Udhampur Srinagar Baramulla Rail Link: కాశ్మీర్ ప్రజల దశాబ్దాల కలనెరవేరబోతోంది. కాశ్మీర్ లోయకు నేరుగా రైలు సర్వీసులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నెలలోనే కత్రా-శ్రీనగర్ రైలు సేవలను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. కాశ్మీర్ వాసుల చిరకాలం వాంఛను నెరవేర్చనున్నారు. ఈ మార్గంలో సరికొత్త వందేభారత్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు. అంతేకాదు, ఇప్పటి వరకు దేశంలో అందుబాటులో ఉన్న వందేభారత్ రైళ్లతో పోల్చితే ఈ రైలు ప్రత్యేకమైన ఫీచర్లను కలిగి ఉంది. ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకుని ముందుకు సాగేలా సిద్ధం చేశారు. ఇప్పటి వరకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కత్రా వరకు రైలు సర్వీసులు అందుబాటులో ఉండగా, ఇప్పడు కాశ్మీర్ లోయతో నేరుగా కనెక్టివిటీ లభించనుంది.
ఈ నెలలోనే కత్రా-శ్రీనగర్ రైల్వే లైన్ ప్రారంభం
ఏప్రిల్ 19న ప్రధాని మోడీ కత్రా నుంచి కాశ్మీర్ వరకు రైలు సేవలను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని గతంలోనే కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. కత్రా- శ్రీనగర్ రైల్వే లింక్ కు సంబంధించి ఇప్పటికే పలుమార్లు ట్రయల్ రన్స్ నిర్వహించారు. అవసరమైన భద్రతా అనుమతులు జారీ అయ్యాయి. ఏప్రిల్ 19న ఉదయం ప్రధాని మోడీ ఉధంపూర్ ఆర్మీ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆ తర్వాత రియాసి జిల్లాలోని చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెనను సందర్శిస్తారు. దాని నిర్మాణం, ఇతర అంశాలపై రైల్వే అధికారుల నుంచి బ్రీఫింగ్ తీసుకుంటారు. వంతెనను సందర్శించిన తర్వాత, కత్రాకు వెళ్లి అక్కడ కొత్త రైల్వే సర్వీసును ప్రారంభిస్తారు.
ముందు కత్రా, ఆ తర్వాత జమ్మూ!
ప్రధాని మోడీ ప్రారంభించే రైలును కొంతకాలం పాటు కత్రా- శ్రీనగర్ మధ్య నడుపుతారు. ప్రస్తుతం జమ్మూ రైల్వే స్టేషన్ విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. అవి కంప్లీట్ అయ్యాక జమ్మూ వరకు ఈ రైలు సేవలను విస్తరిస్తారు. జమ్మూ- శ్రీనగర్- బారాముల్లా మార్గంలో రాకపోకలు కొనసాగుతాయి. ఇప్పటి వరకు ఢిల్లీ నుంచి శ్రీనగర్ కు నేరుగా రైలు సర్వీసులు లేవు. దశాబ్దాలుగా కశ్మీర్ లోయకు భారత్ లోని ఇతర భూభాగాలకు రైల్వే కనెక్టివిటీ లేదు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లు సంగల్దాన్–బారాముల్లా సెక్షన్ వరకే వస్తాయి. సుదూర సర్వీస్ రైళ్లు కత్రా వరకు నడుస్తాయి. త్వరలో రైల్వే సర్వీసులు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. కశ్మీర్ లోయ ప్రాంత వాసులు కూడా తొలిసారిగా రైలు సేవలను పొందే అవకాశం ఉంటుంది.
ప్రపంచంలోనే అత్యంత సవాళ్లతో కూడిన రైల్వే లింక్!
కాశ్మీర్ లోయకు దేశంలోని ఇతర ప్రాంతాలతో మెరుగైన కనెక్టివిటీని పెంచడంలో ఉధంపూర్- శ్రీనగర్- బారాముల్లా రైల్వే లింక్ కీలక పాత్ర పోషించనుంది. ఈ రైల్వే లింక్ ప్రపంచంలోనే అత్యంత సవాళ్లతో కూడిన రైల్వే లింక్ గా గుర్తింపు తెచ్చున్నది. ప్రకృతి సవాళ్లను ఎదుర్కొంటూ అద్భుతమైన రైల్వే బ్రిడ్జిలు, టన్నెల్స్ ద్వారా ఈ రైల్వే లైన్ ను ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిగా గుర్తింపు తెచ్చుకున్న చీనాబ్ రైల్వే బ్రిడ్జి కూడా ఇదే లైన్ లో ఉంది. కత్రా-రియాసి నడుమ ఏర్పాటు చేసిన రైల్వే కేబుల్ బ్రిడ్జి కూడా భారతీయ ఇంజినీరింగ్ అద్భుతంగా నిలుస్తోంది. ఈ రైల్వే లైన్ ప్రారంభం అయిన తర్వాత కాశ్మీర్ కు పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఆ ప్రాంతం పర్యాటకంగా, ఆర్థికంగా బలోపేతం కానుంది. అటు సమ్మర్ వెకేషన్ కోసం కాశ్మీర్ లోయకు వెళ్లేందుకు పర్యాటకులు రెడీ అవుతున్నారు.
Read Also: హైదరాబాద్, వైజాగ్, విజయవాడ నుంచి చౌకగా గోవా ట్రిప్.. రైలు, బస్సు, ఫ్లైట్ కు ఎంత అవుతుంది?