అని అభిప్రాయపడుతున్నారు.
Read Also: 6 నిమిషాలు.. చీకటి గుప్పిట్లో ప్రపంచం, ఆగష్టు 2న ఏం జరగబోతోందంటే?